ఏపీ పునర్విభజన చట్టానికి వ్యతిరేకమన్న ఏపీ రైతులు
జల వివాదం నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విద్యుత్ కేంద్రాల్లో వందశాతం విద్యుత్తును ఉత్పత్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ రైతులు హైకోర్టులో పిటిషన్ వేశారు.
జీవో నంబర్ 34 పేరిట జూన్ 28న టీఎస్ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవోపై ఏపీ రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఏపీ పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయని తమ పిటిషన్ లో రైతులు పేర్కొన్నారు. సాగు కోసం ఉపయోగించాల్సిన నీటిని తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తికి వినియోగిస్తోందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ తీరువల్ల నదీ జలాలు నేరుగా సముద్రంలో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.