చరిత్రకు ఆధారాలు శాసనాలు, గ్రంథాలు.. తెలుగు భాష చాలా పురాతనమైనది. ఎంతో అందమైనది కూడా. శాసనాలు అంటే పురాతన కాలంలో రాయి, రాగిరేకు ఆంటి వాటిపై రాసిన అక్షరాలు. పురాతన కాలంలో కాగితం, కాగితంతో తయారు చేసిన గ్రంథాలు ఉపయోగించని కాలంలో రాజులు, చక్రవర్తులు, సామంతులు, జమీందారులు.. తమ రాజ్యపు అధికారిక శాసనాలను రాళ్ళపై, రాతి బండలపై, రాగి రేకులపై చెక్కించి భద్రపరచేవారు. ఇలాంటి అధికారిక ప్రకటనలనే శాసనం అనేవారు. ఉదాహరణకు ‘శిలాశాసనం’ అంటే శిలపై చెక్కించిన శాసనం. ఈ శాసనాలన్నీ ప్రస్తుతం భారత పురాతత్వ శాఖ ఉంటాయి. ఇక తాజాగా నల్లమల అడవుల్లో తెలుగు శాసనాలు దర్శనమిచ్చాయి. ఏపీలోని ప్రకాశం జిల్లా పాలుట్ల గ్రామం వద్ద నల్లమల అడవిలో ఉన్న పోలేరమ్మ దేవాలయం సమీపంలో తెలుగు శాసనం కనిపించింది. 16వ శతాబ్దానికి చెందిన రెండు తెలుగు శాసనాలు ఇవి. యర్రగొండపాలెం మండలం, పాలుట్ల వద్ద ఉన్న నల్లమల అడవుల్లోని పోలేరమ్మ దేవాలయం సమీపంలో ఒక పలకపై చెక్కబడి ఉన్నాయి. పోలేరమ్మ స్థానిక గ్రామ దేవత.
ఈ శాసనాలను పరిశీలించింది పురావస్తు శాఖ. మైసూరులోని పురావస్తు శాఖ డైరెక్టర్మునిరత్నం రెడ్డి ఈ శాసనాలపై స్పందించారు. గురజాలకు చెందిన లింగబత్తుని కుమారుడు జంగం పోలేరమ్మ దేవికి ఊయల స్తంభాలు కట్టినట్లు ఒక శాసనంలో నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.ఇక మరో శాసనంపై అక్షరాలు స్పష్టంగా కనిపించడంలేదు. పులితో పోరాడుతున్న వీరుడిని సూచిస్తున్నట్లుగా ఒక శాసనంపై కనిపిస్తోంది. యర్రగొండపాలెం మండలంలో రెవెన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంట్ తురిమెళ్ల శ్రీనివాస ప్రసాద్ ఈ ప్రాంతంలోని చారిత్రక ప్రదేశాలను అన్వేషిస్తూ శిలాశాసనాలను గుర్తించారు. ఈ శాసనాలను గుర్తించడానికి, లోతైన అడవి లోపల కనీసం 25 నుంచి 30 కిలోమీటర్ల ప్రయాణించవలసి ఉంటుందని ప్రసాద్ చెప్పారు. ఒక దేవత విగ్రహాన్ని కూడా కనుగొన్నారరి.. అది కూడా అదే కాలానికి చెందినదని తెలిపారు.