అసెంబ్లీ ఎన్నికల తర్వాత చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉంటారని నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై హరిరామ జోగయ్య రాసిన ఓ లేఖ వివాదాస్పదమయింది. ఆ లేఖను వైసీపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేయడంతో జనసేన వర్గాల ద్వారా మరో లేఖ విడుదల చేశారు. పవన్ కల్యాణ్ నుంచి తనకు స్పష్టమైన సమాచారం అందిందని.. లోకేష్ చెప్పినట్లుగా సీఎం నిర్ణయం జరగలేదని తెలిసిందన్నారు. గత ఎన్నికల్లో పది వేలకపైగా ఓట్లు వచ్చిన అరవై నియోజకవర్గాలను జనసేన పార్టీ తీసుకుని పోటీ చేయాలని హరిరామ జోగయ్య సూచించారు. జనసైనికులు అందరూ ఓపికగా ఉండి.. ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమిని అధికారంలోకి తీసుకు రావాలని సూచించారు. ఇంతకు ముందు హరిరామ జోగయ్య పేరుతో ఓ లెటర్ వైరల్ అయింది. కాపు సామాజికవర్గానికి పవన్ కల్యాణ్ ఏదో చేస్తాడని ఇన్నాళ్లు నమ్ముతూ వచ్చాం.. కానీ, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రతిపక్షాలు చేస్తున్న ప్యాకేజీ ఆరోపణలు నిజమనిపిస్తున్నాయి అంటూ ఆలేఖ సారాంశంగా ఉంది.. అయితే, సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న లేఖ తన నుంచి వచ్చింది కాదని మాజీ మంత్రి హరిరామ జోగయ్య స్పష్టం చేస్తూ మరో లేఖ విడుదల చేశారు.
టీడీపీ-జనసేన మైత్రిని దెబ్బతీసే విధంగా వైసీపీ సానుభూతి పరులు ‘కాపు సామాజిక వర్గానికి ఒకవిన్నపం’ అంటూ నా పేరుతో ఫేక్ లెటర్ విడదల చేశారని ఆవేదన వ్యక్తం చేశారు జోగయ్య.. దీన్ని జనసైనికులు గమనించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు మరీ ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి ముఖ్యమైన గమనిక అంటూ లేఖ విడుదల చేశారు.. చీప్ ట్రిక్స్ కి పాల్పడుతూ వైసీపీ వారి ట్రాప్ లో పడకుండా తప్పుడు వార్తలను నమ్మకుండా పవన్ కల్యాణ్ సీఎం పీఠం అధిష్టించేవరకు అంతా ఆయన వెంట ఉండాలని లేఖలో మాజీ మంత్రి హరిరామ జోగయ్య లేఖ విడుదల చేశారు.హరిరామ జోగయ్య ప్రస్తుతం జనసేన పార్టీలో లేరు. కాపు సంక్షేమ పేరుతో ఓ సంఘం తరపున లేఖలు రాస్తున్నారు. జోగయ్య రాస్తున్న లేఖలను వైసీపీ వైరల్ చేస్తోంది. కులాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తోందని జనసేన ఆగ్రహం వ్యక్తం చేసింది.