congress-6 guarantee
తెలంగాణ రాజకీయం

28 నుంచి 6 గ్యారంటీ దరఖాస్తులు…

ఆరు గ్యారెంటీల అమ‌లుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా అర్హుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించాల‌ని నిర్ణ‌యించింది. ఈ నెల 28వ తేదీ నుంచి జ‌న‌వ‌రి 6 వ‌ర‌కు సంబంధించి అర్హ‌ుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించ‌నున్నారు. ప్రజాపాలన పక్కడ్బందీగా అమలు చేసేందుకు ఉమ్మ‌డి జిల్లాల‌కు మంత్రుల‌ను ఇంఛార్జిలుగా ఇప్ప‌టికే స‌ర్కారు నియ‌మించిన విష‌యం తెలిసిందే.నిజామాబాద్ జిల్లాకు ఇంచార్జి మంత్రిగా రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నియ‌మితులయ్యారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు నిజామాబాద్ కలెక్టరేట్లోని ఐడిఓసి సమావేశ మందిరంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమావేశమై మంత్రి దిశానిర్దేశం చేయనున్నారు.ఈ స‌మావేశం నిర్వహణ కోసం నియోజకవర్గాల వారీగా ఆర్డీవోలను, మండల ప్రత్యేక అధికారులుగా జిల్లా అధికారులను, మున్సిపల్ వార్డు వారీగా అధికారులను నియమించారు. ఈ సమావేశానికి రెవెన్యూ డివిజనల్ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు తప్పక హాజరు కావలసిందిగా కలెక్టర్లు ఆదేశించారు.

జిల్లాలో ప్రజా పాలన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు నియోజకవర్గం, మండల, గ్రామస్థాయిలలో ప్రత్యేక అధికారుల బృందాలను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు. ఆయా గ్రామాలలో గ్రామ సభలు ఏర్పాటు చేసి మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, రైతు భరోసా తదితర పథకాలు (ఆరు గ్యారెంటీ)ల కోసం ఉదయం 8 నుండి 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2 నుండి 6 గంటల వరకు రెండు ధపాలుగా దరఖాస్తులు స్వీకరించనున్నారు.జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు దశలవారీగా సామాజిక భద్రత, సంక్షేమ పథకాలు ఆరు గ్యారెంటీలు అందించడం కోసం దరఖాస్తుల స్వీకరణ కోసం ఒకరోజు ముందు ఆయా గ్రామాలలో, వార్డుల్లో దండోరా (టామ్ టామ్) వేయించి, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించనున్నారు. గ్రామస్థాయిలో గ్రామపంచాయతీ, పట్టణ స్థాయిలో వార్డు ఆఫీసులలో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమాలు నిర్వహించబోయే తేదీలు సమయాలను ముందస్తుగా ప్రజలకు తెలియజేయాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు.