ఆంధ్రా ఊటి అరకులోయ కాశ్మీర్‌ను తలపిస్తోంది. భానుడి లేలేత కిరణాలతో మంచుకొండలు మిరుమిట్లు గొలుపుతున్నాయి. మరోవైపు కొండలపై దట్టంగా అలముకున్న పొగ మంచు నురగలు కక్కుతున్న పాలసముద్రాన్ని తలపిస్తోంది. అల్లూరి జిల్లా ఏజెన్సీ లో దట్టంగా కురుస్తున్న పొగమంచు సోయగాలతో ప్రకృతి పర్యాటకులను రారమ్మంటోంది. వీకెండ్ కు తోడు క్రిస్మస్ వరుస సెలవు దినాలు కావడంతో పర్యాటకులు అరకువైపు పరుగులు తీస్తున్నారు. మేఘాల కొండలైన వంజంగి, మాడగడ కు పర్యాటకులు పోటెత్తారు. ముందే వచ్చిన సీజన్ తో ఎంజాయ్ చేస్తున్నారు సందర్శకులు. పాడేరు ప్రాంతంలోని వంజంగి మేఘాల కొండ తో పాటు.. అరకు లోయలోని మాడగడ మేఘాల కొండల్లో పాల సముద్రాన్ని తలపించేలా పొగ మంచు కొమ్ముకుంది. ఇక్కడి సుందర దృశ్యాలు చూసేందుకు జనం క్యూ కడుతున్నారు. సూర్యోదయం వేళ కొండల మధ్య లోయలో పాల సముద్రాన్ని తలపిస్తున్న మేఘాల అందాలను ఆస్వాదిస్తున్నారు సందర్శకులు. పొగమంచుతో పాటు చల్లనిగాలులు తోడవడంతో కూల్ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు పర్యాటకులు.
అరకు, పాడేరు, చింతపల్లి ఏజెన్సీలకు క్యూ కడుతున్నారు సందర్శకులు. తెల్లవారు జాము నుంచే మాడగడ, వంజంగి వ్యూ పాయింట్ల తో పాటు లంబసింగిలో సందర్శకులు సందడి చేశారు.సూర్యోదయంలో అద్భుతమైన దృశ్యాలను చూస్తూ సెల్ఫీలలో బంధిస్తూ కేరింతలు కొట్టారు. మాడగడలో పర్యాటకలను ఆకట్టుకునేందుకు ప్రత్యేకంగా దింసా నృత్యాలను ఏర్పాటు చేశారు. వందలాది గా వాహనాలు అరకుకు తరలి వస్తుండడంతో ఘాట్ రోడ్లలో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. టూరిస్ట్ లు అధికంగా రావడంతో అద్దె గదులకు బాగా డిమాండ్ ఏర్పడింది. ప్రభుత్వ, ప్రయివేటు హోటళ్లు పూర్తిగా నిండి పోతున్నాయి. రూములు దొరక్క చాలామంది ఖాళీ ప్రదేశాల్లో చిన్న చిన్న గుడారాలు వేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. పర్యాటకులు చలి మంటలు వేసుకొని రోడ్లపై గడుపుతున్నారు. మరికొందరు వాహనాల్లోనే రాత్రి గడుపుతున్నారు. ఈ మధ్యకాలంలో ఇంత భారీ స్థాయిలో పర్యాటకులు సందర్శనకు రావడం ఇదేనని చిరువ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.