అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జనవరి 22న రామమందిరం ప్రారంభం కానుంది. భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా నాగర శైలిలో ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఆలయ ప్రారంభోత్సవానికి ఆలయ కమిటీ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. 2024, జనవరి 22న అయోధ్య మందిరం గర్భగుడిలో.. రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఆరోజు 84 సెకన్లపాటు శుభ ఘడియలు ఉన్నాయని పండితులు తెలిపారు. ఆ సమయంలో అయోధ్య మందిరంలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగితే దేశం పేరు మారు మోగిపోతుందని వెల్లడించారు. జనవరి 22 వ తేదీ మధ్యాహ్నం 12:29:08 సెకన్ల నుంచి 12:30:32 సెకన్ల మధ్య అత్యంత శుభ ఘడియలు ఉన్నాయి. అయోధ్యకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అద్భుతాలు తరలివెళ్తున్నాయి. విదేశాల నుంచి కూడా కానుకలు రానున్నాయి.తమిళనాడు నమక్కల్ నుంచి 42 గుడి గంటలు అయోధ్యకు బయలుదేరాయి. భారీ లారీలో వీటిని తరలిస్తున్నారు. గుడి గంటలను చూసేందుకు భక్తులు తరలి వస్తున్నారు. ఈ గంటలు సుమారు 2 టన్నుల బరువు కలిగి ఉన్నాయి.
వీటిలో అయోధ్యరామాలయ గర్భాలయంపై మోగనున్న ప్రధాన గంట కూడా ఉంది. దాని బరువు 2.5 టన్నులు. దీనిని కూడా తమిళనాడులోనే తయారు చేశారు.ఇక అయోధ్య రామాలయంలో రామయ్యకు ఇవ్వనున్న మొదటి హారతికి, మహాయజ్ఞానికి స్వచ్ఛమైన దేశీ ఆవు నెయ్యిను పంపుతూ మరోసారి జోధ్ పూర్ వాసులు రామ భక్తుల మదిలో చిరస్థాయిగా నిలుస్తున్నారు. రామయ్య కొలువుదీరనున్న ఆలయంలో దేశీ ఆవు నెయ్యితో తొలి అఖండ దీపం వెలిగిస్తారు. శ్రీరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేసే సందర్భంగా నిర్వహించే మహా యజ్ఞంలో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నుంచి తీసుకొచ్చే నెయ్యితోపాటు హవన సామగ్రినే నైవేద్యంగా సమర్పించనున్నారు. ఈ కార్యక్రమానికి జోధ్‌పూర్‌కు చెందిన యువ సాధువు ఓం సాందీపని మహారాజ్ శ్రీకారం చుట్టారు. ఇంటింటా సేకరించిన ఈ నెయ్యిని ప్రత్యేకంగా సిద్ధం చేసిన 108 ఎద్దుల రథాల్లో అయోధ్యకు తరలించనున్నారు. ఇందుకు 216 ఎద్దులను ఉపయోగించనున్నారు. ఈ రథాల్లో నెయ్యితోపాటు యజ్ఞం హవనంలో సమర్పించే ఒప్పందాలు, హవన సామగ్రిని అయోధ్యకు తరలించనున్నారు.
అయోధ్య రాముడికి సూరత్ కు చెంది ఓ వజ్రాల వ్యాపారి రామాలయ నమూనాతో వజ్రాల కంఠాభరణాన్ని రూపొందించి కానుకగా ఇవ్వబోతున్నాడు. గుజరాత్‌లోని వడోదరకు చెందిన బిహాభాయ్ భర్వాద్ అనే రామభక్తుడు 108 అడుగుల భారీ అగర్ బత్తీని రామాలయానికి కానుకగా ఇవ్వబోతున్నాడు. 3.5 అడుగుల వెడల్పు, 108 అడుగుల పొడవుతో భారీ అగరుబత్తిని తయారు చేశాడు. ఈ అగర్ బత్తి నెలన్నర వరకు వెలుగుతుంది. దీని తయారీలో యజ్ఞంలో ఉపయోగించే వివిధ పదార్థాలను ఉపయోగించారు. ప్రొటోకాల్ ప్రకారం సుమారు 3,500 గ్రాముల బరువున్న ఈ ధూపదీపాన్ని రోడ్డు మార్గంలో రథంలో తీసుకుని జనవరి 1న ఉదయం 10 గంటలకు వడోదర నుంచి అయోధ్యకు బయలుదేరుతారు.తాళాల సిటీగా చెప్పే ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ కు చెందిన సత్యప్రకాశ్ శర్మ రాములోరి భక్తుడు. తాళాల తయారీలో నిపుణుడు. అయోధ్య రామమందిరం కోసం ఈయన ప్రపంచంలోనే అతి పెద్ద తాళం తయారు చేశాడు. ఈ తాళం బరువు 400 కేజీలు.
అయోధ్య ఆలయాన్ని పరిగణలోకి తీసుకొని పది అడుగుల ఎత్తు, 4.5 అడుగులు వెడల్పు, 9.5 అడుగుల మందంతో తయారు చేశాడు. ఈ తాళాన్ని తెరిచేందుకు ఉపయోగించే తాళం చెవి సైజు నాలుగు అడుగుల పొడవు ఉంది. సత్యప్రకాశ్ ఈ తాళాన్ని అయోధ్య రామాలయానికి తరళించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.నేపాల్ నుంచి కూడా అయోధ్య రాముడికి కానుకలు అందనున్నాయి. నగలు, పట్టు వస్త్రాలు, స్వీట్లతో కూడిన పలు వస్తువులను శ్రీరాముడికి సమర్పించనున్నారు. ఇందుకోసం జనక్‌పుర్‌ధామ్–అయోధ్యధామ్ యాత్రను చేపట్టనున్నారు. నేపాల్‌లో జనవరి 12న ఈ యాత్ర ప్రారంభమవుతుంది. జనవరి 20న అయోధ‍్యకు చేరుకుంటుంది. వాళ్లు తెచ్చిన కానుకలను శ్రీరామజన్మబూమి రామమందిరం ట్రస్టుకు అందించంతో యాత్ర ముగుస్తుంది. గతంలో నేపాల్‌లోని కలిగంధకి నదీ తీరంలో లభించే సాలగ్రామ శిలలను సేకరించి శ్రీరాముడి విగ్రహాన్ని నిర్మించడానికి అయోధ్యకు పంపిన సంగతి తెలిసిందే. బీహార్‌లోని మిథిల నుంచి కూడా రాముడికి కానుకలు అందనున్నాయి.జనవరి 22న రామమందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
ఈ క్రమంలో ఏర్పాట్లను పరిశీలించేందుకు ఈనెల 30న అయోధ్యకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో శ్రీరామ్ విమానాశ్రయం నుంచి అయోధ్యరామ్ రైల్వే స్టేషన్ వరకు రోడ్‌షో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికను స్థానిక అధికారులు రూపొందిస్తున్నారు. శ్రీరామ్ ఎయిర్‌పోర్టు సమీపంలోని మైదానంలో నిర్వహించే మోదీ ర్యాలీకి సంబంధించిన బూ‍్లప్రింట్‌ను ఇప్పటికే సిద్ధం చేశారు. ఇదిలావుండగా అయోధ్యలోని నూతన రామాలయ ప్రారంభోత్సవ వేడులకు వచ్చే భక్తులకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌కు చెందిన 165 మంది వైద్యులు సేవలందించనున్నారు. జనవరి 15 నుంచి 30వ తేదీ వరకు నిత్యం నలుగురు డాక్టర్లు భక్తులకు సేవలందించేలా ఏర్పాట్లు చేశారు.