revanth
తెలంగాణ రాజకీయం

వివాదాలకు దూరంగా ఉండండి

తెలంగాణ ఇచ్చిన 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన నాయకులకు దక్కని అవకాశం రేవంత్ రెడ్డికి దక్కింది. తెలంగాణ రాష్ట్ర ద్వితీయ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వాన్ని విజయవంతంగా నడుపుతున్నారు. 10 సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉండటం అంటే మామూలు విషయం కాదు. కార్యకర్తల్లో కట్టలు తెంచుకునే ఆగ్రహం ఉంటుంది. పైగా 10 సంవత్సరాలపాటు అధికారాన్ని చెలాయించిన భారత రాష్ట్ర సమితి కాంగ్రెస్ పార్టీని చాలా వరకు ఇబ్బంది పెట్టింది. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను తన వైపు లాక్కుంది. ఎమ్మెల్సీలను కూడా వదిలిపెట్టలేదు. ఒకానొక దశలో కాంగ్రెస్ పార్టీకి ఉప ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కకుండా చేసింది.. ఇన్ని పరిణామాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో అధికారాన్ని మరింత పరిపుష్టం చేసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భిన్నమైన అడుగులు వేస్తున్నారు. అంతేకాదు తన అనుచర మంత్రులకు చాలా విస్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు.

ఇటీవల జరిగిన కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో రేవంత్ రెడ్డి చాలా ఆగ్రహంగా మాట్లాడారు. సహచర మంత్రులు ఎవర్ని కూడా ఎటువంటి వివాదాల్లో తల దూర్చకూడదని ఆదేశాలు జారీ చేశారు. భూ వివాదాలు ఉంటే వాటిని కోర్టు పరిధి దాకా తీసుకురావాలని.. ఒకవేళ అక్కడ కూడా పరిష్కారం కాకపోతే తదుపరిగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆలోచించాలని సూచించారు. అంతేతప్ప భారత రాష్ట్ర సమితి నాయకుల మాదిరిగా అన్ని వివాదాలలో తల దూర్చితే మాత్రం ప్రభుత్వం ఇబ్బంది పడుతుందని.. భారత రాష్ట్ర సమితికి ఇచ్చిన సమయం కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇవ్వరని గుర్తు చేశారు. ఎంతో కష్టపడితే అధికారంలోకి వచ్చామని.. ఇలాంటప్పుడు ఉన్న అధికారాన్ని పోగొట్టుకునే విధంగా వ్యవహరించొద్దని సహచర మంత్రులకు సూచించారు.. ఇదే సమయంలో తమ మాట వినని ఐఏఎస్ అధికారులను రెండవ మాటకు తావు లేకుండా రేవంత్ రెడ్డి ట్రాన్స్ఫర్ చేశారు.

మొన్నటిదాకా రంగారెడ్డి కలెక్టర్ గా పనిచేసిన భారతి హోలికిరి అకస్మాత్తుగా బదిలీ అవ్వడం వెనుక ఉద్దేశం కూడా అదే అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక వేరే కాకుండా కొంతమంది ఉన్నతాధికారులపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పనిచేయాల్సి ఉంటుందని.. ప్రభుత్వ ఆదేశాలను పెడచెవిన పడితే బదిలీపై వెళ్లిపోవచ్చని స్పష్టం చేశారు.ఈ సంకేతాలు పార్టీపై బలంగానే పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది.. అందుకే ఇప్పటివరకు మంత్రులు ఎవరు కూడా ఎటువంటి హామీలు ఇవ్వడం లేదు. ఎవరైనా సొంత పనుల కోసం తమ వద్దకు వస్తే నిర్మొహమాటంగా చేయలేమని చెబుతున్నారు. అంతేకాదు వ్యక్తిగత కార్యదర్శుల నియామకంలోనూ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఒకరిద్దరూ తప్ప మిగతా మంత్రులు అందరు కూడా వ్యక్తిగత కార్యదర్శులను నియమించుకోలేదంటే సీఎం ఓ ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

వివాదాస్పద నిర్ణయాల జోలికి పోకుంటే వచ్చే పదిహేను సంవత్సరాలు అధికారం మనదే అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన నేపథ్యంలో మంత్రులు చాలా జాగ్రత్తగా మసులుకుంటున్నారు. ప్రస్తుతానికైతే 6 గ్యారంటీల అమలు మీదనే పూర్తిగా దృష్టి సారిస్తున్నారు. ఇక కొంతమంది మంత్రులైతే మీడియాని కూడా దగ్గరికి రానివ్వడం లేదు. కనీసం ఏం జరుగుతుందో కూడా పొక్కనివ్వడం లేదు. సో ఈ పరిణామాలను బట్టి పాలనపై రేవంత్ రెడ్డి పట్టు సాధించారని.. ఆయన పరిపాలన విధానం చూస్తుంటే రాజశేఖర్ రెడ్డి గుర్తుకు వస్తున్నారని మాజీ బ్యూరోక్రాట్లు వ్యాఖ్యానిస్తున్నారు.