విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను కలిశారు. క్రెమ్లిన్‌లో ఆ ఇద్దరి భేటీ జరిగింది. అనేక అంశాలపై వాళ్లు చర్చించుకున్నారు. ఉక్రెయిన్ యుద్ధం గురించి కూడా చర్చించుకున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది తమ దేశానికి రావాలంటూ ప్రధాని మోదీకి పుతిన్ ఆహ్వానం పంపినట్లు జైశంకర్ తెలిపారు. స్నేహితుడు మోదీని మా దేశానికి ఆహ్వానిస్తున్నామని పుతిన్ అన్నారు.రష్యాలో జైశంకర్ 5 రోజుల పర్యటనలో ఉన్నారు. ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్‌ను కూడా ఆయన కలిశారు. ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ప్రధాని మోదీ తన స్థాయికి తగినట్లు ప్రయత్నం చేశారని పుతిన్ పేర్కొన్నారు. శాంతియుతంగా రష్యా సమస్యను పరిష్కరించుకునేందుకు సహకరిస్తున్న భారత్‌కు సమాచారాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు తెలిపారు.
వచ్చే ఏడాది జరగనున్న వార్షిక సదస్సులో మోదీ, పుతిన్ భేటీ అవుతారని మంత్రి జైశంకర్ వెల్లడించారు. ఆ ఇద్దరు నేతలు తరుచూ టచ్‌లో ఉన్నట్లు చెప్పారు. భారత్, రష్యా మధ్య వాణిజ్య ఆదాయం పెరుగుతోందని పుతిన్ పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వృద్ధి రేటు అధికంగా ఉన్నట్లు ఆయన చెప్పారు