ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

మంగళంపల్లి తెలుగువారందరికీ గర్వకారణం

గతంలో ప్రభుత్వ కార్యక్రమంలా జరిపామన్న చంద్రబాబు

కర్ణాటక సంగీత దిగ్గజం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతిని ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. సంగీత కళానిధి డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ తెలుగువారందరికీ గర్వకారణమైన కళాకారుడని చంద్రబాబు కొనియాడారు. ఆ గాయక శిఖామణి గౌరవార్థం ఆయన జయంతిని ప్రతి సంవత్సరం రాష్ట్ర వేడుకగా జరపాలని గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రకటించి అమలు చేశామని అన్నారు.

గుంటూరులోని ప్రభుత్వ సంగీత మరియు నాట్య కళాశాలకు బాలమురళీకృష్ణ పేరు పెట్టామని తెలిపారు. ప్రతి ఏటా ఆయన జయంతి నాడు నిష్ణాతులైన సంగీత కళాకారులకు లక్ష రూపాయల అవార్డును ఇవ్వాలని, సంగీతం నేర్చుకునే ప్రతిభగల విద్యార్థులకు స్కాలర్ షిప్ లు ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చామని చంద్రబాబు వివరించారు. బాలమురళీకృష్ణ రచించిన 300 సంకీర్తనలను రికార్డు చేయించాలని ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.

కానీ ఈ ప్రభుత్వంలో ఆయన జయంతి సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు జరగకపోవడం బాధగా ఉందని పేర్కొన్నారు. నేడు బాలమురళీకృష్ణ జయంతి సందర్భంగా వారి కళాసేవను స్మరించుకుంటూ ఆ కళాభూషణుడికి నివాళులు అర్పిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు.