hafiz saeed
జాతీయం రాజకీయం

ముంబై దాడుల సూత్ర‌ధారి హఫీజ్ స‌యీద్‌ను అప్ప‌గించండి

ల‌ష్క‌రే తోయిబా వ్య‌వ‌స్థాప‌కుడు, 26/11 ముంబై దాడుల సూత్ర‌ధారి హఫీజ్ స‌యీద్‌ను అప్ప‌గించాల‌ని పాకిస్తాన్‌ను భార‌త్ కోరిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. హ‌ఫీజ్ సయీద్‌ను అప్పగించేందుకు చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పాక్ ప్రభుత్వానికి అధికారిక అభ్యర్థనను పంపినట్లు తెలిసింది. మోస్ట్ వాంటెడ్ ఉగ్ర‌వాదుల జాబితాలో హ‌ఫీజ్ స‌యీద్ కూడా ఒక‌రు. ముంబై ఉగ్ర‌దాడుల‌కు సంబంధించి విచార‌ణ నిమిత్తం స‌యీద్‌ను అప్ప‌గించాల‌ని భార‌త్ ప‌దే ప‌దే డిమాండ్ చేస్తున్న‌ప్ప‌టికీ, పాక్ మాత్రం స్పందించ‌డం లేదు.భార‌త్ – పాకిస్తాన్ మ‌ధ్య ఖైదీల అప్ప‌గింత ఒప్పందం లేక‌పోవ‌డంతో ఈ ప్ర‌క్రియ మ‌రింత క్లిష్టంగా మారింది. కాగా.. ఉగ్ర‌వాదుల‌కు నిధులు అందిస్తున్నార‌న్న ప‌లు కేసుల్లో హ‌ఫీజ్ 2019లో అరెస్టు అయ్యాడు. ఈ కేసుల‌కు సంబంధించి అత‌డికి 31 ఏండ్ల జైలు శిక్ష ప‌డింది.

ప్ర‌స్తుతం పాకిస్తాన్ జైల్లో ఉన్న హఫీజ్.. అక్క‌డ్నుంచే దేశ రాజ‌కీయాల‌ను శాసిస్తున్న‌ట్లు ప‌లు క‌థ‌నాలు చెబుతున్నాయి. స‌యీద్ ఏర్పాటు చేసిన ది పాకిస్తాన్ మ‌ర్క‌జీ ముస్లిం లీగ్ పార్టీ.. వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తోంది. ఇదే పార్టీ త‌ర‌పున హఫీజ్ త‌న‌యుడు త‌ల్హా సయీద్ ఎన్ఏ-127 స్థానం నుంచి బ‌రిలోకి దిగుతున్నాడు.