brs-bjp
తెలంగాణ రాజకీయం

బీజేపీకి దగ్గరయ్యేందుకు బీఆర్ఎస్ వ్యూహం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్‌ఎస్‌ హిందుత్వ ఎజెండా ఎత్తుకుందా.. మొన్నటి వరకు ఎంఐఎంతో చెట్టాపట్టాల్‌ వేసుకుని తిరిగి, సమైక్య వాదంపై స్పీచ్‌లు దంచిన నేతలు ఇప్పుడు హిందుత్వమే తమకు శ్రీరామ రక్ష అనుకుంటున్నారా.. సమైక్య వాదానికి బీఆర్‌ఎస్‌ స్వస్తి పలికిందా.. అంటే అవుననే సమాధానం వస్తుంది గులాబీ భవన్‌ నుంచి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ నేతల్లో హిందుత్వానికి మద్దతుగా మాట్లాడుతున్నారు. ప్రాంతీయ వాదాన్ని వదిలేసి జాతీయవాదంపై మాట్లాడుతున్నారు. ఇందుకు తాజాగా ఎమ్మెల్సీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనయ కల్వకుంట్ల కవిత చేస్తున్న వ్యాఖ్యలే నిదర్శనం. ఇటీవల అయోధ్య రామమందిరం గురించి మాట్లాడిన కవిత, తాజాగా డీఎంకే అధినేత ఉత్తరాదివాసులపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. సనాతన ధర్మాన్ని కించపరుస్తుందని కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు.ఇండియా కూటమిలో ఉన్న డీఎంకే నేతలు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సనాతన ధర్మాన్ని అవమానిస్తూ మాట్లాడినప్పుడు, హిందీ మాట్లాడే రాష్ట్రాలను గోమూత్ర రాష్ట్రలంటూ అవహేళన చేసినప్పుడు కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అగ్రనేత అయిన ‘ఎన్నికల గాంధీ’(రాహుల్‌గాంధీ) ఎందుకు స్పందించలేదని కవిత ప్రశ్నించారు.

డీఎంకే నేతల వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హిజాబ్ వివాదంపై కూడా రాహుల్‌గాంధీ త‌న వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అంటేనే మోసం, కుట్ర, మభ్యపెట్టడం అని విమర్శించారు. ‘‘ఈ రోజు మనం చాలా మంది రాజకీయ నాయకుల నుంచి దురదృష్టకరమైన ప్రకటనలను చూస్తున్నాం. కొన్ని వర్గాల నుంచి ఓట్లను సంపాదించడానికి ఈ ప్రక్రియ చివరికి మనం ఊహించలేని విధంగా దేశాన్ని విభజించగలదు’ అని పేర్కొన్నారు.దురదృష్టవశాత్తు కాంగ్రెస్ మిత్రపక్షమైన డీఎంకే పార్టీ నాయకులు లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల కోసం విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా కొంత మంది నేతలు వ్యాఖ్యలు ఉన్నాయి. ఓట్ల కోసం దేశాన్ని అవమానించడం సరికాదు. ఇండియా కూటమికి పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదు. దేశాన్ని ఐక్యం చేయడానికి భారత్ జోడో యాత్ర చేశానని రాహుల్‌గాంధీ చెప్పుకుంటున్నారు. కానీ అందుకు వ్యతిరేకంగా వారి మిత్రపక్షం చేస్తున్న వ్యాఖ్యలపై మాత్రం స్పందించడం లేదు.

కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతినేలా సనాతన ధర్మాంపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడే సీరియస్‌గా తీసుకొని రాహుల్ గాంధీ స్పందించి ఉంటే పదేపదే ఇలా వ్యాఖ్యలు చేసి ఉండేవారు’’ అని కవిత అభిప్రాయపడ్డారు. కేవలం ఎన్నికలప్పుడే పనిచేసే రాహుల్ గాంధీని అందరూ ఎన్నికల గాంధీ అని పిలుస్తారని విమర్శించారు. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని, ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ జవాబుదారీగా ఉండాలని డిమాండ్ చేశారు. దేశానికి రాహుల్గాంధీ ఏం సందేశమిస్తున్నారని ప్రశ్నించారు. కార్మికుల పట్ల గౌరవం ఉందని, హిందీ మాట్లాడే రాష్ట్రాలను అవమానించరాదని, హిందూ వ్యతిరేకి కాదని రాహుల్‌గాంధీ చెప్పాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలో హిజాబ్ వివాదంపై స్పందిస్తూ… ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏవేవో హామీలు ఇస్తుందని, కానీ ఎన్నికల తర్వాత వాటిని విస్మరిస్తుందని కవిత ఆరోపించారు.

హామీలను అమలు చేసి చూపించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదని స్పష్టం చేశారు. ఆ రాష్ట్రంలో గ్యారెంటీల పేరిట హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు పూర్తిగా అమలు చేయలేదని ప్రస్తావించారు. హిజాబ్‌పై నిషేధాన్ని ఎత్తివేస్తామని ఎన్నికల సమయం కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ నిషేధం ఎత్తివేతకు వెనుకాడుతోందని విమర్శించారు. హిజాబ్‌పై కాంగ్రెస్ వైఖరి ఏమిటో రాహుల్‌గాంధీ చెప్పాలని డిమాండ్ చేశారు.