ఏపీలో పొత్తుల సంగతి తేల్చాలని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. తెలుగుదేశం , జనసేన పార్టీలతో పొత్తులకు వెల్లాలని బీజేపీ నిర్ణయించుకుందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. సీట్ల అంశంపైనా చర్చలు జరుపుతున్నారని చెబుతున్నారు. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకపోవడం వల్లనే బీజేపీకి ఎక్కువగా లాభం ఉంటుందన్న అభిప్రాయం మాత్రం గట్టిగా వినిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో బీజేపీని వ్యతిరేకించే పార్టీలు లేవు. ఏపీలో బీజేపీ బలంగా లేదని ఎవరు చెప్పారని.. ఏపీలో 25 మంది ఎంపీల్లో ఏ పార్టీ గెలిచినా బీజేపీ గెలిచినట్లేనని రాజకీయవర్గాలు సెటైర్లు వేస్తూంటాయి. ఇది నిజం కూడా. ఎందుకంటే ఏపీలో టీడీపీ, వైసీపీ పార్టీకి చెందిన ఎంపీలు బీజేపీకి వ్యతిరేకంగా లేరు. పార్లమెంట్ లో అన్ని విధాలుగా మద్దతిస్తున్నారు. జనసేన పార్టీకి ఎంపీలు లేకపోయినా సపోర్ట్ మాత్రం.. బీజేపీకే ఉంటోంది. అన్ని పార్టీలు బీజేపీకి మద్దతుగానే ఉన్నప్పుడు మరి బీజేపీ ఓ పార్టీతో పొత్తులకు వెళ్లాల్సిన అవసరం ఏమిటన్నది రాజకీయవర్గాలకు అంతుబట్టని విషయం.
అయితే బీజేపీ తమ కూటమిలో ఓ పార్టీ ఉండాలని కోరుకుంటోందని చెబుతున్నారు.ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2014 సీన్ 2024 ఎన్నికల్లోనూ రిపీట్ అవుతుందా ? తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు మళ్లీ కలుస్తాయా అన్నది గత ఏడాది కాలంగా పదే పదే ప్రచారంలోకి వస్తూనే ఉంది. కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు అవే సంకేతాలను సూచిస్తున్నాయి. ఆగస్టులో ఢిల్లీలో నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో విభేదాలను పక్కనపెట్టి ప్రధాని మోడీ టీడీపీ అధినేత చంద్రబాబుకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. సమావేశం ముగిసిన తర్వాత ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. దీంతో ఇద్దరు నేతల మధ్య విభేదాలు సమసిపోయాయని రెండు పార్టీల మధ్య పొత్తులు ఉంటాయన్న ప్రచారం అప్పట్లోనే మొదలైంది. 2014 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన కాంబినేషన్ హిట్ అయింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు విడివిడిగా పోటీ చేసి అన్ని పార్టీలూ నష్టపోయాయి. టీడీపీ 23 స్థానాలకే పరిమితమైతే జనసేనకు ఒకే ఒక్క సీటు వచ్చింది. బీజేపీ ఒక్క శాతం ఓట్లే దక్కించుకుని నోటా కంటే తక్కువ స్థాయి పార్టీగా నిలిచింది. పవన్ కళ్యాణ్ అనుకున్న స్థాయిలో ప్రభావితం చేయలేకపోయారు.
స్వయంగా తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓటమి చెందారు. 2019 ఎన్నికల తర్వాత బీజేపీ-జనసేన తిరిగి ఏకమయ్యాయి. టీడీపీ కూడా బీజేపీతో గ్యాప్ తగ్గించుకునే ప్రయత్నం చేసింది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ.. ఆ కాంబినేషన్ మళ్లీ వర్కవుట్ అవుతుందా..? అనే చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ మధ్య ఉన్న కొద్దిపాటి సమస్యలు పరిష్కారం అవుతాయని.. కలిసే ఎన్నికలకు వెళ్తామని జనసేనాని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేస్తూ వ్సతున్నారు. బహిరంగంగా చెప్పకున్నా.. టీడీపీ-బీజేపీ కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు నిర్ణయం తీసేసుకున్నాయనేలా.. కొంత కాలంగా రాజకీయ ప్రచారం జరుగుతోంది. ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలనా విజయాల ప్రచారం కోసం నిర్వహించిన బహిరంగసభల్లో ఏపీ ప్రభుత్వంపై అమిత్ షా, జేపీ నడ్డా తీవ్ర విమర్శలు చేశారు.ఈ ఏడాదిలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజును తప్పించి పురంధేశ్వరికి బాధ్యతలు అప్పగించారు. దీంతో ఏపీ నేతల్లో కూడా స్పష్టమైన మార్పు కన్పిస్తోంది. నాయకత్వ మార్పు తర్వాత పొత్తుల అంశం, టీడీపీ అధినేత చంద్రబాబు మీద విమర్శలు తగ్గిపోయాయి. ప్రస్తుత ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సీఎం జగన్ టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు. మరిది చంద్రబాబును పురంధేశ్వరి ఎక్కడా పల్లెత్తు మాట అనడం లేదు.
పొత్తులపై పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత బీజేపీ సంపూర్ణ స్థాయిలో చంద్రబాబుకు మద్దతు పలికింది. ఆ కేసు విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ అరెస్టు చేసిన విధానాన్ని మాత్రం ఖండించారు. తెలంగాణ నేతలు కూడా ఖండించారు. కొంత మంది కేంద్ర నేతలు కూడా జగన్మోహన్ రెడ్డి తీరును విమర్శించారు. ఢిల్లీలో జరిగిన ఎన్టీఆర్ వంద రూపాయల నాణెం విడుదల సందర్బంగా ఎన్టీఆర్ కుటుంబసభ్యులంతా కలుసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అదే సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రావడం చంద్రబాబు, నడ్డా పక్కపక్కన కూర్చొని మాట్లాడుకోవడంతో ఏపీలో టీడీపీ, బీజేపీ మళ్లీ కలుస్తాయంటూ ప్రచారం జోరుగా సాగిందిఅయితే ఏపీలో ఏదో ఓ పార్టీతో పొత్తు పెట్టుకుంటే మరో పార్టీ వ్యతిరేకం అవుతుంది. ఆ పార్టీ ఇండియా కూటమి వైపు వెళ్లదని గ్యారంటీ లేదు. అందుకే రెండు పార్టీలతోనూ బీజేపీ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది. కానీ ఎన్నికలకు ముందు పొత్తులు పెట్టుకోవడానికే రెడీ అయినట్లుగా తెలుస్తోంది. వైసీపీ కూటమిలో చేరడనికి అంగీకరించదు. మద్దతు ఇవ్వడం వరకూ సిద్ధమే. ఆ పార్టీకి బీజేపీ ముఖ్యం కాదు..కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ముఖ్యం.
రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్‌కు మద్దతు తెలుపుతారు. అంతే కానీ వ్యతిరేకించే అవకాశం ఉండదు. ఆ పార్టీ పరిస్థితి అలాంటిది. అందుకే ఓ పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉండాలని బీజేపీ గట్టిగా అనుకుంటోంది. గతంోల ఎన్డీఏలో చేరిన పార్టీ.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్నందున టీడీపీని కూటమిలో పెట్టుకోవాలన్న ఆలోచనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.