tata technologies
తెలంగాణ రాజకీయం

2 వేల కోట్లతో ట్రైనింగ్ సెంటర్

తెలంగాణ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి ‘టాటా’ టెక్నాలజీస్ ముందుకొచ్చింది. రాష్ట్రంలో సుమారు రూ.2 వేల కోట్లతో స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డితో సంస్థ ప్రతినిధులు డిసెంబరు 30న సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సీఎంతో చర్చించారు. రాష్ట్ర యువతకు ఉపాధి ఆధారిత పారిశ్రామిక శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ కోసం టాటా టెక్నాలజీస్ సంస్థ ముందుకు రావడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో నైపుణ్యశిక్షణ కార్యక్రమాలు అమలు చేసేందుకు టాటా టెక్నాలజీస్‌ అంగీకరించింది. దాదాపు లక్ష మంది విద్యార్థులు పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందేలా శిక్షణ అందించనుంది. టాటా సంస్థతో కలిసి ప్రభుత్వం పనిచేసేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలి. రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐల్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన ఆధునిక కోర్సులను ప్రవేశపెడతాం.

యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. సాంకేతిక కోర్సులు పూర్తిచేసిన వెంటనే ఉద్యోగం, ఉపాధితో పాటు సొంతంగా పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అవసరమైన కోర్సులు తీసుకువస్తామని సీఎం అన్నారు. రాష్ట్రంలోని పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)ల్లో ప్రస్తుతం ఉన్న కోర్సుల స్థానంలో ఆధునిక పారిశ్రామిక అవసరాలతో పాటు ఉద్యోగం, ఉపాధి లభించేలా శిక్షణ కోర్సులు ప్రవేశపెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఇందుకు ప్రభుత్వం అన్నిరకాలుగా సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎంపిక చేసిన 50 ప్రభుత్వ ఐటీఐల్లో రూ.2000 కోట్లతో ఉపాధి ఆధారిత పారిశ్రామిక శిక్షణ అందించేందుకు టాటా టెక్నాలజీస్‌ సంస్థ ముందుకు వచ్చింది. 22 స్వల్పకాలిక, 5 దీర్ఘకాలిక కోర్సులకు ప్రణాళిక రూపొందించిన టాటా టెక్నాలజీస్.. రాష్ట్ర వ్యాప్తంగా 50 ఐటీఐ కళాశాలల్లో స్కిల్ డెవలప్‌మెంట్‌కు ప్రతిపాదించింది. టాటా టెక్నాలజీస్‌తో ఒప్పందం చేసుకునేందుకు ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించాం.

యువతకు ఇండస్ట్రియల్‌ ఆటోమేషన్‌, రోబోటిక్స్‌, ఐవోటీ, ఆధునిక సీఎన్‌సీ మిషనింగ్‌ టెక్నీషియన్‌, ఈవీ మెకానిక్‌, బేసిక్‌ డిజైనర్‌, వర్చువల్‌ వెరిఫైయర్‌, వీఆర్‌ అసిస్టెడ్‌ వెల్డింగ్‌, పెయింటింగ్‌, అడ్వాన్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ లాంటి 4.0 పరిశ్రమ ఆధారిత కోర్సుల్లో నైపుణ్య శిక్షణను ప్రభుత్వ ఐటీఐల్లో టాటా సంస్థ అందిస్తుంది. వీటికి అవసరమైన యంత్రాలు, సాఫ్ట్‌వేర్‌తో పాటు ప్రతి ఐటీఐలో మాస్టర్‌ ట్రైనర్లను ఏర్పాటు చేస్తుంది. అయిదేళ్లపాటు ఈ ప్రాజెక్టును ఉచితంగా నిర్వహిస్తుంది. ఆధునిక సాంకేతిక వర్క్‌షాపులు, అత్యధిక డిమాండ్‌ కలిగిన తయారీ రంగంలో ఉపాధి కల్పించేందుకు పాలిటెక్నిక్‌, ఇంజినీరింగ్‌ విద్యార్థులకు కూడా 22 కొత్త స్వల్పకాలిక, అయిదు దీర్ఘకాలిక కోర్సులను ఈ ప్రాజెక్టులో టాటా అందించనుంది. ఒప్పందం కోసం ఇప్పటికే కార్మికశాఖ టాటా సంస్థతో చర్చలు జరుపుతోంది’ అని సీఎం తెలిపారు