తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. త్వరలో రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్‌పై పార్టీలు కన్నేశాయి. అయితే రానున్న సార్వత్రిక ఎన్నికలు సీఎం రేవంత్‌రెడ్డికి పరీక్షగా మారనున్నాయా..? మోదీ మానియాలో బీజేపీ దూకుడు అడ్డుకోవడం రేవంత్‌కు సవాల్‌గా మారనుందా..? అసెంబ్లీ ఎన్నికల ఓటమికి రివేంజ్ కోసం ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్‌కు.. రేవంత్ ఎలా చెక్ పెట్టనున్నారు.. ఇప్పుడిదే తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.తెలంగాణలో కొత్త సర్కార్ కొలువుదీరి… 20 రోజులు దాటింది. గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూనే.. అభివృద్ధి, సంక్షేమాన్ని పట్టాలెక్కించేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ సమయంలో త్వరలో రానున్న పార్లమెంట్ పరీక్షలు సవాల్‌గా మారాయి. అసెంబ్లీ గెలుపుతో జోష్‌లో ఉన్న రేవంత్ రెడ్డికి.. లోక్‌సభ ఎన్నికల్లో గట్టెక్కడం కత్తిమీద సవాల్‌గా మారింది.దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈసారి కాస్త ముందుగానే షెడ్యూల్ వస్తుందన్న ప్రచారం జరుగుతోంది.
అయితే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగినా.. మార్చిలో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. ఇందుకోసం ఓవైపు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టేందుకు బీజేపీ దూకుడు పెంచింది. దేశంలో మోదీ మానియాతో మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తోంది. తాజాగా తెలంగాణలో పర్యటించిన అమిత్ షా.. రాష్ట్ర బీజేపీ నేతలకు 10 సీట్లు గెలవాల్సిందేనని టార్గెట్ ఫిక్స్ చేశారు. హైకమాండ్ టార్గెట్ కోసం ఛేదించడం కోసం ఇప్పటికే తెలంగాణ కమలదళం ముందుకెళ్తోంది.ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్.. సార్వత్రిక ఎన్నికల్లో పూర్వవైభవం చాటుకునేందుకు తహతహలాడుతోంది. ఇప్పటికే గులాబీ బాస్ కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గెలుపు కోసం సమీక్షలు జరుపుతూ.. గెలుపు గుర్రాలను వెతికే పనిలో ఉన్నారు.మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టగా… కాంగ్రెస్ మాత్రం ప్రస్తుతం పాలనపై దృష్టి సారించింది.
తెలంగాణలో కొత్తగా అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీ… ఇంకా పూర్తిస్థాయిలో క్యాబినెట్ విస్తరణ కూడా జరగలేదు. గత ప్రభుత్వం తెలంగాణను అప్పుల పాలు చేసిందని ఆరోపిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి.. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేయడం కత్తిమీద సాముగా మారింది.ఈ క్రమంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రజా పాలన ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డికి పార్లమెంట్ ఎన్నికలు సవాల్ విసరడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఎన్నికలు బీజేపీ, బీఆర్ఎస్‌కే కాదు.. రేవంత్‌రెడ్డికి రాజకీయంగా పరీక్షగా మారాయి. ఈ ఎన్నికల్లో గెలిస్తే కాంగ్రెస్ పార్టీలో, తెలంగాణలో తిరుగులేని నేతగా రేవంత్‌రెడ్డి నిలుస్తారు. లేదంటే సొంత పార్టీ నుంచే రేవంత్ ఊహించని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న చర్చ జరుగుతోంది.పార్లమెంట్ ఎన్నికల నాటికి రేవంత్ ఇచ్చిన హమీలు పట్టాలెక్కితేనే.. కాంగ్రెస్‌కు ప్లస్ అవుతుంది. ఆరు గ్యారంటీల అమలుకు రేవంత్ సర్కార్ వంద రోజులను టార్గెట్‌గా పెట్టుకుంది.
ఈ లెక్కన మార్చి రెండో వారంలో రేవంత్ వంద రోజుల పాలన పూర్తి అవుతుంది. దీంతో ఆరు గ్యారంటీలు అన్నీ క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో అమలు కానప్పటికి గ్రౌండ్‌లో శ్రీకారం చుట్టాల్సిన పరిస్థితి. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పుల్లో ఉండటంతో.. ఆరు గ్యారంటీలకు నిధులు ఎలా సమకూర్చుకుంటుంది? వాటిని ప్రజల వద్దకు ఎలా చేర్చాలన్నది కాంగ్రెస్ సర్కార్‌ను కలవరపెడుతోంది. వాటిలో మహలక్ష్మిలో ప్రతి పేద మహిళలకు 2 వేల 500 నగదు, రైతు భరోసా, రైతు రుణమాఫీ ఏక కాలంలో చెల్లించడం.. రేవంత్ సర్కార్‌కు పెద్ద భారంగా కానుంది.మొత్తంమ్మీద అధికారంలో వచ్చామన్న సంతోషం ఓవైపు.. త్వరలో రానున్న పార్లమెంట్ ఎన్నికల భయం మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డిని కలవరపెడుతున్నాయి. గతంలో మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచిన రేవంత్‌కు పార్లమెంట్ ఎన్నికలు కలిసొచ్చి.. సీఎం వరకు నడిపించాయి. ఇప్పుడు అదే పార్లమెంట్ ఎన్నికలు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్‌కు ఎలాంటి ఫలితాలను కట్టబెడతాయో చూడాలి.