వైఎస్ విజయమ్మ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.కుటుంబంలో జరుగుతున్న వ్యవహారాలతో సతమతమవుతున్నారు. కుమారుడు జగన్ వైపు ఉండాలా? కుమార్తె షర్మిల వెంట నడవాలా? అన్నది తెలియక సందిగ్ధంలో పడ్డారు. రాజశేఖర్ రెడ్డి బతికున్నంత కాలం ఆయనతో వేదికలు పంచుకోవడమే తప్ప.. ఏనాడు రాజకీయాలు చేసిన దాఖలాలు లేవు. ఆయన అకాల మరణంతో కుమారుడు జగన్ రాజకీయ భవిష్యత్తు కోసం బయటకు రావాల్సి వచ్చింది. అటు కుమార్తె తెలంగాణలో పార్టీ పెట్టడంతో ఆమె వెంట నడవాల్సి వచ్చింది. అయితే షర్మిల యూటర్న్ తీసుకోవడంతో ఎవరు వైపు నిలవాలా అని.. నడిరోడ్డుపై విజయమ్మ నిలబడ్డారు.వైసిపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా వైఎస్ విజయమ్మ కొనసాగారు. అయితే రెండేళ్ల కిందట ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఏపీలో తన కుమారుడు జగన్ అనుకున్నది సాధించారని.. ఇప్పుడు ప్రజలు అండగా ఉన్నారని.. అందుకే నేను విడిచిపెట్టిన పరవాలేదని చెప్పి గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేశారు.
రెండు రాష్ట్రాల్లో ఇద్దరు బిడ్డలు రాజకీయం చేస్తారని.. ఒకరిపై ఒకరు పోటీ చేయరని క్లారిటీ ఇచ్చారు. కానీ అలాంటి పరిస్థితి లేదని తాజాగా తేలిపోయింది. ఇప్పుడు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునేందుకు సిద్ధపడ్డారు. దీంతో ఎటువైపు వెళ్ళాలో తెలియడం లేదు విజయమ్మకు. ఆమె రాజకీయంగా బయటకు రాకపోవచ్చు కానీ.. షర్మిల తో మాత్రం ఉండే అవకాశం ఉంది. అయితే ఆమె ఎలా చూసుకున్నా షర్మిల వైపు మొగ్గు చూపే పరిస్థితులు మాత్రం కనిపిస్తున్నాయి.రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో జగన్ కు సీఎం పోస్టు ఇప్పించాలని విజయమ్మ ప్రయత్నించారు. అగ్ర నాయకురాలు సోనియా గాంధీ కి కలిసి విజ్ఞప్తి చేశారు. కానీ ఆమె నుంచి సానుకూలత రాలేదు. దీంతో జగన్ వైసీపీని ఏర్పాటు చేశారు. హై కమాండ్ ఆగ్రహానికి గురయ్యారు. జైలు జీవితం కూడా అనుభవించారు. ఆ సమయంలో విజయమ్మ కీలక పాత్ర పోషించారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలి పదవితో పాటు 2014 ఎన్నికల్లో విశాఖ లోక్ సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ ఓటమి తప్పలేదు. అయినా సరే జగన్ ను వీడలేదు.
గత ఎన్నికల ముందు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి కుమారుడి కోసం మద్దతు కూడగట్టారు. ప్రజల కోసం ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ఆమె ఆకాంక్షకు అనుగుణంగా జగన్ అధికారంలోకి వచ్చారు. కానీ షర్మిల తో తలెత్తిన విభేదాలతో జగన్ కు విజయమ్మ దూరమయ్యారు. తాము ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్టు.. తెలంగాణ రాజకీయాల్లో షర్మిల రాణించలేకపోయారు. ఏపీకి రావాల్సిన అనివార్య పరిస్థితి ఎదురయ్యింది. దీంతో విజయం పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఒకవైపు అధికారంలో ఉన్న కుమారుడు.. మరోవైపు తన భర్త చివరి వరకు ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ లో కుమార్తె. దీంతో ఎటు వెళ్లాలో తెలియక విజయమ్మ మధనపడుతున్నారు. కొద్దిరోజులపాటు సైలెంట్ గా ఉంటారని తెలుస్తోంది.