police officials
తెలంగాణ రాజకీయం

పోలీసులపై 480 ఫిర్యాదులు

సివిల్ వివాదాలు, కోర్టు పరిధిలో ఉన్న కేసుల్లో తలదూర్చితే సీరియస్ పరిణామాలుంటాయని ఎస్సై, సీఐలను హెచ్చరిస్తున్నారు ఉన్నతాధికారులు. ఎలాంటి ఆరోపణలు వచ్చినా తక్షణ చర్యలు ఉంటాయంటున్నారు. అంతేకాదు డిపార్ట్‌మెంట్‌లో ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నారు. గతంలో ఎలా ఉన్నా, ఇప్పుడు మాత్రం పద్దతి మార్చుకోవాలని వార్నింగ్స్ ఇస్తున్నారు. పలు వివాదాల్లో తలదూర్చిన ఇన్స్‌పెక్టర్స్‌ను ఇప్పటికే సస్పెండ్ చేసిన పోలీస్ బాసులు.. మరికొందరిపైన ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నారు. పోలీస్ డిపార్ట్‌మెంట్ అంటేనే అవినీతికి ఎక్కువగా ఉంటుందని, డబ్బులిస్తే నిందితులకు కూడా సహకరిస్తారని అపవాదు ఉంది. అంతేకాదు పొలిటికల్ లీడర్స్ కి తొత్తుగా వ్యవహరిస్తారనే మచ్చ ఉంది. దానికి తగ్గట్టుగానే ఇన్ని రోజులు పోలీసులు ప్రవర్తించారు. ఎలాంటి కేసులైనా తామే డీల్ చేస్తూ, సెటిల్‌మెంట్లతో అందినకాడికి వెనకేసుకున్నారు.

సివిల్ కేసుల్లో రియల్టర్స్, ల్యాండ్ గ్రాబర్స్‌కు సపోర్ట్ చేస్తూ, బాధితులకు అన్యాయం చేసిన కేసులూ ఉన్నాయి. కొన్ని కోర్టు పరిధిలో ఉన్న కేసుల్లో అత్యుత్సాహం చూపించారు. హై లెవల్ కేసుల్లో కూడా ఎస్సై, సీఐ స్థాయి అధికారులు పైస్థాయి అధికారులకు చెప్పకుండా డీల్ చేశారు. అయితే, ఇకపై ఇవన్నీ చెల్లవంటున్నారు పోలీసు ఉన్నతాధికారులు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజల సమస్యలు, ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ప్రజావాణి ఏర్పాటు చేశారు. ప్రతీ మంగళవారం, శుక్రవారం ప్రజావాణిలో పోలీసులపై కూడా భారీగా కంప్లెయింట్స్ వస్తున్నాయి. సివిల్ వివాదాల్లో బాధితులను బెదిరించడం, కోర్టు కేసుల్లో తలదూర్చడం, నోటీసులు ఇవ్వకుండా పిలింపించి ధమ్కీలు ఇవ్వడం, సెటిల్‌మెంట్ చేస్కోవాలని బెదిరించడం లాంటివి చేశారని పోలీసులపై ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రజావాణిలో పోలీసులపై వచ్చిన కంప్లెయింట్స్ పై స్పెషల్ బ్రాంచ్, ఇంటలిజెన్స్ పోలీసులతో విచారణ చేయిస్తున్నారు పోలీస్ ఉన్నతాధికారులు.

విచారణలో పోలీసుల పాత్ర ఉందని తేలితే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.ఎఫ్ఐఆర్ చేయకుండా ఓ వర్గం వారి నుంచి డబ్బులు తీసుకుని అవతల వర్గం వారిని సెటిల్‌మెంట్ చేసుకోవాలని ఫోర్స్ చేస్తున్నారు కొందరు ఇన్స్‌పెక్టర్లు. ఇలాంటి ఫిర్యాదులు ప్రజావాణిలో నమోదు అవుతున్నట్లు సమాచారం. ఇలాంటి ఎక్కడ జరిగినా ఉన్నతాధికారులకు కంప్లెయింట్ చేయాలని సూచిస్తున్నారు పోలీసులు. ఇక పలు వివాదాస్పదమైన కేసుల్లో ఆయా కేసుల తీవ్రతను బట్టి ఏసీపీ, డీసీపీ, పోలీస్ కమిషనర్లకు సమాచారమివ్వాలని లా అండ్ ఆర్డర్ ఇన్స్‌పెక్టర్లకు ఆదేశాలిచ్చారు పోలీసు ఉన్నతాధికారులు.ఇప్పటివరకు ప్రజావాణిలో పోలీసులపై రాష్ట్రవ్యాప్తంగా 480 ఫిర్యాదులు వచ్చినట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. వీరందరిపై ఇన్వెస్టిగేషన్ చేయిస్తామంటున్నారు. మరోవైపు ఇప్పటికే పలు వివాదాల్లో తలదూర్చిన ఇన్స్‌పెక్టర్‌లపై సస్పెన్షన్ వేటు వేశారు హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ బాస్‌లు. సైబరాబాద్ పరిధిలో ఇద్దరు సీఐలు, ఒక ఎస్సైని సస్పెండ్ చేయగా, ఇద్దరు ఇన్స్‌పెక్టర్లను హెడ్ ఆఫీస్‌కు అటాచ్ చేశారు.

హైదరాబాద్ పరిధిలో పంజాగుట్ట సీఐని సస్పెండ్ చేశారు.మొత్తంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమీషనరేట్ల పరిధిలో మరో 18 మంది ఇన్స్‌పెక్టర్ స్థాయి అధికారులపై ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు.. ఆరోపణలు నిజమని తేలితే వారిపై చర్యలు ఉంటాయని చెబుతున్నారు. ఇప్పటికే కొత్తగా వచ్చిన పోలీస్ కమిషనర్లు ఆయా కమీషనరేట్ల పరిధిలో ఇన్స్‌పెక్టర్లతో మీటింగ్స్ పెట్టి వార్నింగ్ ఇచ్చారు. అయినా తీరు మార్చుకోని పోలీసులపై చర్యలు తప్పవంటున్నారు ఉన్నతాధికారులు.