ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌పై మరో కేసు నమోదయ్యింది. నగరంలోని బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో భార్గవ్‌రామ్‌తోపాటు ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్‌రెడ్డిపై నకిలీ కొవిడ్ సర్టిఫికెట్ కేసు నమోదయింది. కోర్టు విచారణకు హాజరుకాకుండా నకిలీ సర్టిఫికెట్ ఇచ్చినట్లు అందులో పేర్కొన్నారు. కిడ్నాప్ కేసులో నిందితులుగా ఉన్న భార్గవ్, జగత్ విఖ్యాత్ రెడ్డి ఈ నెల 3న కోర్టులో హాజరుకావాల్సి ఉన్నది.
అయితే కోర్టుకు హాజరుకాకుండా ఉండటానికి ఈనెల 1న నకిలీ సర్టిఫికెట్ సమర్పించినట్లు అభియోగాలు మోపారు. కరోనా కారణంగా కోర్టుకు హాజరు కాలేమని అందులో పేర్కొన్నారు. అయితే కొవిడ్ సర్టిఫికెట్లను బోయిన్‌పల్లి పోలీసులు పరిశీలించారు. ఇందులో భాగంగా ఆ సర్టిఫికెట్ ఇచ్చిన దవాఖానలో విచారించారు. ఈ సందర్భంగా నకిలీ సర్టిఫికెట్ జారీ చేసినట్లు ధ్రవీకరించారు. నకిలీ సర్టిఫికెట్ ఇచ్చిన దవాఖాన సిబ్బంది వినయ్, రత్నాకర్, శ్రీదేవిపై కేసు నమోదుచేశారు.