సంక్రాంతి పండుగ వేళ మహిళలకు TSRTC గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండుగ సమయంలో నడిపే ప్రత్యేక బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం అమలవుతుందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శనివారం స్పష్టంచేశారు. సంక్రాంతి స్పెషల్ బస్సులపై సజ్జనార్ టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడారు. సంక్రాంతి పండుగ వేళ నడిపే స్పెషల్ బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవంటూ పేర్కొన్నారు. అంతేకాకుండా సంక్రాంతికి నడిపే ప్రత్యేక బస్సుల్లో మహాలక్ష్మి ఫ్రీ బస్ స్కిం అమలు అవుతుందని తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్టీసీ నుంచి స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గతంతో పోల్చితే 10శాతం బస్సులను పెంచామని.. మొత్తం 4484 బస్సులు నడపనున్నట్లు తెలిపారు. తెలంగాణలో డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి అవసరాన్ని బట్టి బస్సుల సంఖ్య పెంచుతామని సజ్జనార్ తెలిపారు. సంక్రాంతికి ఏపికి వెళ్లాల్సిన షెడ్యూల్ బస్సులు నడుస్తాయని తెలిపారు.
ఫ్రీ బస్ స్కీమ్‌తో తెలంగాణలో పుణ్యక్షేత్రాలకు తాకిడి పెరిగినట్లు సజ్జనార్ తెలిపారు. పుణ్యక్షేత్రాలకు, పర్యాటక స్థలాలకు రిజర్వేషన్లు పెరుగుతున్నాయన్నారు. ఈసారి ఇతర రాష్ట్రాలకు పొంగల్ స్పెషల్ సర్వీసులను టీఎస్‌ఆర్టీసీ తగ్గించినట్లు తెలిపారు. తెలంగాణలో డిమాండ్ పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. అవసరమైతే తెలంగాణ వరకు మరిన్ని సర్వీసులు పెంచే ఆలోచనలో టీఎస్‌ఆర్టీసీ ఉందని సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ సిబ్బందికి సహకరించి సురక్షిత ప్రయాణం చేయాలని.. ప్రైవేట్ వాహనాలను సంప్రదించవద్దంటూ సజ్జనార్ వివరించారు.