cock fighting
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

కోడి పందాల కోసం విదేశీ పుంజులు

దేశవాళీ కోడిపుంజులకు ధీటుగా ఈసారి కోడిపందాల బరిలో విదేశీ జాతులైన పెరు కోడిపుంజులను దింపుతున్నారు పందెం రాయుళ్లు. దేశవాళీ కోడిపుంజుతో పోలిస్తే విదేశీ జాతికి చెందిన పుంజులు అధిక పోరాట పటిమ కలిగి ఉంటాయని పందెం రాయుళ్లు చెబుతున్నారు. పెరు జాతులను ప్రత్యేకంగా ఎలా పెంచుతారు…వాటి పెంపకానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి.. దేశవాళీ కోడిపుంజుల పెంపకం మాదిరిగానే పెరు కోడిపుంజుల పెంపకం ఉంటుందా ?… మన వాతావరణ పరిస్థితుల్లో అవి ఎంతవరకు జీవించగలవు.. అనే విషయాలపై పందెం రాయుడు ఇప్పటికే సమగ్రంగా తెలుసుకున్నారు. దేశవాళీ కోడి పుంజులు 22 అంగుళాల ఎత్తు నుంచి 26 అంగుళాల ఎత్తు వరకు ఉండి నిటారైన ఆయన తోకతో పోడవాటి కాళ్లను కలిగి ఉంటాయి. కానీ పెరు జాతి కోడిపుంజు 16 నుంచి 20 అంగుళాల ఎత్తు మాత్రమే ఉండి తోక భూమికి వంగి ఉండటంతో పాటు ఆకారంలో పోలిస్తే దేశవాళీ కోడిపుంజు కన్నా పెరు జాతి కోడిపుంజు చిన్నదిగా ఉంటుంది. అయితే బలాల విషయానికొస్తే పెరు కోడిపుంజు కన్నా దేశవాళీ కోడిపుంజే బలిష్టంగా ఉంటుందని పందెం రాయుళ్లు చెబుతున్నారు.

కానీ పోరాట పటిమ విషయానికి వస్తే పెరు జాతి కోడిపుంజు స్పీడుగా పోటీలో దింపిన వెంటనే ప్రత్యర్థి కోడి పుంజుపై వేగంగా వెళ్లి తన పోరాట పటిమను కనబరుస్తుంది. అంతేకాక ఆకారంలో చిన్నగా ఉండటం, బరువు తేలికగా ఉండటంతో పందెంబరిలో ప్రత్యర్థి కోడిపుంజుకు చిక్కకుండా పోరాడి విజయాన్ని సాధిస్తుంది. దాంతో ఇటీవల ఎక్కువగా పందెం రాయుళ్లు సంక్రాంతి కోడి పందాల కోసం పెరు కోడి పుంజులనే ఇష్టంగా పెంచుతున్నారు.ఇక ప్రత్యేకంగా సిద్ధం చేసిన పందెం పుంజులతో పందెం రాయళ్లు ఇప్పటికే పందాల కోసం సిద్ధమయ్యారు. అయితే ఈసారి పందెం పుంజుల ధరలు కూడా ఆకాశాన్ని అంటాయి. ప్రత్యేకంగా తయారుచేసిన పందెం పుంజు ధర ప్రస్తుతం సుమారు ఒక లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల వరకు పలుకుతుంది. అయితే పందాలు కూడా అంతే స్థాయిలో జరుగుతుతాయి. ఒక్కొక్క కోడి పందాన్ని తలపడే కోడిపుంజులను బట్టి లక్ష రూపాయలు నుంచి 50 లక్షల వరకు పందేలు కడతారు. పందాలలో తలపడే పందెం కోళ్లు ప్రత్యేక తయారీకి ఒక్కొక్క కోడికి సుమారు 25 వేల నుంచి 50 వేల వరకు ఖర్చవుతుంది. ఇక విదేశీ కోళ్లకైతే ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడంతో మరింత ఖర్చు ఎక్కువవుతుంది.

ఎందుకంటే వాటి పెంపకానికి తగిన వాతావరణ పరిస్థితులు కల్పించడానికి మరింత అదనంగా ఖర్చవుతుంది. ఈ పందాలు ఒక్క గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే కాకుండా పట్టణంలో నివసించేవారు, సినీ రాజకీయ ప్రముఖులు సైతం ఎక్కువగా పాల్గొనడంతో కోడిపందాలపై ఎంతో క్రేజ్ పెరిగిపోయింది. పందెం రాయుళ్లు పుంజులను బట్టి, జాతిని బట్టి, రంగును బట్టి, కొందరైతే నక్షత్రాలను బట్టి సైతం పెద్ద ఎత్తున పందేలు కాస్తుంటారు. పండగ మూడు రోజులు ఒక ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని మారు 250 నుంచి 300 కోట్ల రూపాయలు చేతులు మారుతాయి అని అంచనా వేస్తున్నారు. ఓ పక్క పందాల బరిలో కోడిపందాలతో పాటు గుండాట, పేకాట జోరుగా సాగుతాయి. అంతేకాకుండా కోడిపందాల వీక్షణ కోసం వచ్చే పందెం రాయుళ్ల కోసం బరుల వద్ద ప్రత్యేకమైన వంటకాలు, రకరకాల ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా పందెంబరుల వద్ద కోజా మాంసాన్ని ఎక్కువగా తింటారు. పందెంలో ఓడిపోయిన పుంజుని కోజా అంటారు. అలాంటి కోజా పుంజులతో ప్రత్యేక వంటకాలు చేస్తారు.