kesineni swetha
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

టీడీపీకి కేశినేని శ్వేత రాజీనామా

తెలుగుదేశం పార్టీకి విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె, కార్పొరేటర్‌ కేశినేని శ్వేత గుడ్‌బై చెప్పారు. గౌరవం లేని చోట ఉండలేమంటూ తీవ్ర విమర్శలు చేశారు. ముందుగా కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసిన ఆమె తర్వాత టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రిజైన్ చేశారు.
గత వారం రోజులుగా విజయవాడ టీడీపీలో రాజకీయాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఎపిసోడ్‌ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఆయనకు టికెట్ ఇవ్వడం లేదని తేల్చిన అధిష్ఠానం నియోజకవర్గ రాజకీయాల్లో ఎక్కువ జోక్యం చేసుకోవద్దని సూచించింది. దీంతో ఆయన పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. లోక్‌సభ స్పీకర్ అపాయింట్‌మెంట్‌ దొరికితే ఢిల్లీ వెళ్లి తన రాజీనామా లెటర్ ఇవ్వనున్నారు. కేశినేని నాని బాటలోనే కుమార్త శ్వేత కూడా నడుస్తున్నారు. ఆమె తన కార్పొరేటర్ పదవికి ఈ ఉదయం రాజీనామా చేశారు. మేయర్ భాగ్యలక్ష్మికి తన రిజైన్ లెటర్ అందజేశారు. అక్కడ అమోదం పొందిన తర్వాత టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.
రాజీనామా చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన  శ్వేత టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు.గత కొంతకాలంగా టీడీపీలో చాలా అవమానాలు ఎదుర్కొంటున్నామని అన్నారు. విజయవాడ పదకొండో డివిజన్ కార్పొరేటర్‌గా తాను రాజీనామా చేశానని.. అదే టైంలో టీడీపీకి కూడా రిజైన్ చేసినట్టు తెలిపారు. తాము ఎప్పుడూ టీడీపీని వదిలి వెళ్లాలని అనుకోలేదని అయితే పార్టీ మాత్రం తమను వదులుకోవడానికి సిద్ధమైందన్నారు. అందుకే తాము పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు. పార్టీకి తమ అవసరం లేనప్పుడు అవమానాలు పడుతూ అక్కడ ఉండలేమన్నారు శ్వేత. కేశినేని నాని అనుచరులు అభిమానులతో సమావేశమై భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తారని అదే బాటలో తాను కూడా నడుస్తా అన్నారు శ్వేత. చాలా కాలంగా టీడీపీలో చాలా మంది నేతలు తమకు వ్యతిరేకంగా పని చేస్తూ వచ్చారని ఇవేవీ అధిష్ఠానానికి తెలియడం లేదని భ్రమలో ఉన్నామన్నారు శ్వేత.

మున్సిపల్ ఎన్నికల టైంలో కూడా తమ ఓటమికి పార్టీ లీడర్లే పని చేశారని ఆరోపించారు. తమతో పార్టీ నుంచి బయటకు వచ్చే వాళ్లకు కచ్చితంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు శ్వేత. ఈ ఉదయం శ్వేత ముందుగా కార్పొరేటర్ పదవికి తర్వాత టీడీపీకి రాజీనామా చేస్తారంటూ ట్వటర్ వేదికగా విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలియజేశారు.