వారిపై దారుణాలకు పాల్పడితే జనసేన ఊరుకోదని వ్యాఖ్య
ఈ రోజు మంగళగిరిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. అక్కడి పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన ప్రజలతో ముఖాముఖిలో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు పవన్ కల్యాణ్‌కు తమ కష్టాల గురించి చెప్పుకున్నారు. అభివృద్ధి పనుల పేరిట, సీఎం భద్రత దృష్ట్యా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం సమీపంలోని తమ ఇళ్లు ఖాళీ చేయాలని ప్రభుత్వం, వైస్సార్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారని బాధితులు పవన్ కల్యాణ్‌కు చెప్పారు. ఆ భూములను తమకు అప్పజెప్పాలని తమపై దారుణాలకు పాల్పడుతున్నారని, బెదిరింపులకు దిగుతున్నారని తెలిపారు. ఖాళీ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అంటున్నారని ఆయన అన్నారు. పునరావాసం కూడా ఏర్పాటు చేయకుండా ఇళ్లను లాక్కుంటున్నారని ఆరోపించారు.
దీనిపై పవన్ కల్యాణ్ స్పందిస్తూ… ‘ముఖ్యమంత్రి గారి నివాసం దగ్గర ఉన్న ఉన్న దాదాపు 320 ఇళ్లను ఖాళీ చేయాలని అంటున్నారు. ఆయన నివాసం ఉన్న చోటే ఇలాంటి దారుణాలు జరగడం ఏంటీ? రాష్ట్ర ముఖ్యమంత్రి భద్రత దృష్ట్యా ఖాళీ చేయిస్తున్నామని అంటున్నారు. ఆడవారు అని కూడా చూడకుండా పచ్చి బూతులు తిడుతుంటే బయట మానభంగాలు జరగకుండా ఇంకేమి జరుగుతుంటాయి’ అని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘జగన్ గారికి నేను చెబుతున్నాను. మీ చుట్టుపక్కల ఉన్న ఇళ్లనే ఇలా కూల్చితే ఎలా? అంతగా అవసరం ఉంటే ముందుగా పునరావాసం ఏర్పాటు చేసి, పక్కా ఇళ్లు కట్టించాలి. అంతేగానీ, అవేమీ చేయకుండా భయపెట్టి వారిని ఖాళీ చేయాలని చెప్పడం సరికాదు. వృద్ధులను కూడా చూడకుండా ఊరి బయట తీసుకెళ్లి పాడేస్తామని చెబుతున్నారు’ అని పవన్ చెప్పారు. ‘ఈ 320 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. అలా చేయకుండా మీరు వారిపై దారుణాలకు పాల్పడితే జనసేన ఊరుకోదు. వారికి అండగా ఉంటాం’ అని పవన్ కల్యాణ్ చెప్పారు. కాగా, వైద్య సిబ్బంది. నిరుద్యోగులు, పలువురు మహిళలు కూడా తమ కష్టాలను పవన్ కల్యాణ్ కు చెప్పుకున్నారు.
ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి జనసేన కృషి చేస్తుందని పవన్ కల్యాణ్ చెప్పారు. పార్టీ నడపడం అంటే కోట్లాది రూపాయల డబ్బుతో ముడిపడిపోయిన సమమంలో తాము జనసేన పార్టీని డబ్బుతో కాకుండా ప్రజల అండతో నడుపుతున్నానని చెప్పారు. ప్రజల కన్నీరు తుడవడానికే జనసేన ఆవిర్భవించిందని చెప్పారు. కాగా, కరోనా సమయంలో దేశంలో లక్షల మంది చనిపోయారని, వారందరికీ జనసేన తరఫున నివాళులు అర్పిస్తున్నానని పవన్ చెప్పారు. ప్రజలు, కార్యకర్తల అభిమానంతోనే తమ పార్టీ నిలబడిందని అన్నారు.