ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన కూటమి కలిసి పని చేస్తున్నాయి. పోటీ చేయబోతున్నాయి. ఈ కూటమికి ఆశీస్సులు ఉండాలని అమిత్ షా , మోదీని సందర్భం వచ్చినప్పుడల్లా పవన్ కల్యాణ్ కోరుతున్నారు. నిజానికి పవన్ కల్యాణ్ ఎన్డీఏలో ఉన్నారు. బీజేపీ కూడా తాము పవన్ తో పొత్తులో ఉన్నామని చెబుతోంది. కానీ టీడీపీతోమాత్రం పొత్తుల గురించి మాత్రం హైకమాండ్ ను అడగాలంటున్నారు. ఇక్కడ సింక్ కాని విషయం.. బీజేపీ కూటమిలోకి వస్తుందా రాదా అన్నదే. ఇటీవల రెండు రోజుల పాటు విజయవాడలో సమావేశాలు నిర్వహించిన కేంద్ర పెద్దలు అందరి దగ్గర లిఖిత పూర్వక అభిప్రాయాలు తీసుకుని ఢిల్లీకి వెళ్లారు. ఎక్కువ మంది టీడీపీతో పొత్తు మంచిదని చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ సమస్య ఉంది. ఏమిటంటే.. పొత్తులు కావాలని బీజేపీ ముందుకు రాదు .. బీజేపీ మనసు తెలుసుకుని టీడీపీనే ముందుకు వచ్చి అడగాలి. ఏపీలో తమను అడిగి మరీ పొత్తులు పెట్టుకోవాలని బీజేపీ నేతలు టీడీపీని డిమాండ్ చేస్తున్నారు. విచిత్రంగా ఉన్న ఈ డిమాండ్ ను బీజేపీ కోర్ కమిటీ సమావేశం తర్వాత సత్యకుమార్ మీడియా ముందు పెట్టారు.
తాము జనసేనతో పొత్తులో ఉన్నామని ఆయన చెబుతున్నారు. జనసేన టీడీపీతో వెళ్తోంది కదా అంటే టీడీపీకి తమతో పొత్తు కావాలంటే హైకమాండ్ ను సంప్రదించాలని లేకపోతే పవన్ కల్యాణ్ అయినా టీడీపీతో ఆ మాట చెప్పించాలని సూచించారు. అంటే ఇప్పటి వరకూ పొత్తుల ప్రతిపాదనలు టీడీపీ వైపు నుంచి కానీ బీజేపీ వైపు నుంచి కానీ రాలేదు. బీజేపీ రెడీగా ఉంది కానీ దేశంలో అతి పెద్ద పార్టీగా.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా.. తమతో పొత్తుల కోసం రావాలని బీజేపీ పిలవదు. అందుకే బీజేపీతో పొత్తులు పెట్టుకోవాలని కోరుకుంటున్న పార్టీలు మా అధిష్టానంతో మాట్లాడాలని సూచిస్తున్నారు. బీజేపీ పొత్తు కోరుకుంటున్నామని టీడీపీ నేతలతో పవన్ కూడా చెప్పించాల్సి ఉండాల్సిందని.. యువగళం వేదిక మీదే బీజేపీతో పొత్తు కోరుకుంటున్నామని పవన్ టీడీపీతో చెప్పించి ఉండాల్సిందని సత్యకుమార్ వ్యాఖ్యానించారు. అంటే బీజేపీ రెడీగానే ఉంది కానీ.. ఇక్కడ కావాల్సింది టీడీపీ చొరవే.ప్రస్తుత రాజకీయాలను చూస్తే తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తులు కోరుకోవడం లేదు.
ఎందుకంటే భారతీయ జనతా పార్టీని కలుపుకోవడం వల్ల ఒకటి, రెండు శాతం కూడా ఓట్లు కలసి రావు సరి కదా.. ఇంకా మైనస్ అవుతాయన్న భయం ఉంది. అయితే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరగడానికి బీజేపీ అండ ఉండాలని టీడీపీ , జనసేన కోరుకుంటున్నాయి. కానీ.. బీజేపీని ఈ కారణంతోనే కూటమిలో చేర్చుకునేందుకు సిద్ధపడటం లేదు. దీనికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో బీజేపీ అనుబంధం. గత ఐదేళ్లుగా వైసీపీ పార్టీకి రాజకీయంగా.. ప్రభుత్వ పరంగా కేంద్రం పూర్తి స్థాయిలో సహకరించింది. చివరికి రాజధానిని విధ్వంసం చేస్తామన్నా కేంద్రం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు . ప్రతిఫలంగా వైసీపీ ప్రతి ఒక్క బిల్లుకూ బీజేపీకి మద్దతు తెలిపింది. ఈ క్విడ్ ప్రో కో రాజకీయాలు చేస్తూ.. తాము కూటమిలో ఎలా చేర్చుకోవాలన్న సందేహం టీడీపీ, జనసేనలో ఉన్నాయి. అందుకే కూటమిలోకి రావాలంటే కొన్ని చర్యలు తీసుకోవాలని సంకేతాలు పంపారు. లిక్కర్ స్కాంపై విచారణ, పవన్ కల్యాణ రాసిన ఇళ్ల స్కాం వంటి వాటిపై విచారణలు కోరుకుంటున్నారు.
ఏపీలో అవినీతి అనేది బహిరంగరహస్యమని రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని వాటికి సాక్ష్యాలు కళ్ల ముందే ఉన్నాయని చర్యలు తీసుకుంటేనే తాము నమ్ముతామన్నట్లుగా టీడీపీ , జనసేన ఉన్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.బీజేపీకి కూడా ఇక్కడ డైలమా ఉంది. ఏపీలో ఏదో ఓ పార్టీతో పొత్తు పెట్టుకుంటే మరో పార్టీ వ్యతిరేకం అవుతుంది. ఆ పార్టీ ఇండియా కూటమి వైపు వెళ్లదని గ్యారంటీ లేదు. అందుకే రెండు పార్టీలతోనూ బీజేపీ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది. కానీ ఎన్నికలకు ముందు పొత్తులు పెట్టుకోవడానికే రెడీ అయినట్లుగా తెలుస్తోంది. వైసీపీ కూటమిలో చేరడనికి అంగీకరించదు. మద్దతు ఇవ్వడం వరకూ సిద్ధమే. ఆ పార్టీకి బీజేపీ ముఖ్యం కాదు..కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ముఖ్యం. రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్‌కు మద్దతు తెలుపుతారు. అంతే కానీ వ్యతిరేకించే అవకాశం ఉండదు. ఆ పార్టీ పరిస్థితి అలాంటిది.
అందుకే ఓ పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉండాలని బీజేపీ గట్టిగా అనుకుంటోంది. గతంలో ఎన్డీఏలో చేరిన పార్టీ.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్నందున టీడీపీని కూటమిలో పెట్టుకోవాలన్న ఆలోచనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.