ap-davos
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

దావోస్ కు ఎందుకు దూరం

ఏపీకి కొత్త పరిశ్రమలు రావడం లేదు.. ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయి. దీనిపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ఎన్నికలకు ముందు రాష్ట్రాన్ని పెట్టుబడుల స్వర్గధామంగా మారుస్తామని జగన్ ప్రకటించారు. పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేయించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తానని హామీ ఇచ్చారు. కానీ కొత్త పరిశ్రమలు రాలేదు. ఉన్న పరిశ్రమలు తరలిపోయాయి. పెట్టుబడులను ఆహ్వానించడంలో జగన్ సర్కార్ దారుణంగా వైఫల్యం చెందినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు నుంచి ఆహ్వానం వచ్చినా జగన్ సర్కార్ పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రపంచ దేశాలు హాజరవుతాయి. పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు చేసుకుంటాయి. అయితే జగన్ సర్కార్ ఈ ఐదేళ్లలో ఒకే ఒకసారి ఈ సదస్సుకు హాజరైంది. 2022లో జగన్ ప్రత్యేక విమానంలో దావోస్ వెళ్లారు. అయితే లండన్ లో ఉన్న తన కుమార్తెలను చూసేందుకు అప్పట్లో ఈ ట్రిప్ ప్లాన్ చేశారని అప్పట్లో విమర్శలు వ్యక్తమయ్యాయి. అప్పుడు కూడా తన స్నేహితుడు అదాని, అస్మదీయ కంపెనీ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ తో ఒప్పందాలకు మాత్రమే పరిమితమయ్యారు.

అంత దానికి దావోస్ వరకు వెళ్లాలా? అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. విపక్షాలు సైతం టార్గెట్ చేసుకున్నాయి. గత సంవత్సరం దావోస్ సదస్సుకు ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఆహ్వానం అందింది. అయితే దావోస్ లో విపరీతంగా చలి ఉండడం వల్ల అక్కడకు వెళ్లలేకపోతున్నామని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పుకొచ్చారు. మైనస్ 14 డిగ్రీల ఎముకల కొరికే చలిలో స్నానం చేయడం కష్టమని బదులిచ్చారు. దీనిపై విస్మయం వ్యక్తం అయ్యింది. మంత్రి తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. మంత్రి అమర్నాథ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు అదే మంత్రి అమర్నాథ్ టిక్కెట్ వివాదంలో ఉన్నారు. ఇటీవల ఆయనను అనకాపల్లి ఇన్చార్జి బాధ్యతలు నుంచి తప్పించారు. కొత్తగా ఇన్చార్జిగా నియమించలేదు. దీంతో ఆయన మనస్థాపంతో ఉన్నారు. పట్టించుకునే స్థితిలో లేరు.ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం దూకుడుగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి తో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు దావోస్ లో పర్యటించారు.

భారీ పెట్టుబడులే లక్ష్యంగా పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. కానీ ఏపీ సీఎం జగన్ మాత్రం దావోస్ సదస్సు పై నోరు విప్పడం లేదు. తెలంగాణ కంటే ఏపీలో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు స్వదేశీ పారిశ్రామిక సంస్థలు ఉత్సాహం చూపడం లేదు. విశాఖలో వ్యాపారాలు చేయలేనని వైసిపి ఎంపీ ఎంవివి సత్యనారాయణ ప్రకటించారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. గత ఐదు సంవత్సరాలుగా పరిశ్రమల జాడలేదు. కనీసం పారిశ్రామికవేత్తలను ఆకర్షించాలన్న ప్రయత్నం జరగలేదు. దీంతో ఏపీలో నిరుద్యోగం పెరిగింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. జగన్ దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదని కామెంట్స్ వినిపిస్తున్నాయి.