budget-2024
తెలంగాణ రాజకీయం

బడ్జెట్ కసరత్తు షురూ

తెలంగాణలో బడ్జెట్‌ బెల్‌ మోగింది. శాఖల వారీగా సమీక్షలు మొదలయ్యాయి. ఆదాయం, వ్యయం, నిధుల సమీకరణ, కేటాయింపులపై ఆర్ధిక శాఖ కసరత్తు చేస్తోంది. శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మార్పు నినాదంతో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్‌.. పరిపాలనలో తన మార్క్‌ చాటుకుంటుంది. ఆరు గ్యారెంటీలు సహా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలే లక్ష్యంగా రేవంత్‌ రెడ్డి సర్కార్‌ కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. ప్రజాదర్బర్‌ ఫిర్యాదులపై కేబినెట్ సబ్‌ కమిటీ, ధరణి పోర్టల్‌పై కోదండరెడ్డి కమిటీని ఏర్పాటు చేశారు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా అన్ని వనరులపై దృష్టి సారించింది. ఈ క్రమంలో 2024-25 వార్షిక బడ్జెట్‌పై ఫోకస్‌ పెట్టారు డిప్యూటీ సీఎం, ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క.
బడ్జెట్‌ ప్రతిపాదనల తయారీపై ఉన్నతాధికారులతో చర్చించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డితో కలిసి రెవిన్యూ, హౌజింగ్, ఐ ఆండ్ పిఆర్ శాఖల ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో ఆయా శాఖలో అమలు చేసే కార్యక్రమాలు, పథకాలు, నిర్వహణ వ్యయంపై ఆరా తీశారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, శ్రీనివాసరాజు, ఐ ఆండ్ పిఆర్ స్పెషల్ కమిషనర్ అశోక్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శాఖల వారీగా ఆదాయ, వ్యయాలపై సమీక్ష నిర్వహించారు భట్టి విక్రమార్క. ఇవాళ సీతక్క. దామోదర రాజనర్సింహా, 20న కోమటి రెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్‌బాబు, 22న ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, 23న పొన్నం ప్రభాకర్‌, జూపల్లి కృష్ణారావులతో వారి వారి శాఖలకు సంబంధించి బడ్జెట్‌ ప్రతిపాదనలపై సమీక్షలుంటాయి.ఇక ఇక సీఎం రేవంత్‌ రెడ్డి ఆధీనంలో వున్న శాఖలపై 24, 25, 27 తేదీల్లో రివ్యూ వుంటుంది.

రోజుకు నాలుగు శాఖల చొప్పున రివ్యూలు వుంటాయి. ఆరుగ్యారెంటీలు ఎన్నికల మేనిఫెస్టోకు అనుగుణంగా ప్రతీ శాఖ నుంచి అందిన ప్రతిపాదనలను ఆర్ధిక శాఖ పరిశీలిస్తోంది. విధివిధానాలు, నిధుల కేటాయింపు, నిధుల సమీకరణపై ప్రధానంగా దృష్టి సారించారు. ఇలా అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించి ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.