రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్125 అడుగుల ఎత్తయిన కాంస్య విగ్రహాన్ని( ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. విజయవాడ నడిబొడ్డున బందరు రోడ్డులోని పీడబ్ల్యూడీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం.. ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చిన అతి ఎత్తయిన విగ్రహాల్లో రెండోది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేయడం మామూలే. ఆ మాట కొస్తే.. ట్రాఫిక్ జంక్షన్లలోనూ అంబేడ్కర్ విగ్రహాలు మనకు దర్శనమిస్తుంటాయి. కానీ, అతి పెద్ద విగ్రహాలను ఏర్పాటు చేయడమే ఆసక్తిగా మారింది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాలను ఒకప్పుడు అభ్యుదయ వాదులు, కొన్ని సామాజిక వర్గాల వారు మాత్రమే ఏర్పాటు చేసుకునేవారు. ప్రత్యేకంగా ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ఏర్పాటు చేసిన పరిస్థితి గతంలో అయితే ఎక్కడా లేదు. ఏదైనా ప్రధాన కూడళ్లలో అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేసినప్పటికీ.. నేరుగా రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం ఉండేది కాదు.
ఆయా స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధుల జోక్యం.. వారి డిమాండ్లను అనుసరించి మాత్రమే ఈ విగ్రహాలను ఏర్పాటు చేసేవారు. అయితే.. తర్వాత కాలంలో ప్రభుత్వాల జోక్యం పెరిగింది. దీనికి రాజకీయ పరమైన కారణాలు ఉన్నాయనేది విశ్లేషకుల మాట. ముఖ్యంగా సమాజంలో రెండు కీలక సామాజిక వర్గాల ఓటు బ్యాంకు పెరుగుతుండడం.. ఆయా వర్గాలు అంబేద్కర్‌ను తమ ఆరాధ్యుడిగా భావిస్తున్న నేపథ్యంలో.. వారిని మచ్చిక చేసుకునేందుకు.. తమవైపు మళ్లించుకునేందుకు.. అంబేద్కర్ విగ్రహాలకు ప్రభుత్వ పార్టీల నుంచి ప్రాధాన్యం పెరిగిందన డంలో సందేహం లేదు.
పోటా పోటీగా..
దేశంలో ఇప్పటి వరకు.. ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాలను గమనిస్తే.. తెలంగాణలో ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద అంబేద్కర్ విగ్రహం ప్రారంభానికి సిద్ధమైంది. ఇక, మహారాష్ట్రలో ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహాన్ని నిర్మించాలన్న లక్ష్యంతో చేపట్టిన అంబేద్కర్ భారీ విగ్రహ నిర్మాణం.. మలిదశలో ఉంది. ఇది వచ్చే 2026 నాటికి అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎత్తుల విషయంలో పోటీ ఉండడం గమనార్హం. తెలంగాణలో గత బీఆర్ ఎస్ ప్రభుత్వం 125 అడుగుల ఎత్తుతో `సమతా మూర్తి` పేరుతో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. హుస్సేన్‌సాగర్ ఒడ్డున ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని 2023, ఏప్రిల్ 14న రాజ్యాంగ నిర్మాత జయంతిని పురస్కరించుకుని అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆవిష్కరించారు. ఏప్రిల్ 14, 2016లోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నగరంలో 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తర్వాత.. రెండోసారి అధికారంలోకి వచ్చాక.. ఈ విగ్రహ నిర్మాణాన్ని యుద్దప్రాతిపదికన చేపట్టి పూర్తి చేశారు.
ఏపీలో..
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రాలో అతి పెద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలు గత తెలుగు దేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా.. 14 ఏప్రిల్ 2016లో 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ స్మారకాన్ని ఏర్పాటు చేయాలని అప్పటి తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం తలపోసింది. ఈ క్రమంలోనే 2017లో అంబేద్కర్ 126వ జయంతి సందర్భంగా అప్పటి సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ స్మారక స్థూపానికి శంకుస్థాపన చేశారు. ఏపీ రాజధాని అమరావతిలోని ఐనవోలు మండలం, శాఖమూరు గ్రామంలో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని భావించారు. రూ.100 కోట్ల నిధులు కూడా కేటాయించారు. కొంత వరకు పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఇంతలో ఎన్నికలు రావడంతో పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనూ.. అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించాలన్న ప్రతిపాదన 2020లోనే వచ్చింది. ఈ క్రమంలో విజయవాడ కేంద్రంగా రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని నిర్మించాలని నిర్ణయించారు. యుద్ధప్రాతిపదికన నిధులు కేటాయించడంతోపాటు.. మంత్రుల కమిటీ కూడా వేసి.. నిత్యం పర్యవేక్షించారు.
ఫలితంగా.. ఎన్నికలకు ముందే ఈ విగ్రహం అందుబాటులోకి వచ్చింది. 85 శాతం పనులు పూర్తికాగా.. కేవలం 15 శాతం పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మొత్తం 125 అడుగుల ఎత్తుతో ఉన్న అంబేద్కర్ విగ్రహాల్లో ఇది రెండోది కావడం గమనార్హం. అంబేద్కర్ స్మృతి వనం పేరిట నిర్మించిన ఈ ప్రాంగణం అంత్యంత సువిశాలంగా ఉండడంతోపాటు.. లైబ్రరీ సహా అనేక అధునాతన సౌకర్యాలు ఉన్నాయి. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీసర్కారు కూడా.. అంబేద్కర్ అతి పెద్ద విగ్రహానికి శ్రీకారం చుట్టింది. ఆయన జన్మించిన మహారాష్ట్రలో ఈ విగ్రహానికి శంకుస్థాపన కూడా జరిగింది. `సమానత్వ విగ్రహం` పేరిట.. మహారాష్ట్రలోని ముంబైలో ఉన్న ఇందూ మిల్స్ కాంపౌండ్‌లో దీనికి ప్రధాని మోదీ 2015లోనే శంకుస్థాపన చేశారు. 452 అడుగుల ఎత్తుతో ఈ విగ్రహాన్ని నిర్మించాలని భావించారు. అంతేకాదు.. ప్రపంచంలోనే ఎత్తయిన స్టాట్యూ ఆఫ్ యూనిటీ, స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ తర్వాత అంబేద్కర్ విగ్రహం ప్రపంచంలోనే మూడో ఎత్తయిన విగ్రహంగా నిలుస్తుందని అప్పట్లో మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
అయితే.. పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన ఈ నిర్మాణం.. 2026 నాటికి పూర్తవుతుందని.. గత ఏడాది అసెంబ్లీ సమావేశాల్లో మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అంబేద్కర్ విగ్రహం ఎత్తు: 125 అడుగులు, నిలబడే పీఠం ఎత్తు: 81 అడుగులు, నిర్మాణ వ్యయం 404 కోట్ల రూపాయలు. విగ్రహానికి `సామాజిక న్యాయ మహాశిల్పం`గా పేరు పెట్టారు. ప్రాంగణానికి `అంబేద్కర్ స్మృతి వనం`గా పేరు ఉంచారు.హైదరాబాద్‌లో నిర్మించిన అంబేద్కర్ విగ్రహం ఎత్తు: 125 అడుగులు. నిలబడే పీఠం ఎత్తు: 50 అడుగులు. నిర్మాణ వ్యయం 146 కోట్ల రూపాయలు. విగ్రహానికి `సమతా మూర్తి` అని పేరు పెట్టారు.