ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. నేతలు భవిష్యత్తును వెతుక్కుంటూ పార్టీల్లో చేరుతున్నారు. ముఖ్యంగా వైసీపీ నుంచి వలసలు ప్రారంభం కావడం ఆ పార్టీకి ఆందోళనకు గురిచేస్తోంది. జగన్ రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులను మార్చుతుండడంతో అసంతృప్త నాయకులు విపక్షాల వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంది. దీంతో అధికారపక్షం మొండి చేయి చూపడంతో చాలామంది నేతలు ఆ రెండు పార్టీల్లో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే కొందరు చేరిపోయారు కూడా. టికెట్ల హామీ లభించడమే తరువాయి నేతలంతా నచ్చిన పార్టీల్లో చేరుతున్నారు. జనసేనలో చేరేందుకు ఇద్దరు మాజీ మంత్రులతో పాటు ఓ సిట్టింగ్ ఎంపి ముహూర్తాలు ఫిక్స్ చేసుకున్నారు. పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో వారంతా జనసేనలో చేరేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ జనసేనలో చేరిక ఖాయమైంది. ఈనెల 27న ఆయన జనసేనలో చేరుతారని తెలుస్తోంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కొణతాల రామకృష్ణ మంత్రిగా వ్యవహరించారు.
2009 ఎన్నికల్లో ఓటమి, రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ వెంట అడుగులు వేశారు. 2014 ఎన్నికల్లో విజయమ్మను విశాఖ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయించడంలో కొణతాలది క్రియాశీలక పాత్ర. కానీ క్రమేపి జగన్ గుర్తింపు తగ్గించడంతో కొణతాల పార్టీకి దూరమయ్యారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సైలెంట్ అయ్యారు. 2024 ఎన్నికల్లో మాత్రం మరోసారి బరిలో దిగాలని భావిస్తున్నారు. జనసేన టికెట్ తో అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని కొణతాల ప్రయత్నిస్తున్నారు. ఇందుకు పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో పార్టీలో చేరేందుకు సిద్ధపడ్డారు. ఆయన పార్టీలో చేరిన తరువాత అనకాపల్లి ఎంపీ స్థానాన్ని ఆయనకు కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం సైతం జనసేనలో చేరేందుకు దాదాపు సిద్ధపడినట్లు సమాచారం.
ఈనెల 30న ఆయన పవన్ సమక్షంలో జనసేనలో చేరతారని టాక్ నడుస్తోంది. త్వరలో పవన్ ముద్రగడ ఇంటికి వెళ్లి చర్చలు జరుపుతారని.. కీలక విషయాలపై చర్చిస్తారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ముద్రగడ కుమారుడికి జనసేన టికెట్ కేటాయించే అవకాశం ఉంది. మరోవైపు వైసీపీ సిట్టింగ్ ఎంపి వల్లభనేని బాలశౌరి కూడా జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఎప్పటికీ ఆయన పవన్ కళ్యాణ్ ను కలిశారు. కీలక చర్చలు జరిపారు. ఫిబ్రవరి రెండుగా ఆయన పవన్ సమక్షంలో జనసేనలో చేరతారని తెలుస్తోంది.గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ సైతం జనసేనలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన పవన్ ను కలిసి చర్చలు జరిపారు. గూడూరు సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న వరప్రసాద్ ను తప్పించి.. ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ రావును జగన్ ఇన్చార్జ్ గా నియమించారు. దీంతో మనస్థాపానికి గురైన వరప్రసాద్ జనసేనలో చేరేందుకు మొగ్గు చూపారు. ప్రజారాజ్యంలో పనిచేసిన సమయంలో పవన్ కళ్యాణ్ తో వరప్రసాద్ కు మంచి అనుబంధం ఉంది.
వచ్చే ఎన్నికల్లో అవకాశం కల్పిస్తే తిరుపతి ఎంపి స్థానం నుంచి పోటీ చేస్తానని వరప్రసాద్ పవన్ ను కోరారు. అయితే టిడిపితో పొత్తు ఉన్నందున సీటు విషయంలో ఎటువంటి హామీ ఇవ్వలేదు. బిజెపి కూటమితో కలిసి వస్తే తిరుపతి ఎంపీ సీటును బిజెపికి అప్పగించే అవకాశం ఉంది. బిజెపి రాకుంటే మాత్రం ఆ సీటు జనసేనకు దగ్గర అవకాశం ఉంది. అదే జరిగితే వరప్రసాద్ కు లైన్ క్లియర్ కానుంది. అయితే ఇంతలో వరప్రసాద్ సైతం జనసేనలో చేరతారని ప్రచారం జరుగుతోంది. మొత్తానికైతే పలువురు తాజా మాజీలు సైతం జనసేనలోకి క్యూ కడుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.