వ్యవసాయ భూముల అక్రమాలు నివారించేందుకు గత ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను తీసుకువచ్చింది. సమస్యలు పరిష్కారం కాకపోగా కొత్తగా అనేక సమస్యలు వచ్చిపడ్డాయి. దీంతో మూడేళ్లుగా రైతులు రెవెన్యూ, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. లక్షల్లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వీటిలో కొన్ని పరిష్కరించినా, చాలా వరకు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టింది. ఈమేరకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తొలి సమావేశం జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ధరణిలో పొరపాట్లను సరిదిద్దే అవకాశం కేవలం కలెక్టర్లకు మాత్రమే ఇచ్చారు. దీంతో చాలా ఫిర్యాదులు పెండింగ్‌లో ఉంటున్నాయి. కలెక్టర్ల బిసీ, పని ఒత్తిడి కారణంగా పరిష్కారం కావడం లేదు. ఈ నేపథ్యంలో కలెక్టర్లకు ఉన్న కొన్ని అధికారాలను కిందిస్థాయి అధికారులకు బదిలీ చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. అదనపు కలెక్టర్లు(రెవెన్యూ), ఆర్డీవోలు, తహసీల్దార్లకు కొన్ని అధికారాలు విభజించడం ద్వారా కలెక్టర్లపై ఒత్తిడి తగ్గుతుందని, సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని కమిటీ భావించింది.హైదరాబాద్‌లోని సచివాలయంలో నిర్వహించిన ధరణి కమిటీ సమావేశానికి నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు. సాఫ్ట్‌వేర్ సంస్థ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ధరణిలో చేయాల్సిన మార్పులపై దాదాపు పది గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా కలెక్టర్‌కు మాత్రమే సవరణ అధికారం ఉండడంపై ఎక్కువగా చర్చించారు. అదే అసలు సమస్యకు కారణమని గుర్తించారు.
అధికారాల బదిలీతో చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని పలువురు సూచించారు. కొత్తగా తెచ్చే భూ భారతి పై కూడా చర్చించారు. పైలెట్ ప్రాజెక్టుపైనా ధరణి కమిటీ చర్చించింది. ఈ ప్రాజెక్టు సగంలోనే ఆగిపోగా, అప్పటికే వివిధ గ్రామాల్లో నిర్వహించిన భూభారతి కార్యక్రమం అద్భుతమైన ఫలితాలను ఇచ్చినట్లు తెలిసింది. ధరణిలో అధికారాల బదిలీ చేయడమా, లేక భూభారతిని తీసుకురావడమా అనే విషయాలపై కమిటీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నిర్ణయాలను ప్రభుత్వానికి నివేదించిన తర్వాత తుది నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది.