tel-ration card
తెలంగాణ రాజకీయం

మళ్లీ రేషన్ కార్డుల దరఖాస్తులు….

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్… పథకాల అమలుపై దృష్టి పెట్టింది. ప్రధానంగా ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలపైనే ఫోకస్ పెడుతోంది. ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు ఆరోగ్య శ్రీ బీమా పెంపు నిర్ణయాలను పట్టాలెక్కించింది. ప్రజాపాలన కార్యక్రమం పేరుతో పలు పథకాలకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించింది. ఇప్పటికే డేటా ఎంట్రీ కూడా పూర్తి చేసింది. త్వరలోనే అర్హుల జాబితాను కూడా విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే… రేషన్ కార్డుల జారీపై కూడా దృష్టిపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. త్వరలోనే కొత్త కార్డులను మంజారూ చేయాలని భావిస్తోంది. ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ప్రధానంగా ఐదు గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించింది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఇందుకోసం సిద్ధం చేసిన దరఖాస్తు ఫారమ్ లో ప్రత్యేకంగా రేషన్ కార్డు కోసం ఆప్షన్ ఇవ్వలేదు. అయితే ఈ విషయంపై కాస్త గందరగోళం ఏర్పడినప్పటికీ… సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కీలక ప్రకటన చేశారు.

తెల్ల కాగితంపై రాసి రేషన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకోవచ్చని చెప్పారు. ఫలితంగా చాలా మంది కొత్త రేషన్ కార్డు కోసం తెల్ల కాగితంపై రాసి దరఖాస్తు పెట్టుకున్నారు. ఇక దరఖాస్తు చేసుకొనివాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే రేషన్ కార్డుల మంజూరు విషయంలో ఒక విధానపరమైన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది సర్కార్. కొత్త కార్డుల మంజూరులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా… ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించే ఆలోచనలో ఉంది. వచ్చే ఫిబ్రవరి మాసంలో మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించే దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.ప్రతి స్కీమ్ తో పాటు ఇతర అంశాల్లోనూ రేషన్ కార్డు అత్యంత కీలకంగా మారింది.గత ప్రభుత్వంలో సుమారు ఆరేళ్లుగా కొత్త రేషన్‌ కార్డుల జారీ లేదు. ఉన్న కార్డుల్లో పేర్ల నమోదుకు కూడా అవకాశం ఇవ్వలేదు.

దరఖాస్తు చేసుకున్నవారికి ఎదురుచూపులే మిగిలాయి. రేషన్ తో పాటు ఆరోగ్య శ్రీ సేవలకు ఈ కార్డు తప్పనిసరి. కొత్తగా రేషన్ కార్డులు జారీ కాకపోవడంతో అర్హులైన వారికి ఆయా సేవలు అందడంలేదన్న విమర్శలు లేకపోలేదు. అయితే ఎన్నికల హామీల్లో భాగంగా… తాము అధికారంలోకి వస్తే కొత్తగా రేషన్ కార్డులను మంజూరు చేస్తామని ప్రకటించింది. అందుకు తగ్గటే ఏర్పాట్లను సిద్ధం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరోవైపు ఈనెల 31వ తేదీతో ఈకేవైసీ గడువు ముగియనుంది. ఫలితంగా రేషన్ లబ్ధిదారుల విషయంలో మరింత క్లారిటీ రానుంది. మరోవైపు కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల కోసం ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను కూడా ప్రభుత్వం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తి చేసి అర్హులైన వారికి వాటికి అందజేయాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది.అయితే ప్రజాపాలనలో దరఖాస్తు చేసున్నవారు మళ్లీ చేసుకోవాలా…? లేక మిగిలిపోయినవారు మాత్రమే అప్లయ్ చేసుకోవాలా అనేది తెలియాల్సి ఉంటుంది.మన రాష్ట్రంలో ప్రస్తుతం 90 లక్షల మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా 2.8 కోట్ల మందికిపైగా లబ్ధి పొందుతున్నారు.

ఇటీవలే ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందాయి. వీటిలో కోటికి పైగా అభయహస్తానికి సంబంధించినవి ఉండగా… 20 లక్షల దరఖాస్తులు పలు సమస్యలపై వచ్చినట్లు అధికారవర్గాలు చెప్పాయి. ఇందులోనూ అత్యధికంగా రేషన్ కార్డుల కోసం వచ్చాయని పేర్కొన్నారు.