ఫిబ్రవరి చివరిలో ఎన్నికల షెడ్యూల్ వస్తుంటే మొదటి వారంలోనే లక్షాముప్పైవేల ఎకరాల దోపిడీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే అనం రామనారాయణరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రా-కదలిరా కార్యక్రమం ద్వారా నెల్లూరు వేదికగా రాష్ట్రంలో సాగుతున్న అప్రజాస్వామిక పాలనని ఎండగడతామని హెచ్చరించారు. ఆనాడు నందమూరి తారక రామారావు ఇచ్చిన రా-కదలి రా అంటూ ఇచ్చిన పిలుపు ఇప్పుడు గుర్తొస్తుందని చెప్పారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు తమకు జరిగిన అన్యాయాలు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూముల సర్వే పేరుతో పేద ప్రజల భూములు దోచేస్తున్నారన్న ఆనం.. రైతుల్లో ఆవేదన, ఆందోళన, అక్రందన ఉందని స్పష్టం చేశారు.రాష్ట్రంలో కొత్త కొత్త దోపిడీ పథకాలకు తెర తీస్తున్నారన్న ఆనం.. స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారులు, మేము చేయలేమని చెబితే వారిని సస్పెండ్ చేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని ఫైర్ అయ్యారు.
తమకూ చీఫ్ విప్, స్పీకర్ ఆఫీస్ నుంచి నోటీసు వచ్చిందని, వెంటనే స్పందించమని తిరిగి నోటీసు ఇచ్చారని చెప్పారు. అంతే కాకుండా ఒరిజినల్ డాక్యుమెంట్స్ పంపమని అడిగామన్నారు. పార్టీ పరంగా చంద్రబాబు ఆదేశాలు, లీగల్ సూచనలు మేరకు నిర్ణయం తీకుంటామని వివరించారు. మూడు సంవత్సరాల క్రితం గంటా శ్రీనివాస్ రాజీనామా ఇస్తే, ఇప్పుడు ఆమోదించారని పేర్కొన్నారు.