షర్మిల దూకుడుకు జగన్ కలవరపాటుకు గురవుతున్నారు. ఆమెతో నష్టం తప్పదని భావిస్తున్నారు. కుటుంబాన్ని చీల్చింది జగన్ అని.. దానికి మా అమ్మే సాక్ష్యం అని షర్మిల చెప్పేసరికి జగన్ కు మైండ్ బ్లాక్ అయింది. షర్మిల అన్నంత పని చేస్తుందని గ్రహించిన జగన్..అమ్మను తన రూట్లోకి తెచ్చుకోవాలని చూస్తున్నారు. అందుకే అమ్మకు ఫోన్ చేసి సాయం కోరుతున్నారు. పీసీసీ పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి షర్మిల రోజురోజుకు డోస్ పెంచుతున్నారు. జగన్ అవినీతిని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు ఆయన నైజాన్ని బయటపెడుతుండడంతో నష్టం తప్పదని వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. అంతటితో ఆగని షర్మిల తల్లి విజయమ్మ ప్రస్తావన తీసుకొచ్చేసరికి జగన్ కు ఏం చేయాలో పాలు పోవడం లేదు. అమ్మను తన వైపు తిప్పుకోవడమే శ్రేయస్కరమని ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు.వైసీపీలో వైఎస్సార్ లేరని.. వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి అంటూ షర్మిల సెటైరికల్ గా మాట్లాడారు.
దాచుకోవడం, దోచుకోవడమే జగన్ పని అని.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనతో పోలిక ఏంటని ప్రశ్నించారు. దీంతో షర్మిల వ్యాఖ్యలు ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. ముఖ్యంగా వైఎస్ అభిమానుల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఎక్కువమంది షర్మిల వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. ఇలానే కొనసాగితే మెజారిటీ వైఎస్సార్ అభిమానులు జగన్ కు దూరం కావడం తథ్యం. షర్మిలను కట్టడి చేయడానికి జగన్ చేయని ప్రయత్నం లేదు. వైసీపీ సోషల్ మీడియాతో పాటు రాష్ట్రస్థాయి నేతలను సైతం రంగంలోకి దించారు. అయినా సరే ఆమె వెనక్కి తగ్గడం లేదు. దీంతో ఇప్పుడు జగన్ కు తల్లి విజయమ్మ గుర్తుకొచ్చింది. చెల్లిని కట్టడి చేయలేకపోతే తనకు ఇబ్బందులు తప్పవని గ్రహించిన జగన్ నేరుగా తల్లికి ఫోన్ చేసి శరణు కోరారు.సీఎం జగన్ తల్లికి నేరుగా ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రాధేయ పడినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగింది.. దానికి షర్మిల ఆజ్యం పోస్తోంది. ఒకవేళ నేను ఓడిపోతే జైలుకెళ్లాల్సి ఉంటుంది. అదే జరిగితే కేసుల్లో శిక్ష పడే అవకాశం ఉంది. నా జీవితం జైలుకే అంకితమైపోతుంది. నువ్వు రావాలి అమ్మా అంటూ జగన్ బతిమిలాడుకున్నట్లు తెలుస్తోంది.
అయితే జగన్ చెప్పిన మాటలకు తల్లిగా విజయమ్మ కరిగిపోయినట్లు సమాచారం. జగన్ కు సాయం చేసేందుకు ఆమె ముందుకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనకు మద్దతుగా ప్రచారం చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇన్నాళ్ళు ఆమె కూతురు షర్మిల వైపే ఉన్నారు. ఆమె తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టడంతో వైసిపి గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేశారు. కొన్ని సందర్భాల్లో ఆమె షర్మిల కోసం రోడ్డు ఎక్కారు. ఇప్పుడు కుమారుడు వైపు వెళతా అనడంతో షర్మిల అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే షర్మిల కాదంటున్న జగన్ గడ్డు పరిస్థితుల దృష్ట్యా ఆయనకు మద్దతుగా ప్రచారం చేయాలని విజయమ్మ నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీనిపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.అయితే జగన్ వైఖరిపై వైసీపీలోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు జగన్ తనను చూసి ప్రజలు ఓటు వేస్తారని చెప్పుకొచ్చారు. తల్లి, చెల్లిని దూరం చేశారని విమర్శ వచ్చినప్పుడు వైసిపి నుంచి ఆ స్థాయిలో ప్రతిస్పందన లేదు.
షర్మిలకు అంత సీన్ లేదని చాలా తేలిగ్గా తీసుకున్నారు. తెలంగాణ రాజకీయాల్లో విఫలమైన ఆమె ఏం చేస్తుందిలే అంటూ ఎద్దేవా చేశారు. కానీ రోజురోజుకు ఆమె విమర్శలు పెరగడంతో జగన్ కు ఏం చేయాలో పాలు పోవడం లేదు. షర్మిల కామెంట్స్ పాజిటివ్ ఓటు బ్యాంకు పై ప్రభావం చూపుతున్నాయి. వైసిపి సంప్రదాయ ఓటర్లు దూరమవుతారన్న ఆందోళన జగన్ లో కనిపిస్తోంది. దానికి కొంతవరకు కట్టడి చేయాలంటే తల్లి విజయమ్మ అవసరం. అందుకే జగన్ తల్లిని శరణు కోరుకుంటున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.