ajp-caste census
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

శరవేగంగా కులగణన…

ఏపీలో కుల గణన శరవేగంగా పూర్తవుతుంది. మరో వారంలో రాష్ట్ర వ్యాప్తంగా కులగణన పూర్తి చేసేందుకు గ్రామ, వార్డు సచివాలయాలు కసరత్తు చేస్తున్నాయి.సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వం చేపట్టిన కులగణనపై విపక్షాలు రకరకాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నా ఈ కార్యక్రమం చాలా సులువుగా పూర్తవుతోంది. ప్రజలు తమ వివరాలను వెల్లడించకుండానే వాలంటీర్లు ఈ పని పూర్తి చేసేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వద్ద ఇప్పటికే ప్రతి ఒక్కరి వివరాలు పక్కాగా అందుబాటులో ఉన్నాయి. 2016లో అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సమగ్ర సాధికార సర్వే ద్వారా ప్రతి ఇంటి వివరాలను సేకరించి రియల్‌ టైమ్‌ డేటాను అందుబాటులోకి తెచ్చారు.దీని ద్వారా రాష్ట్రంలో నివసించే ప్రతి పౌరుడి వివరాలను ఏడేనిమిదేళ్ల క్రితమే ప్రభుత్వం సేకరించింది. సాధికార సర్వేలో ప్రజల స్థితిగతులను అధ్యయనం చేసే పేరుతో నిరంతరం డేటా అప్డేట్ చేస్తూ వచ్చారు. ఈ కార్యక్రమంలోప్రజల నుంచి అన్ని రకాల వివరాలు సేకరించారు.ఆ తర్వాత 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 అక్టోబర్‌ నుంచి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

2019 అక్టోబర్ 2న వాలంటీర్ వ్యవస్థను ప్రారంభించి 2020 జనవరి నాటికి దానిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం సచివాలయాల్లో లక్షా 35వేల మంది ఉద్యోగులు, 2.65లక్షల వాలంటీర్లు ఉన్నారు. ప్రతి యాభై ఇళ్లకు ఓ వాలంటీర్‌ సేవలు అందిస్తున్నాడు.వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్ల క్రితమే ప్రతి కుటుంబం వివరాలను అన్ని వివరాలు, ఆధార్‌ కార్డులతో సహా జియో మ్యాపింగ్ పూర్తి చేశాయి. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు ప్రతి కుటుంబం వివరాలు వాటి కులంతో సహా పక్కాగా లెక్కలు ఉన్నాయి.ప్రభుత్వం వద్ద ఉన్న గణంకాలను సామాజిక వర్గాల వారీగా ప్రకటించడానికి అవకాశం లేదు. దేశ వ్యాప్తంగా జనగణన పూర్తి కాకపోవడంతో పాటు రాజకీయ కారణాల నేపథ్యంలో కులాల వారీగా జనాభాను అధికారికంగా ప్రకటించడానికి వీల్లేకుండా పోయింది. దీంతో గత ఏడాది చివర్లో కులగణన చేపట్టాలని నిర్ణయించారు.

జనవరి 19 నుంచి నిర్వహిస్తున్న కులగణన గ్రామ, వార్డు వాలంటీర్లే నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఎంత సులువుగా జరిగిపోతుందంటే ప్రతి ఇంట్లో ఒకరి నుంచి బయోమెట్రిక్ తీసుకుంటే సరిపోతోంది. వాలంటీర్లు ఎలాంటి వివరాలు అడగకుండానే కులగణన పూర్తి చేస్తున్నారు. ఎవరైనా అందుబాటులో లేకపోయినా వారి ఫ్యామిలీకి మ్యాపింగ్ జరిగిన నంబర్‌కు ఫోన్‌ చేసి ఓటీపీ చెప్పమని అడుగుతున్నారు. ఓటీపీ చెబితే కులగణన పూర్తైనట్టేనని వివరిస్తున్నారు.కులాల వారీగా ప్రజల వివరాలు ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉన్నా వాటిని బహిర్గతం చేయడానికి వీల్లేకుండా పోయింది. ఇప్పుడు అధికారికంగా క్యాబినెట్‌ అమోదంతో నిర్వహిస్తున్న కులగణన మరో వారం రోజుల్లో పూర్తైతే దానిని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంటుంది. తద్వారా సమాజంలో అన్ని వర్గాలకు ప్రభుత్వం పథకాలను వర్తింప చేసే వీలు కలుగుతుందని చెబుతున్నారు.గతంలో నిర్వహించిన సర్వేల ప్రకారం రాష్ట్రంలో 1.67 కోట్ల కుటుంబాలు.. 4.89 కోట్ల జనాభా ఉందని గణాంకాలు చెబుతున్నాయి.

తాజా కులగణన సర్వేతో అన్ని కులాలకు ఆర్థిక, సామాజిక సాధికారత దిశగా చేయూత అందించడానికి వీలువుతుందని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వ పథకాలు అందకుండా ఇంకా ఎవరైనా అర్హులు మిగిలిపోయినా దీని ద్వారా తెలుస్తుంది. తద్వారా వారికీ లబ్ధి చేకూర్చేందుకు వీలవుతుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.గ్రామ, వార్డు సచివాలయాల శాఖ గతంలో వలంటీర్ల ద్వారా సేకరించిన డేటా ప్రకారం రాష్ట్రంలో గ్రామాల్లో 1,23,40,422 కుటుంబాలకు చెందిన 3,56,62,251 మంది నివాసం ఉంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో 44,44,887 కుటుంబాలలో 1,33,16,091 మంది నివసిస్తున్నారు. మొత్తం 1.67 కోట్ల కుటుంబాలకు సంబంధించి 4.89 కోట్ల మంది ప్రజలు ఉన్నారు.సచివాలయాల ఉద్యోగులు, వలంటీర్లు 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఇంటింటి వివరాలు సేకరణ పూర్తి చేశారు. కులగణనలో వివిధ కారణాలతో నమోదు చేసుకోకుండా మిగిలిన వారి కోసం ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు సంబంధిత కుటుంబాలకు చెందిన వారు ఎవరైనా ఒకరు వెళ్లి వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తారు.కులగణన ప్రక్రియను ఆన్‌లైన్‌ విధానంలో పారదర్శకంగా నిర్వహించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేకంగా ఒక మొబైల్‌ యాప్‌ను సిద్ధం చేసింది.

దాదాపు 723 కులాల జాబితాలను ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీల వారీగా వర్గీకరించి మొబైల్‌ యాప్‌లో అనుసంధానించారు.ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్సీ కేటగిరీలో పేర్కొన్న 723 కులాలతో పాటు మరో మూడు కులాలు బేడ జంగం లేదా బుడగ జంగం, పిరమలై కల్లర్‌ (తేవర్‌), యలవ కులాలకు సంబంధించిన వారి వివరాలను వేరుగా అదర్స్‌ కేటగిరిలో సేకరిస్తారు.కులం వివరాలు వెల్లడించడానికి ఆసక్తి చూపనివారికి, కుల పట్టింపులు లేని వారి కోసం నో- క్యాస్ట్‌ కేటగిరీని కూడ కులగణన ప్రక్రియలో చేర్చారు. కులగణన అయా కుటుంబాలు వెల్లడించే వివరాల ఆధారంగా డేటీ నమోదు చేసిన అనంతరం కుటుంబంలో ఎవరైనా ఒకరి నుంచి ఆధార్‌తో కూడిన ఈ -కేవైసీ తీసుకోనున్నారు. ఈ కేవైసీ కోసం బయోమెట్రిక్, ఐరిస్‌ తదితర విధానాలకు అవకాశం కల్పించారు