అంతర్జాతీయం రాజకీయం

భారత్‌ – మాల్దీవుల మధ్య నెలకొన్న దౌత్య పరమైన వివాదం

భారత్‌ – మాల్దీవుల మధ్య నెలకొన్న దౌత్య పరమైన వివాదం తర్వాత మాల్దీవుల పర్యాటకం లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా రెండు దేశాల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో మాల్దీవులకు క్యూకట్టే భారతీయుల సంఖ్య వారాల వ్యవధిలోనే దారుణంగా పడిపోయింది. దీంతో గతంలో మాల్దీవుల విదేశీ పర్యాటకంలో మొదటి స్థానంలో ఉండే భారత్‌ ఇప్పుడు ఏకంగా ఐదో స్థానానికి పడిపోవడం గమనార్హం.మాల్దీవుల పర్యాటక శాఖ విడుదల చేసిన తాజా డేటా ప్రకారం గతేడాది డిసెంబర్‌ 31 నాటికి 2,09,198 మంది పర్యాటకులతో భారత్‌ అగ్రస్థానంలో ఉండేది. ఆ ఏడాది మాల్దీవుల్లో భారత్‌ పర్యాటకుల వాటా దాదాపు 11 శాతం. ఇప్పుడు ఏకంగా ఐదో స్థానానికి పడిపోయింది. 2024 జనవరి 28 నాటికి మాల్దీవులు టూరిజంలో భారత్‌ వాటా ఏకంగా 8 శాతానికి పతనమైంది.

ఈ ఏడు కేవలం 13,989 మంది భారతీయులు మాత్రమే మాల్దీవులను సందర్శించారు. ఈ ఏడాది జనవరి మాసంలో అత్యధిక మంది పర్యాటకులను మాల్దీవులకు పంపిన దేశాల్లో 18,561 మంది పర్యాటకులతో రష్యా తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఇటలీ (18,111), చైనా (16,529) , యూకే (14,588) దేశాలు రష్యా తర్వాతి స్థానాల్లో నిలిచాయి.