దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణకు సంబంధించి ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు రాజ్యసభ స్థానాల్లో అసెంబ్లీలో ప్రస్తుత బలాబలాలను పరిగణలోకి తీసుకుంటే కాంగ్రెస్ రెండు, బీఆర్ఎస్ ఒకటి దక్కించుకునే అవకాశముంది. కానీ కాంగ్రెస్ మూడు సీట్లూ కైవసం చేసుకునేందుకు పక్కా వ్యూహాలు రచిస్తోంది. ఇంతకీ కాంగ్రెస్ వ్యూహం ఏంటి? కాంగ్రెస్ ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా? తమ ఎమ్మెల్యేల బలం రెండు రాజ్యసభ సీట్లకు ఉన్నా.. మూడు రాజ్యసభ స్థానాలు మావే అని హస్తం నేతలు చెబుతుండటం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.తెలంగాణకు సంబంధించి ఏప్రిల్‌లో ఖాళీ అవనున్న మూడు స్థానాలను భర్తీ చేసేందుకు ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. వీటి కోసం ఫిబ్రవరి 8న ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుంది. నామినేషన్‌కు చివరి తేదీగా ఫిబ్రవరి 15ను ఎన్నికల సంఘం ప్రకటించింది.
నామినేషన్ల పరిశీలనకు ఫిబ్రవరి 16, నామినేషన్ల విత్ డ్రాకు ఫిబ్రవరి 20, ఎన్నికల నిర్వహణ ఫిబ్రవరి 27గా ఎన్నికల సంఘం ప్రకటించింది. తెలంగాణలో ఖాళీ అవుతున్న మూడు సీట్లనూ కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ప్రస్తుత రాజ్యసభ ఎన్నికల నిబంధనలను తమకు అనుకూలంగా వాడుకోవాలనే యోచనలో ఉన్నారట. రాజ్యసభ ఎన్నికల కోసం ఒక ప్రాసెస్ ఉంటుంది. నిబంధనల ప్రకారం ఖాళీ అవుతున్న మూడు సీట్లకు అదనంగా ఒకటి కలుపుకోవాల్సి ఉంటుంది. అంటే మొత్తం నాలుగు సీట్లుగా లెక్కవేసుకుని అసెంబ్లీ సీట్లను డివైడ్ చేస్తారు. అంటే మొత్తం 119 అసెంబ్లీ సీట్లను డివైడెడ్ బై ఫోర్ (4) మాదిరిగా లెక్కబెట్టాల్సి ఉంటుంది. అంటే ఒక్కొక్క రాజ్యసభ సీటు గెలవడానికి దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు అవసరమవుతారు. ఇప్పుడు అసెంబ్లీలో ఉన్న బలాల మేరకు కాంగ్రెస్ సులువుగా రెండు, బీఆర్ఎస్ ఒక స్థానాన్ని గెలుచుకునే అవకాశముంది.అసెంబ్లీలో ఉన్న బలాల ప్రకారం కాంగ్రెస్ సులువుగా రెండు రాజ్యసభ సీట్లు గెలుచుకునే అవకాశముండగా, మిత్రపక్షంతో కలుపుకొని మరో 5 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి అదనంగా ఉంటాయి.
మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలో బీజేపీ రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉంటే మొత్తం సంఖ్యా బలం 119 స్థానాల నుండి 111 స్థానాలకు పడిపోతుంది. ఇక ఏంఐఏం కూడా దూరంగా ఉంటే ఆ సంఖ్యా బలం 104కు పడిపోతుంది. అప్పుడు 104 స్థానాలను నాలుగు భాగాలుగా విభజించాల్సి ఉంటుంది. అప్పుడు ఒక్కో రాజ్యసభ సీటు బలం 26కు పడిపోతుంది. ఇక రాజ్యసభ ఎన్నికల్లో విప్ జారీ చేసే అవకాశం ఉండదు. ఎమ్మెల్యేలు తమకు నచ్చిన వ్యక్తికి ఓటు వేయవచ్చు. ఇదే అదునుగా తీసుకొని ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి కొంత మంది ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకొవాలని భావిస్తోంది.