కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంట్ కష్టాలు తప్పవని ఎన్నికల సమయంలో తాము చెప్పిన విషయం కేవలం 60 రోజుల్లోనే రుజువైందంటూ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన కేటీఆర్.. కాంగ్రెస్ పై మరోసారి మాటలతూటాలు సంధించారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. మార్చి 17తో కాంగ్రెస్ సర్కార్‌కి వందరోజుల కాలం పూర్తవుతుందని, మరి 6 గ్యారంటీల్లో ఎన్ని అమలు అయ్యాయో.. ప్రజలు గ్రహించాలని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధి చూసి బీఆర్ఎస్ కు ప్రజలు పట్టంకట్టారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే వాళ్ళు చేసే పని గుర్తుకొస్తుందన్నారు. ఇచ్చిన మోసపూరిత హామీలతో కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిందని.. పదేళ్లలో కరెంట్ పోలేదు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ రాగానే కరెంట్ పోతుందంటూ ఫైర్ అయ్యారు. డిసెంబర్9న రైతులు లోన్లు తెచ్చుకోమన్నారు.. ఇప్పటి దాకా రుణమాఫీ చేయలేదని కేటీఆర్ గుర్తుచేశారు. డిసెంబర్ 9, జనవరి 9 పోయింది ఫిబ్రవరి 9వచ్చింది ఇంకా రుణమాఫీ కాలేదంటూ విమర్శించారు.
500 రూపాయల బోనస్ రైతులకు ఇస్తామన్నారు.. కానీ ఇవ్వలేదని కేటీఆర్ గుర్తుచేశారు. 70 ఏళ్ల వ్యక్తి కేసిఆర్ ను నోటికొచ్చినట్లు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు.. సీఎం స్థాయి మరిచి కేసిఆర్ ను తిడుతున్నారంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మార్చి 17 తర్వాత రేవంత్ రెడ్డికి గట్టి సమాధానం ఇస్తామని కేటీఆర్ స్పష్టంచేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని అంటున్నారు.. పదేళ్లు మోడీ తమకు సహకరించకపోయిన తాము ఇచ్చిన హామీలు నెరవేర్చామన్నారు. కానీ రేవంత్ రెడ్డి కి ఇలా ఇచ్చిన హామీలపై వెనక్కి తగ్గటం మంచిది కాదంటూ కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడే ఎంపీలు ఉండాలని.. కానీ డూడు బసవన్న లాగే ఉండే ఎంపిలు అవసరం లేదంటూ కేటీఆర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పై ఫైర్..
కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే వారణాసిలో పోటీ చేసి గెలవాలని, కాంగ్రెస్ పార్టీ తనకున్న 40 స్థానాలను కూడా ఈసారి నిలబెట్టుకునే అవకాశం లేదంటూ కాంగ్రెస్ పార్టీ పైన బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి వల్లనే ఇండియా కూటమి చెల్లాచెదురు అవుతున్నదని.. కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. గుజరాత్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో బిజెపితో నేరుగా పోటీ పడాల్సి ఉన్న కాంగ్రెస్, ఆ రాష్ట్రాలను వదిలిపెట్టి ఇతర రాష్ట్రాల్లో ఇతర పార్టీలతో పోటీ పడుతుందన్నారు. దీంతో బిజెపికి లాభం చేకూరుతుందని.. ఇండియా కూటమిలోని పార్టీల గెలుపు అవకాశాలను దెబ్బతీసేలా కాంగ్రెస్ వ్యవహరిస్తుందని వ్యాఖ్యానించారు. నిజానికి బిజెపిని ఆపగలిగే శక్తి కేవలం బలమైన ప్రాంతీయ రాజకీయ శక్తులకే ఉన్నదన్నారు. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రి వాల్, స్టాలిన్, కేసీఆర్ వంటి బలమైన నాయకులే దేశంలో బిజెపిని అడ్డుకోగలరని.. బిజెపికి కాంగ్రెస్ ఏ మాత్రము ప్రత్యామ్నాయము కాదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.