మంచిర్యాల జిల్లాలో లక్షేట్టిపేట మున్సిపాలిటీని తమ చేతుల్లోంచి జారిపోకుండా ఎట్టకేలకు కాపాడుకోగలిగింది బీఆర్ఎస్. లక్షేట్టిపేట మున్సిపాలిటీలో 15 వార్డ్‌లుండగా.. 9 మంది కాంగ్రెస్ కౌన్సిలర్ల బలంతో చైర్మన్ నలుమాసు కాంతయ్య, వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్‌లపై అవిశ్వాసానికి గత నెల 12న నోటీసులు ఇవ్వగా.. ఫిబ్రవరి 3న బల నిరూపణకు అవకాశం ఇచ్చారు జిల్లా కలెక్టర్. ఆయన ఆదేశాలతో ప్రత్యేక అధికారి మంచిర్యాల ఆర్డీవో రాములు ఆధ్వర్యంలో బల నిరూపణ సమావేశం జరిగింది. ఉదయం 11 గంటలకు చైర్మన్‌పై అవిశ్వాస బలనిరూపణ, మధ్యాహ్నం 12.30 గంటలకు వైస్ చైర్మన్‌పై అవిశ్వాస బలనిరూపణకు అవకాశం ఉండగా.. కోరం సభ్యులు ఎవరు హాజరు కాకపోవడంతో ప్రొసిడింగ్ అధికారి రాములు సమావేశాన్ని 3:30 గంటలకు మార్చారు. అయినప్పటికి కోరం సభ్యులు ఎవరు హాజరుకాకపోవడంతో చైర్మన్, వైస్ చైర్మన్‌లపై పెట్టిన అవిశ్వాసం వీగిపోయినట్టుగా తేల్చారు.
దీంతో ఎట్టకేలకు మంచిర్యాల జిల్లాలోని లక్షేట్టిపేట ఒక్క మున్సిపాలిటీనైనా హస్తం గూటికి చేరకుండా కాపాడుకోగలిగింది బీఆర్ఎస్ పార్టీ.గత నెల మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి మున్సిపాలిటీతో మొదలైన అవిశ్వాసల పర్వం.. నేటి లక్షేట్టిపేట మున్సిపాలిటీ అవిశ్వాసంతో తారస్థాయికి చేరింది. మంచిర్యాల జిల్లాలో ఆరు మున్సిపాలిటీలుండగా.. 2020 మున్సిపల్ ఎన్నికల్లో ఆరుకు ఆరు స్థానాలు కారు పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం 150 వార్డ్‌లకు గానూ 100 మంది కౌన్సిలర్లను గెలిపించుకుని విజయఢంకా మోగించింది అప్పటి టీఆర్ఎస్. కానీ సడన్‌గా అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోవడంతో కారు పార్టీ కథ మంచిర్యాల జిల్లాలో అడ్డం తిరిగింది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లపై ఏకంగా సొంత పార్టీ కౌన్సిలర్లే అవిశ్వాస నోటీసులివ్వడం చైర్మన్ల తీరును వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కౌన్సిలర్లు గంపగుత్తగా కాంగ్రెస్ గూటికి చేరిపోవడటంతో బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా అదమ పాతాళానికి పడినంత పనైంది.ఇప్పటికే మంచిర్యాల, బెల్లంపల్లి, నస్పూర్ మున్సిపాలిటీలలో అవిశ్వాసంలో కాంగ్రెస్ నెగ్గగా.. క్యాతన్‌పల్లిలో కేవలం ఒక్కరంటే ఒక్కరినే గెలిపించుకున్న కాంగ్రెస్.. మారిన రాజకీయ పరిణామాలతో బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ గూటికి చేరిన చైర్మన్, వైస్ చైర్మన్లతో 10కి బలాన్ని పెంచుకుంది.
ఈ మున్సిపాలిటీలో ఫిబ్రవరి 6న బలనిరూపణ జరగనుండగా.. అంతకంటే ముందే శనివారం జరిగిన లక్షేట్టిపేట మున్సిపాలిటీలో అవిశ్వాసాన్ని వీగిపోయేలా పావులు కదిపి సత్తాచాటింది బీఆర్ఎస్.లక్షేట్టిపేట మున్సిపాలిటీలో మున్సిపల్ కౌన్సిలర్లు మొత్తం 15 వార్డులకు ఉండగా.. 5 కాంగ్రెస్, 9 బీఆర్ఎస్, ఒక స్వతంత్ర్య అభ్యర్థి అప్పటి ఎన్నికల్లో విజయం సాధించగా.. మారిన రాజకీయ పరిణామాలతో స్వతంత్ర్య అభ్యర్థితో పాటు బీఆర్ఎస్ నుంచి గెలిచిన ముగ్గురు కౌన్సిలర్లు బీఆర్ఎస్‌లో చేరడంతో కాంగ్రెస్ బలం తొమ్మిదికి చేరింది. అయితే అవిశ్వాసానికి 2/3 అంటే పది మంది కౌన్సిలర్ల బలం అవసరం కాగా.. ఓరుగంటి శ్రీకాంత్ అనే బీఆర్ఎస్ కౌన్సిలర్ సైతం సొంత పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాసం కోరుతూ సంతకం చేసి.. అంతలోనే యూ-టర్న్ తీసుకోవడంతో కాంగ్రెస్ ఇరకాటంలో పడింది. శనివారం జరిగిన అవిశ్వాస బలనిరూపణలో బలం లేకపోవడంతో కాంగ్రెస్ అవిశ్వాసానికి దూరంగా ఉండిపోయింది.
దీంతో 20 రోజుల ముందే తమ కౌన్సిలర్లను క్యాంపునకు తరలించిన బీఆర్ఎస్.. ఎట్టకేలకు అవిశ్వాసం వీగిపోవడంతో ఊపిరి పీల్చుకుంది. అయితే కాంగ్రెస్ మాత్రం అంత ఈజీగా ఈ మున్సిపాలిటీని వదులుకునే ఛాన్సే లేదని.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా చాటుతామంటోంది.