మింగ మెతుకు లేదు గానీ మీసాలకు సంపంగి నూనె అన్నట్టు ఉంది ఏపీలో ఉద్యోగ సంఘాల నేతల తీరు. సీఎం అంటే ప్రభుత్వ అధినేత అని.. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా సీఎంను పొగడడం తప్పు కాదని ఒకరు.. ఈ ప్రభుత్వం అన్ని చేసిందని.. పొగిడితే తప్పేంటని మరొకరు.. ఏ సీఎం కూడా ఇలా వ్యవహరించలేదని.. ఆయనకు పాలాభిషేకాలు చేయాలని ఇంకొకరు.. ఇలా ఉద్యోగ సంఘాల నేతలు పోటీపడి మరి సీఎం జగన్ ప్రాపకం కోసం పరితపించారు. ఇప్పుడు అదే ఉద్యోగ సంఘాల నోటి నుంచి సమ్మె మాట వినిపిస్తోంది. ఈ సమ్మెను అడ్డం పెట్టుకొని ఎలాంటి వ్యూహాలు పన్నారో అన్న అనుమానాలు కలుగుతున్నాయి.బండి శ్రీనివాసరావు అనే ఉద్యోగ సంఘాల పెద్ద నేత ఇటీవల ఒక ప్రకటన చేశారు. నాలుగున్నర సంవత్సరాలు ఓపిక పట్టం.. మా సహనాన్ని పరీక్షించొద్దు.. ఇక మా వల్ల కాదు అంటూ హెచ్చరికలతో కూడిన ప్రకటనలు చేశారు. అయితే మిగతా ఇద్దరు ఉద్యోగ సంఘాల నాయకులు కూడా బయటకు వస్తారని తెలుస్తోంది. విశాఖ నడిబొడ్డున ఇంటికి వచ్చి మరీ ఎమ్మార్వో ను దారుణంగా చంపారు.
దీనిని ఖండించాల్సిన బొప్పరాజు వెంకటేశ్వర్లు పొడిపొడిగా మాట్లాడి కనుమరుగయ్యారు. కనీసం ప్రభుత్వం పై ఎటువంటి విమర్శ చేయలేదు. ఆయన కంటే మండల స్థాయి ఉద్యోగ సంఘాల నేతలే.. రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని వినూత్న స్థాయిలో డిమాండ్ చేశారు. వారి నిరసన ముందు బొప్పరాజు నటన తేలిపోయింది.గత నాలుగున్నర సంవత్సరాలుగా ఏపీలో ఉద్యోగులకు ఏ స్థాయిలో అన్యాయం జరిగిందో అందరికీ తెలిసిందే. గతంలో ఉద్యోగులను ఈ తరహాలో ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం లేదు. అయినా సరే ఉద్యోగ సంఘాల నేతలు నోరు మెదపలేకపోయారు. ఉద్యోగుల కంటే జగన్ సర్కార్ కే వారు గట్టిగా పని చేశారు. అందుకే ఉద్యోగ సంఘాల నేతలను దాటుకొని.. ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిరసన బాట పట్టిన సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి చిన్నపాటి ఉత్తర్వులు వచ్చినా, కార్యరూపం దాల్చని హామీలు వచ్చినా.. వెంటనే ఉద్యోగులతో పాలాభిషేకాలు చేయిస్తారు. సీఎం జగన్ తడిసి ముద్దయ్యేలా ఉద్యోగ సంఘాల నేతలు తమ అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు.
అయితే ఇప్పుడు నాలుగున్నర ఏళ్లు ఎదురుచూశాం.. మా సహనాన్ని పరీక్షించొద్దు.. సమ్మెకు వెళ్తాం.. అన్న మాటలు ఉద్యోగ సంఘాల నేతల నుంచి వినిపించేసరికి.. తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానం వ్యక్తం అవుతుంది. సమ్మెను అడ్డం పెట్టుకొని.. హామీలు ఇచ్చి.. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో ఉన్న అసంతృప్తిని, ఆగ్రహాన్ని తగ్గించుకునే ఎత్తుగడ అని అనుమానాలు వినిపిస్తున్నాయి.2014లో టిడిపి అధికారంలోకి వచ్చింది. విభజిత ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం 42 పి ఆర్ సి ని ప్రకటించింది. గత ఎన్నికల ముందు చంద్రబాబు మరో 20% మధ్యంతర భృతి ప్రకటించారు. పిఆర్సిని ఏర్పాటు చేశారు.అయినా సరే ప్రభుత్వ ఉద్యోగులు సంతృప్తి చెందలేదు. ఉద్యోగ సంఘాల నేతలు సైతం రెచ్చిపోయారు. అప్పట్లో ఉద్యోగుల నుంచి వ్యతిరేకత టిడిపికి శాపంగా మారింది.
వైసీపీకి కలిసి వచ్చింది. ఇప్పుడు అదే ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండగా.. ఉద్యోగ సంఘాల నాయకులు అనుకూలంగా ఉన్నారు. ఉద్యోగుల మనసును మార్చేందుకు సమ్మెను అస్త్రంగా చేసుకుంటున్నారు. అయితే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి