నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. గత కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనకు నచ్చడం లేదని అన్నారు. ఆ అసంతృప్తితోనే బీజేపీని వదులుతున్నానని అన్నారు.బీజేపీలో వర్గ విభేదాలు ఉన్నాయని.. ఆ గ్రూపులతో తనపై విమర్శలు చేయిస్తున్నారని బాబూ మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్ ఎంపీ టికెట్ ను తాను ఆశించానని చెప్పారు. కానీ, అది తనకు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని అన్నారు. జీవితంలో ఒక్కసారైనా తాను అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేస్తానని, ఎన్నికల్లో గెలుస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. మరో పార్టీలో చేరే అంశంపై కూడా బాబూ మోహన్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. రాజకీయ భవిష్యత్తు గురించి ఏమీ ఆలోచించలేదని చెప్పారు.
బాబూ మోహన్ ఆందోల్ ఎమ్మెల్యేగా గతంలో పని చేసిన సంగతి తెలిసిందే. తనను బీజేపీలో అవమానిస్తున్నారని.. తన ఫోన్ కూడా బీజేపీ అధ్యక్షుడు ఎత్తడం లేదని వాపోయారు. తనకు పార్టీలో తగిన ప్రాధాన్యం లేదని.. అందుకే రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. రేపే తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడికి పంపుతానని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గత అక్టోబరులో కూడా బాబూ మోహన్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అదే సమయంలో ఆయనకు టికెట్ రావడంతో చల్లబడ్డారు. గత ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన బాబు మోహన్.. మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఇక.. అందోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున దామోదరం రాజనర్సింహ విజయం సాధించిన సంగతి తెలిసిందేతాజా రాజకీయ పరిణామాల వేళ బీజేపీ అధ్యక్షుడి వ్యవహారంతో తనకు పొసగడం లేదని.. ఆయన బీజేపీ నుంచి పూర్తిగా తప్పుకోడానికి నిర్ణయం తీసుకున్నారు.