ycp
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

పక్కా వ్యూహంతో వైసీపీ అడుగులు

రాజ్యసభ ఎన్నికల విషయంలో జగన్ పక్కా వ్యూహంతో అడుగులు వేస్తున్నారు.గత ఏడాది మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురైన ఫలితాలను గుణపాఠంగా చేసుకున్నారు. అందుకే ఈసారి ఆ తప్పిదం జరగకుండా చూసుకోవాలని భావిస్తున్నారు. రాజ్యసభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను వైసిపి ప్రకటించింది. వై వి సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబూరావుల పేర్లను ఖరారు చేశారు. ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం నేతలను, మరో ఎస్సీ నేతను ఎంపిక చేశారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ ఎస్సీ నేతను రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది.వాస్తవానికి చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు తొలుత జగన్ రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేశారు. రాయలసీమలో బలిజ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాసులకు టిక్కెట్ నిరాకరించారు. ఆయన స్థానంలో ఎర్రచందనం స్మగ్లింగ్ ఆరోపణలు, కేసులు ఉన్న విజయానంద రెడ్డికి టికెట్ కట్టబెట్టారు. ఈ కారణంగానే శ్రీనివాసుల కు రాజ్యసభ సీటు ఇస్తారని అంతా భావించారు. కానీ చివరి క్షణంలో కడప జిల్లా రాజంపేటకు చెందిన రఘునాథ్ రెడ్డికి కేటాయించారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ నిరాకరించడంతో.. ఆయన సోదరుడికి రాజ్యసభ ఇచ్చి సంతృప్తి చేస్తున్నారు.

అయితే గొల్ల బాబూరావు ఎంపిక వ్యూహాత్మకమేనని తేలుతోంది. సిట్టింగ్లను మార్చారు. కొందరికి స్థానచలనం కల్పించారు. మరి కొందరిని పక్కన పెట్టారు. ఇలా పక్కన పెట్టిన వారిలో ఎస్సీ ఎమ్మెల్యేలే అధికం. వారంతా వైసిపి పైన ఆగ్రహంగా ఉన్నారు. జగన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీరంతా అనుకుంటే మాత్రం రాజ్యసభ ఓటింగ్ లో తమ ప్రతాపాన్ని చూపగలరు. అందుకే జగన్ వ్యూహాత్మకంగా ఎస్సీ అభ్యర్థిని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే గొల్ల బాబూరావు ఒకసారి తన అసంతృప్తిని ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట వ్యక్తం చేశారు కూడా. మంత్రివర్గం లోకి తీసుకోకపోవడంతో తీవ్ర కలత చెందిన జగన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. దీంతో గొల్ల బాబూరావు కు పాయకరావుపేట టిక్కెట్ ను నిరాకరించారు. అనూహ్యంగా రాజ్యసభకు ఎంపిక చేశారు. మరోవైపు టిడిపి దళిత అభ్యర్థిని రంగంలోకి దించనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ టికెట్ దక్కని వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపి అభ్యర్థి వైపు మొగ్గుచూపితే బాబూరావు ఓడిపోవడం ఖాయం. అదే జరిగితే దళిత అభ్యర్థిని ఓడించారని ప్రచారం ఒకవైపు.. గొల్ల బాబురావు ఇంటికి పంపించామని మరోవైపు వైసీపీ సంతృప్తి పడే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.