తెలంగాణ ముఖ్యాంశాలు

1.67 లక్షల ఇండ్లు పూర్తి

  • ఇంటి ఓనర్లయిన పేదలు..
  • బతుకుల్లో ‘డబుల్‌’ వెలుగులు
  • కాలనీలకు సామూహిక గృహప్రవేశాల శోభ
  • ఒక్కఏడాదే 45,475 ఇండ్ల నిర్మాణం పూర్తి
  • 10,348 కోట్లు వెచ్చించిన రాష్ట్ర ప్రభుత్వం
  • స్వరాష్ట్రంలో పేదల సొంతింటి కల సాకారం

‘పూరి గుడిసెల ఉండి సుట్టు పారుతున్న మురుగుకేంచి గబ్బు వాసనొస్తుంటే ఊపిరి బిగవట్టుకుని బతికినం. రేకులిండ్లల్ల బతికినన్ని రోజులు కిరాయి కట్టుడు తప్పదనుకున్నం. ఇప్పుడో డబుల్‌ బెడ్రూం ఇంటికి యజమానులయినం. కలల గూడా గిట్లాంటి ఇంట్ల ఉంటమనుకోలే’ అంటూ పేదలు సంబురపడిపోతున్నారు. రాష్ట్రంలో రోజుకోచోట డబుల్‌ ఇండ్ల గృహ ప్రవేశాలతో కొత్త కాలనీలు వెలుస్తున్నాయి. సీఎం కేసీఆర్‌ ఆశయానికి ప్రతిరూపమైన డబుల్‌ బెడ్రూం ఇండ్ల పథకం లబ్ధిదారుల సంతోషాన్ని డబుల్‌ చేస్తున్నది.

‘పలానా ఊర్లో డబుల్‌ బెడ్రూంలు ఇచ్చిర్రంట’.. అని చర్చ జరుగుతుండగానే.. ‘అక్కడ కూడా గృహ ప్రవేశాలు జరుగుతున్నయంట’ అని తెలిసిపోతున్నది. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న డబుల్‌బెడ్రూం ఇండ్లు పేద లబ్ధిదారుల చేతికందుతున్నాయి. గత మూడు, నాలుగు నెలలుగా గృహప్రవేశాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇండ్ల ప్రారంభోత్సవాలతో సందడి నెలకొంటున్నది. ఊర్లలో కొత్త కాలనీలు వెలుస్తున్నాయి. హైదరాబాద్‌ సహా సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌.. ఇలా నిత్యం ఎక్కడో ఒకచోట గృహప్రవేశాలు జరుగుతూనే ఉన్నాయి. ముషీరాబాద్‌, సికింద్రాబాద్‌ నియోజకవర్గాల్లో నిర్మించిన 410 డబుల్‌ బెడ్రూం ఇండ్లను ఇటీవల మంత్రి కేటీఆర్‌ లబ్ధిదారులకు అందజేశారు. అంతకుముందు హుస్సేన్‌సాగర్‌ పక్కనే 330 గృహాలను ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మండేపల్లిలో 1,320, తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట తదితర ప్రాంతాల్లోనూ ఇటీవల గృహ ప్రవేశాలు జరిగాయి. నిర్మాణం పూర్తయిన లక్ష ఇండ్లను రానున్న రెండు మూడు నెలల్లో లబ్ధిదారులకు అందజేసేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ అధికారులు తెలిపారు.

1.67 లక్షల ఇండ్లు పూర్తి

ఈ ఏడాదే 45,475 ఇండ్లు
రాష్ట్రంలో డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణం శరవేగంగా సాగుతున్నది. ప్రభుత్వం 2016 లో పథకాన్ని ప్రారంభించిన నాటినుంచి ఇప్పటివరకు 1,67,722 ఇండ్ల నిర్మాణాన్ని పూర్తిచేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే రికార్డుస్థాయిలో 45,475 ఇండ్లను నిర్మించింది. మరో 67,934 ఇండ్లు 90 శాతం వరకు పూర్తయ్యాయి. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఆరేండ్లలో రూ.10,348 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.11 వేల కోట్లు కేటాయించింది. 2,91,057 ఇండ్లు నిర్మించాలని లక్ష్యం పెట్టుకోగా.. ఇప్పటివరకు 57 శాతం ఇండ్ల నిర్మాణాన్ని పూర్తిచేసింది. ఈ ఆర్థిక సంవత్సరం మిగిలిన 8 నెలల్లో మరిన్ని ఇండ్లను లబ్ధిదారులకు అందజేసేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ స్థలం అందుబాటులో లేనిచోట, సొంత స్థలం కలిగినవారికి రెండు పడకగదుల ఇండ్లు నిర్మించుకొనేందుకు ఆర్థికసాయం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రానున్న రోజుల్లో ఇండ్ల నిర్మాణాలు మరింత వేగంగా జరుగనున్నాయి.

ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం
నా భర్త పెయింటర్‌. ఇరవై ఏండ్లు ఇంటి అద్దె చెల్లించుడూ, పిల్లలను సాదుకొనేందుకే తిప్పలయ్యేది. నెల పూర్తయ్యేప్పుడు దినదినగండంగా కిరాయి ఎట్లా కట్టాలని గోస పడ్డాం. ఇప్పుడు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇంటితాళం చేతికి ఇచ్చారు. నాకు డబుల్‌ బెడ్రూం ఇల్లు వచ్చిందని చెప్పినప్పుడు కండ్లపొంట నీళ్లుదుంకినయ్‌. ఏమిచ్చినా కేసీఆర్‌, కేటీఆర్‌ రుణం తీర్చుకోలేం.

  • గాజుల మంజుల, లబ్ధిదారు, ఎల్లారెడ్డిపేట, సిరిసిల్ల

గరీబోళ్లకు కేసీఆర్‌ దేవుడు
నాకు నలుగురు బిడ్డలు, ఇద్దరు కొడుకులు. బిడ్డల పెండ్లి కోసం ఇంటిని అమ్మేశాం. పదేండ్లు బయట కిరాయికున్నం. కొడుకులకు ఇల్లు కూడా కట్టియ్యక పోతిమి.. సేతుల పైసల్లేకుంటాయె అని రంది పడ్డం. కేటీఆర్‌ దయతో రూపాయి లేకుండా ఇల్లు వచ్చింది. మా అసోంటి గరీబోళ్లకు కేసీఆరే దేవుడు.

  • ద్యాగం అంజవ్వ, లబ్ధిదారు, ఎల్లారెడ్డిపేట, సిరిసిల్ల