shakeel
తెలంగాణ రాజకీయం

షకీల్ కు హైకోర్టులో ఊరట

బేగంపేట ప్రజాభవన్  వద్ద కారుతో బారికేడ్లను ఢీకొట్టిన కేసుకు సంబంధించి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అమిర్  మరో ఇద్దరిపై పోలీసులు జారీ చేసిన లుక్ అవుట్ సర్క్యులర్ ను నిలిపేస్తూ శుక్రవారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కుమారుడి కారు ప్రమాదం కేసులో షకీల్ ను అరెస్ట్ చెయ్యొద్దని ఆదేశించింది. అయితే, పిటిషనర్లు ఈ నెల 23లోగా పోలీసుల ముందు విచారణకు హాజరై దర్యాప్తునకు సహకరించాలని షరతు విధించింది. గతేడాది డిసెంబరులో ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కేసులో షకీల్ కుమారుడు సాహిల్ తో పాటు స్నేహితులపై కూడా కేసు నమోదైంది. దర్యాప్తునకు సంబంధించిన కేసులో భాగంగా జారీ చేసిన లుక్ అవుట్ సర్క్యులర్లను సవాల్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే షకీల్, సయ్యద్ సాహెద్ రహమాన్, మహ్మద్ ఖలీల్ హైకోర్టులో శుక్రవారం అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన జస్టిస్ కె.లక్ష్మణ్.. ఈ కేసుపై పోలీసులు ఎందుకింత వేగంగా దర్యాప్తు చేస్తున్నారో తెలియడం లేదని, అదే సామాన్యులైతే ఇలానే చేస్తారా అంటూ అడిగారు.

ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో సీఆర్ఫీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేసి విచారణ చేయాల్సి ఉండగా అరెస్టులు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించారు. వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనర్లకు వ్యతిరేకంగా జారీ చేసిన ఎల్వోసీని సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు.
బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్‌ హైదరాబాద్ ప్రజా భవన్‌ వద్ద గతేడాది డిసెంబర్ 23న అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు. ఓ బీఎండబ్ల్యూ కారుతో అక్కడ ఉన్న బారికేడ్లను తొక్కుకుంటూ వెళ్లారు. అనంతరం కేసు నుంచి తప్పించుకునేందుకు డ్రైవర్‌ను లొంగిపోమని చెప్పి పంపించాడు. అయితే సీసీ టీవీ ఫుటేజ్‌తోపాటు స్థానికులను విచారించిన పోలీసులు డ్రైవింగ్ చేస్తుంది డ్రైవర్ కాదని సోహెల్ అని గుర్తించారు. ఈ ఘటనలో అతన్ని నిందితునిగా చేర్చామని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. గతంలో కూడా ఓ ప్రాంతంలో కారుతో విధ్వంసం సృష్టించి సోహెల్‌ ఒకరి మృతికి కారణమయ్యాడని డీసీపీ పేర్కొన్నారు. మరోవైపు, ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఐను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ప్రమాదం తర్వాత సోహెల్‌ను పోలీసులు అరెస్టు చేశారని చెబుతున్నారు. స్టేషన్‌కు తరలించిన తర్వాత మాజీ ఎమ్మెల్యే షకీల్‌ అనుచరులు వచ్చి సోహెల్‌ను విడిపించుకొని వెళ్లారని  అంటున్నారు. ఈ దృశ్యాలన్నింటినీ చూసిన ఉన్నతాధికారులు సీఐ దుర్గారావును సస్పెండ్ చేశారు. ఈ కేసులో పంజాగుట్ట ఇన్స్‌పెక్టర్‌తో పాటుగా బోధన్‌ సీఐని కూడా అరెస్ట్‌ చేసినట్లు డీసీపీ తెలిపారు. తుడికి పోలీసులు సహకరించినట్టు ఆధారాలు కూడా ఉన్నాయని అన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మొత్తం 16 మందిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.