జాతీయం రాజకీయం

రాజ్యసభ జాబితా రెడీ

రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ నుంచి ఆర్పీఎన్ సింగ్, సుధాన్షు త్రివేది అభ్యర్థులుగా ఎంపికయ్యారు. దీంతో పాటు బీహార్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, కర్ణాటక, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి కూడా పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.హర్యానా నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా సుభాష్ బరాలాను ప్రకటించగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్ర భట్‌ను ఉత్తరాఖండ్ నుండి రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించారు. బీహార్ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు ధర్మశిలా గుప్తాను కూడా పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. నితీష్ కుమార్ మాజీ సహాయకుడు భీమ్ సింగ్‌ను కూడా పార్టీ అభ్యర్థిగా చేసింది బీజేపీ. దీంతోపాటు కర్ణాటక నుంచి నారాయణ్ కృష్ణసా భాంగే, ఛత్తీస్‌గఢ్ నుంచి రాజా దేవేంద్ర ప్రతాప్ సింగ్, పశ్చిమ బెంగాల్ నుంచి సామానీ భట్టాచార్య అభ్యర్థులుగా నిలిచారు. చౌదరి తేజ్‌వీర్ సింగ్, సాధన సింగ్, అమర్‌పాల్ మౌర్య, సంగీతా బల్వంత్, నవీన్ జైన్ ఉత్తరప్రదేశ్ నుండి రాజ్యసభకు తమ అభ్యర్థులుగా ప్రకటించింది బీజేపీ.

ఇక తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రాజ్యసభ ఎన్నికలకు తన నలుగురు అభ్యర్థులను ప్రకటించింది. మతువా కమ్యూనిటీ నుండి జర్నలిస్టు సాగరిక ఘోష్, నడిముల్ హక్ సుస్మితా దేవ్, మమతా బాలా ఠాకూర్‌లను పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ నామినేట్ చేశారు. సాగరిక ఘోష్ విషయానికి వస్తే ఆమె జర్నలిస్టు, ఆమె భర్త రాజ్‌దీప్ సర్దేశాయ్ ప్రముఖ జర్నలిస్టు. రాజ్‌దీప్ సర్దేశాయ్ తరచుగా సోషల్ మీడియా, ‘ఇండియా టుడే’ న్యూస్ ఛానెల్ ద్వారా ప్రధాని మోదీపై, ప్రభుత్వ విధానాలపై తీవ్రమైన విమర్శలు చేస్తుంటారు. సాగరిక ఘోష్ సైతం జర్నలిస్టుగా చాలా ఏళ్ళుగా సుపరిచితులు. ది టైమ్స్ ఆఫ్ ఇండియా, ఔట్‌లుక్, ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వంటి వార్తా సంస్థల్లో సాగరిక ఘోష్ పనిచేశారు. సాగరిక సైతం మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా తన బాణీ వినిపిస్తుంటారు.ఇక, ఈ ఏడాది 68 మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయబోతున్నారు. వీరిలో ముగ్గురు ఎంపీల పదవీకాలం జనవరి 27తో ముగియగా, మరో 65 మంది సభ్యులు పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఈ 65 మంది సభ్యులలో 55 మంది సభ్యులు ఫిబ్రవరి 23న పదవీ విరమణ చేయనున్నారు.

అదే సమయంలో, ఏడు మంది రాజ్యసభ ఎంపీల పదవీకాలం ఏప్రిల్ 2-3 మధ్య పూర్తవుతుంది. మే నెలలో మరో ఇద్దరు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు.అత్యధికంగా బీజేపీ ఎంపీలు రిటైర్ అవుతున్నారు. ఈ ఏడాదితో బీజేపీకి చెందిన 32 మంది రాజ్యసభ ఎంపీల పదవీకాలం పూర్తవుతోంది. దీని తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది ఎంపీలు పదవీ విరమణ చేయనున్నారు. టీఎంసీ నుంచి నలుగురు ఎంపీలు, బీఆర్‌ఎస్ నుంచి ముగ్గురు ఎంపీలు ఉన్నారు. ఇది కాకుండా జేడీయూ, బీజేడీ, ఆర్జేడీలకు చెందిన ఇద్దరు సభ్యులు రిటైర్ అవుతున్నారు. ఎన్‌సీపీ, ఎస్పీ, శివసేన, టీడీపీ, వైఎస్సార్‌సీపీ, ఎస్‌డీఎఫ్‌, సీపీఐ, సీపీఐఎం, కేరళ కాంగ్రెస్‌ల నుంచి ఒక్కో ఎంపీ ఈ ఏడాది పదవీకాలం పూర్తి చేసుకోనున్నారు.