తెలుగు రాష్ట్రాల మధ్య జల యుద్ధం మొదలైంది. ఈ వివాదాన్ని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తెస్తోంది. ఏపీలోని జగన్ సర్కార్ కు మేలు చేసేలా కెసిఆర్ నాడు నిర్ణయాలు తీసుకున్నారంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరిగిందో వివరిస్తూ ఏకంగా అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. కృష్ణా నది ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రానికి అప్పగించే ప్రసక్తే లేదని రేవంత్ సర్కార్ స్పష్టం చేస్తోంది. ఏకంగా అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రతిపాదించింది. అయితే దీనిపై పిసిసి అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల ఎలా స్పందిస్తారో చూడాలి. నాడు తెలంగాణలోని వైయస్సార్సీపీ అధ్యక్షురాలిగా షర్మిల ప్రస్తావించారు. ఉభయ రాష్ట్రాల సీఎంలుగా ఉన్న కేసీఆర్, జగన్ లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలను సజీవంగా ఉంచేందుకు కేసిఆర్ ప్రయత్నించారని ఒక విమర్శ ఉంది. మొన్నటి తెలంగాణ ఎన్నికల పోలింగ్ రోజున ఏపీ సర్కార్ నాగార్జునసాగర్ పై దండయాత్ర చేసింది.
అది పోలింగ్ లో కేసీఆర్ కు ప్రయోజనం చేకూర్చే ప్రయత్నం అని కాంగ్రెస్ ఆరోపించింది. ఒకవేళ అధికారం కోల్పోతే తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదంతో మళ్లీ అధికారంలోకి రావాలని కెసిఆర్ భావించినట్లు వార్తలు వచ్చాయి. ఉభయతారకంగా ఉంటుందని నాడు జగన్ తో సాగర్ డ్యాం పై దండయాత్ర చేయించారని కెసిఆర్ పై కాంగ్రెస్ కు అనుమానం ఉంది. అందుకు తగ్గట్టుగానే ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రానికి అప్పగించడాన్ని తప్పుపడుతూ కెసిఆర్ ఉద్యమానికి సిద్ధమయ్యారు. దీంతో రేవంత్ అప్రమత్తమయ్యారు. జగన్ తో రాజకీయ ప్రయోజనాల కోసం చేసుకున్న ఒప్పందాలను బయట పెట్టేందుకు నిర్ణయించుకున్నారు. కెసిఆర్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఏపీకి ఎలా లాభం చేకూరింది.. తెలంగాణ ఎలా నష్టపోయింది.. వంటి సమగ్ర వివరాలతోపవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు.అయితే దీనిపై జగన్ సర్కార్ నోరు మెదపడం లేదు. కనీసం స్పందించిన దాఖలాలు లేవు. మరోవైపు కృష్ణానది పై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడానికి జరిగిన సమావేశాల్లో రేవంత్ తన అంగీకారం తెలిపారు అన్న ప్రచారాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు.
నాడు సీఎంలు గా ఉన్న కేసీఆర్, జగన్ మధ్య జరిగిన ఒప్పందాలను సభలో వివరించారు. అయితే విభజన హామీలపై పిసిసి అధ్యక్షురాలు షర్మిల తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే రెండు రాష్ట్రాల మధ్య జల జగడం జరుగుతోంది. వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఏపీకి ప్రయోజనం చేకూర్చేలా కేసీఆర్ వ్యవహరించారని నాడు ఆరోపించారు.చాలా రకాలుగా విమర్శలు చేశారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అదే విమర్శలు చేస్తోంది. ఏపీలో కాంగ్రెస్ అధ్యక్షురాలుగా తెలంగాణ సర్కారు వాదనను అంగీకరిస్తారా? ఎలా రియాక్ట్ అవుతారు అనేది సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ నడుస్తోంది.