తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు సంకట దుస్థితి. పొత్తు విషయంలో ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. పొత్తు ఉండాలి కానీ.. మెజారిటీ సీట్లు వదులుకునే పరిస్థితిలో టిడిపి లేదు. అయితే జనసేన, బిజెపి మాత్రం సీట్ల విషయంలో పట్టుదలతో ఉన్నాయి. మెజారిటీ సీట్లు డిమాండ్ చేస్తున్నాయి. వాటిని ఇస్తేనే పొత్తు అని తేల్చి చెబుతున్నాయి. దీంతో చంద్రబాబు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. సీట్లు ఇస్తామని చెప్పడం లేదు. ఇవ్వమని చెప్పడం లేదు. లోలోపల సతమతమవుతున్నారు. ఒకవేళ వారు అడిగిన అన్ని సీట్లు ఇస్తే పార్టీలో తిరుగుబాటు తప్పదని భావిస్తున్నారు.బిజెపి నేతల ఆహ్వానం మేరకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశం అయ్యారు. కొన్ని ప్రతిపాదనల విషయం తెలుసుకున్నారు. కానీ అటు తరువాత ఈ చర్చల్లో పురోగతి నిలిచిపోయింది. ఎక్కడా చర్చలు జరుపుతున్న దాఖలాలు కనిపించడం లేదు. అయితే ఇదే సమయంలో కాపు సంక్షేమ సంఘం ప్రతినిధి హరి రామ జోగయ్య లేఖలు విడుదల చేస్తున్నారు
. పొత్తు కుదరాలంటే జనసేనకు భారీగా సీట్లు ఇవ్వాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. అయితే ఈ లేఖలు.. బిజెపి చెబుతున్న లెక్కలకు దగ్గరగా ఉండడంతో అందరిలో అనుమానాలు ప్రారంభమయ్యాయి.
ఈ లేఖల వెనుక బిజెపి హస్తము ఉందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కేవలం జనసేన, టిడిపి మధ్య విభేదాలు సృష్టించేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని.. తద్వారా పొత్తులో భాగంగా మెజారిటీ సీట్లు దక్కించుకోవాలని చూస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.బిజెపి అగ్రనేతలు మూడు అంశాలతో పొత్తుకు సిద్ధపడుతున్నారని తెలుస్తోంది. బిజెపి, జనసేనకు 60 అసెంబ్లీ స్థానాలు, పది పార్లమెంట్ స్థానాలు, ముఖ్యమంత్రి పదవి షేరింగ్ వంటి షరతులు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి టిడిపి క్యాడర్ ఒప్పుకోదని చంద్రబాబుకు తెలుసు. అన్ని సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు కూడా మనసు రాదు. అదే జరిగితే ఓట్ల బదలాయింపు సక్రమంగా జరగదని కూడా చంద్రబాబు భయపడుతున్నారు. అందుకే ఎలా ముందుకెళ్లాలో తెలియక గుంభనంగా ఉన్నారు. ఇంతవరకు వచ్చి పొత్తులు కుదరకపోతే బిజెపి నుంచి ఎదురయ్యే పరిణామాలు కూడా తెలుసు. అందుకే పొ త్తు వద్దని చెప్పలేరు. ఉండాలంటే ఎక్కువ సీట్లు వదులుకోవాల్సి ఉంటుంది. అందుకే చంద్రబాబు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. మరి ఈ సమస్య నుంచి ఎలా బయటపడతారో చూడాలి.