sand mining
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

ఇసుక అక్రమ రవాణా నిజమే

ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై ప్రతిపక్షలు ఎంత గగ్గోలు పెట్టినా  అబ్బే అలాంటిదేమీ లేదని కొట్టి పారేసిన జగన్ ప్రభుత్వానికి  హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో ఇసుక అక్ర తవ్వకాలు నిజమేనని…తాము స్వయంగా పరిశీలించామంటూ  కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టుకు విన్నవించింది. భారీ యంత్రాలతో నదీ గర్భాలను  కొల్లగొడుతున్నారని  నివేదించింది.రాష్ట్రంలో ఇబ్బడిముబ్బడిగా  జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా నిజమేనని కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.  చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాలతో కదిలిన కేంద్ర యంత్రాంగం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించింది. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు,ఎంఓఈఎఫ్‌ అధికారులు వివిధ ప్రాంతాల్లో భారీ యంత్రాలతో ఇసుక తవ్వతున్న తీరును పరిశీలించారు. అక్రమ తవ్వకాల ఫొటోలు, నకిలీ బిల్లు పుస్తకాలు, తదితర ఆధారాలను సేకరించారు. వీటిన్నింటినీ  రాష్ట్ర హైకోర్టు ముందుంచారు. ఆధారాలు పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో ఇసుక విధానం, ధర,రవాణా వివరాలు తమ  ముందు ఉంచాలంటూ  రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేశించింది.

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్రమ  ఇసుక తవ్వకాలపై  తక్షణం చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ వాదనకు భిన్నంగా  రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. రాష్ట్రంలో ఎక్కడా ఇసుక తవ్వకాలే జరగడం లేదని.. అంతకు ముందు తవ్వి నిల్వ చేసిన స్టాక్ పాయింట్ల నుంచే రవాణా జరుగుతుందని చెప్పారు. దీనిపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. స్టాక్ పాయింట్లలో ఇసుక ఎంత తరలించినా  తరగనంతగా నిల్వ చేశారా అంటూ నిలదీసింది. ఎంతకాలం ఇలాంటి మాటలు చెబుతారంటూ  ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది . రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు ఎప్పుడో నిలిచిపోయిన…స్టాక్ పాయింట్లకు ఇసుక ఎక్కడ నుంచి వస్తుందని…ఎన్నాళ్లు స్టాక్ పాయింట్ల ద్వారా రవాణా చేస్తారని కోర్టు ప్రశ్నించింది. స్టాక్ పాయింట్లలో తవ్విన కొద్దీ ఇసుక ఎలా వస్తుందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. వేల లారీల ఇసుకను ఎలా స్టాక్ చేయగలిగారని చురకలు అంటించింది.  

కోర్టుకు చెప్పిన వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఇసుక తవ్వకాలు జరపడం లేదని తెలిపినా.. కేంద్ర సంస్థలు మాత్రం ఆధారాలతో సహా హైకోర్టుకు నివేదించాయి. పర్యావరణ అనుమతులు  లేవని రాష్ట్రంలో 110 ఇసుక రీచ్ లకు అనుమతులు రద్దు చేసినా…రాష్ట్రంలో ఎక్కడా ఇసుక తవ్వకాలు ఆగలేదని తెలిపాయి. అక్రమ ఇసుక తవ్వకాలను నిలువరించడంలో  ప్రభుత్వం విఫలమైతే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించింది. అక్రమ తవ్వకాల గురించి మీ దృష్టికి వచ్చినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని గనులశాఖ అధికారులను ప్రశ్నించింది. నీవా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలపై అధికారుల దృష్టికి తెచ్చినా చర్యలు లేవంటూ చిత్తూరు మండలం అనంతపురం సర్పంచ్‌ డి.స్వామినాథన్‌ హైకోర్టులో పిల్‌ దాఖలుచేశారు. భారీ యంత్రాలతో విచక్షణారహితంగా ఇసుకను తవ్వుతున్నారని చెప్పి.. ఫొటోలను ధర్మాసనం ముందు ఉంచారు. దీనిపై విచారణ జరిగిన హైకోర్టు అధికారులను హెచ్చరించింది.