50 వేల ఉద్యోగాల భర్తీకి ఆమోదముద్ర వేసే అవకాశం
తెలంగాణలో కొత్త జోన్ల వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమం కావడంతో యాభైవేల ఉద్యోగాల భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోంది. రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. 50 వేల ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు శాఖల వారీగా అధికారులు ఖాళీల వివరాలు సేకరించారు. వాటికి కేబినెట్ ఆమోద ముద్ర వేయడంతో పాటు ఉద్యోగుల పదోన్నతులపైనా నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలోని 32 శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. కేబినెట్ ఆమోదం తరువాత రాష్ట్రంలో కొత్త జిల్లాలు, కొత్త జోన్ల వారీగా నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.