ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ది ఆసక్తిగా మారుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ స్టేట్ చీఫ్‌గా షర్మిల పదవి చేపట్టినప్పటి నుంచి ఏపీ కాంగ్రెస్ మళ్లీ పుంజుకునేందుకు షర్మిల గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం రేవంత్ రెడ్డి కూడా బరిలోకి దిగుతున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. నెలాఖరులోపు విశాఖపట్నంలో బహిరంగసభ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అదే సభలో కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఈ సభకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏపీలో పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత షర్మిల రెండుసార్లు విస్తృతంగా పర్యటించారు. అయితే ముఖ్యమైన నాయకులతో ఓ బహిరంగసభను ఇంకా ప్లాన్ చేసుకోలేదు. షర్మిల తన కుమారుడి వివాహా పనుల్లో బిజీగా ఉన్నారు. పదిహేడో తేదీన వివాహం పూర్తవుతుంది.
అందుకే ఇరవై ఐదో తేదీన బహిరంగసభ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ున్నారు. తిరుపతిలో భారీగా జన సమీకరణ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల షర్మిల రేవంత్ రెడ్డిని కలిసి.. ఏపీ రాజకీయాలపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఏం చేయాలన్నదానిపై మాట్లాడారు. బహిరంగసభలకు తాను హాజరవుతానని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చినట్లుగా చెబుతున్నారు.కాంగ్రెస్ పార్టీ ఏ జిల్లా నుంచి ఎన్నికల శంఖారావాన్ని మొదలుపెట్టనుందనే విషయాన్ని పార్టీ సీనియర్ నేత రఘువీరారెడ్డి ఇవాళ మీడియాకు తెలియజేశారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మాట్లాడి అనంతపురం జిల్లా నుంచి ఎన్నికల శంఖారావం ప్రారంభిస్తామని వెల్లడించారు. పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ నెల 26న మల్లికార్జున ఖర్గే, వైఎస్ షర్మిల, మాణిక్యం ఠాగూర్‌లతో కలసి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామని ప్రకటించారు. అందులో భాగంగానే బహిరంగసభలు కూడా ప్లాన్ చేసుకున్నారు. ఎన్నికల ప్రచారానికి ఏఐసీసీ అగ్రనేతలు పాల్గొంటారని కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ ప్రకటించారు.
ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశాఖపట్నం వస్తున్నారని, ఆయనతో పాటు కర్ణాటక సీఎం సిద్దరామయ్య కూడా వస్తారని స్పష్టంచేశారు. ఏఐసీసీ అగ్రనేత ప్రియాంకా గాంధీ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదాకు అగ్రనేత రాహుల్ గాంధీ కట్టుబడి ఉన్నారని వెల్లడించారు. తమ అజెండా చాలా క్లియర్‌గా ఉందని స్పష్టంచేశారు. మరోవైపు సీఎం జగన్ ఏపీ ప్రయోజనాలను బీజేపీ దగ్గర తాకట్టు పెట్టారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి ఏపీలోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన బహిరంగసభకు వస్తారంటే.. జనం పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి పేరును ఉపయోగిచుకుని.. రెడ్డి వర్గాన్ని , దళిత, మైనార్టీలను కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షించాలని గట్టి ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నారు. తిరుపతి సభ కు మంచి ఆదరణ లభిస్తే.. తర్వాత రేవంత్ రెడ్డి తో వరుస సభలు నిర్వహించే ఆలోచనలో ఏపీ పీసీసీ వర్గాలున్నాయి.