ap bjp
తెలంగాణ రాజకీయం

బీజేపీ సైడ్ ట్రాకేనా

తెలంగాణ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ మెల్లగా సైడ్ ట్రాక్ పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది.  లోక్ సభ ఎన్నికలు దగ్గర పడటంతో  బీఆర్ఎస్ రేసులోకి వచ్చేందుకు అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది. ఆ పార్టీకి గట్టి కౌంటర్ ఇచ్చేందుకు అధికార పార్టీ అదే దూకుడు ప్రయోగిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ వెనుకబడిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కృష్ణా ప్రాజెక్టులు, కాళేశ్వరం విషయంలో  బీజేపీ తన వాదనను  సమర్థంగా వినిపించలేకపోయింది. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే సమరం సాగుతోందన్న అభిప్రాయం వినిపించడం ప్రారంభమయింది. అసెంబ్లీలో  కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై యుద్ధం జరిగింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీ తలపడ్డాయి. ఎవరి వాదన వారు వినిపించారు. ఇందులో రాజకీయం ఉందా..  రాష్ట్ర ప్రయోజనాలు ఉన్నాయా అన్న సంగతి తర్వాత కానీ..  అసలు విషయం రెండు పార్టీలు కలిసి బీజేపీ గురించి ప్రజలు ఆలోచించకుండా చేశాయి.  కృష్ణా  ప్రాజెక్టులు అప్పగించడం లేదా ఉంచుకోవడం రెండింటిలో దేన్నీ తమ విధానంగా చెప్పలేని పరిస్థితిలో బీజేపీ పడిపోయింది.  

ఈ వ్యవహారంలో బీజేపీ ఆటలో అరటిపండుగా మారింది. ఇది బీజేపీకి పార్లమెంట్ ఎన్నికలకు ముందు తీర్చలేని సమస్యే. ఆ పార్టీ తరపున అసెంబ్లీలో మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. కానీ ఏపీ నీళ్లు తీసుకెళ్తూంటే.. బీఆర్ఎస్ సైలెంట్ గా ఉందన్న పాతన వాదనే వినిపించారు. కొత్త విషయలేం చెప్పలేదు. కృష్ణా ప్రాజెక్టుల అంశాన్ని గట్టిగా తమ పార్టీ తరపున సమర్థించుకోవడమో లేదా రెండు పార్టీలు కలిసి నాటకాలు ఆడుతున్నాయన్న సంగతిని కానీ గట్టిగా చెప్పలేకపోయారు. కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు కు ప్రాజెక్టులను అప్పగించిన వ్వవహారంపై అసెంబ్లీలో  వాడివేడి చర్చ జరిగింది.  ఈ చర్చ సారాంశం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వమే ప్రాజెక్టులను బలవంతంగా తీసుకుంటూ తెలంగాణకు అన్యాయం చేస్తుందన్న సందేశం ఇవ్వడం. బీఆర్ఎస్ నేతలు అదే తరహా ప్రసంగాలు చేశారు.  కాంగ్రెస్ నేతలూ అదే చెప్పారు. అయితే ఇక్కడ రాజకీయం ఏమిటంటే వీరి ప్రసంగాల్లో ఎక్కడా కేంద్రాన్ని తప్పు పట్టలేదు.  కానీ.. అసలు విలన్ కేంద్రమేనన్న సంకేతాలను గట్టిగా పంపారు.  

కృష్ణా ప్రాజెక్టుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి అప్పగిస్తోందనేది బీఆర్ఎస్ ప్రధాన ఆరోపణ.  తాము అప్పగించే ప్రశ్నే లేదని.. గతంలోనే అప్పగిస్తూ సంతకాలు చేశారని కాంగ్రెస్ వాదిస్తోంది. దీనిపై అసెంబ్లీలో వాడివేడి చర్చ. ఇందులోనే తాము ప్రాజెక్టులు అప్పగించబోమని తీర్మానం చేసింది కాంగ్రెస్.. బీఆర్ఎస్ సమర్థించింది. మరి బీజేపీ ఎక్కడ ?.  రెండు విధాలుగా ఇరుక్కుపోయింది బీజేపీ అందుకే సైలెంట్ అయిపోయింది. రెండు పార్టీలు కలిసి  పరస్పర యుద్ధం చేసుకుంటున్నట్లుగా షో చేసి..  బీజేపీని విలన్ గా ప్రజల ముందు పెట్టాయన్న అనుమానాలు బీజేపీ నేతలు పెరుగుతున్నాయి.  అసెంబ్లీ యుద్ధం చూస్తే తెలంగాణలో రాజకీయం అంతా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య జరుగుతోందని అనిపిస్తే అందులో తప్పేమీ లేదు. ఎందుకంటే ఈ విషయంలో బీజేపీ తన వాదన కూడా వినిపించడానికి  ఆసక్తి చూపించలేకపోయింది. ఇద్దరూ నాటకాలు ఆడుతున్నారని అంటున్నా.. బీజేపీ గురించి పట్టించుకోకుండా గ్రౌండ్ లో ఉత్కంఠ భరిత యుద్ధం చేసేస్తున్నారు బీఆర్ఎస్, కాంగ్రెస్ కేసీఆర్ నల్లగొండలో సభ పెడితే.. కాంగ్రెస్ మేడిగడ్డ టూర్ ఏర్పాటు చేసింది. ప్లాన్డ్ గా ఎమ్మెల్యేలందర్నీ తీసుకెళ్తామని చెప్పింది.

అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్న పార్టీల్లో కాంగ్రెస్, సీపీఐ, మజ్లిస్ పార్టీలు మేడిగడ్డకు వెళ్లాయి. బీఆర్ఎస్, బీజేపీ మాత్రమే వెళ్లలేదు. దీంతో ఆ రెండు పార్టీల మధ్య బంధం ఉందని.. కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. దీన్నిగట్టిగా తిప్పికొట్టలేని పరిస్థితుల్లో  బీజేపీ పడిపోయింది. గతంలోనూ ఇలాంటి ప్రచారమే జరిగింది. అది బీజేపీకి నష్టం చేసింది. తెలంగాణలో  బీఆర్ఎస్ , కాంగ్రెస్ మధ్యే ఏదో పోరాటం నడుస్తోందని.. రెండు పార్టీల మధ్యే యుద్ధం జరుగుతోందని అనిపించడానికి.. కృష్ణా ప్రాజెక్టులు, మేడిగడ్డతో పాటు ఇతర అంశాలతో   రాజకీయం చేస్తున్నారని బీజేపీ అనుమానిస్తోంది. అసలు లేని  వివాదాన్ని తెరపైకి తెచ్చి సభలు.. సమావేశాలు పెట్టుకుంటున్నారని.. ఇదంతా లోక్ సభ ఎన్నికల రాజకీయం అని  గట్టిగా నమ్ముతోంది. కానీ.. కౌంటర్ ఇవ్వడానికి మాత్రం ఆ పార్టీకి సరైన అవకాశం .. వాయిస్ దొరకడం లేదు.  కృష్ణా ప్రాజెక్టుల్ని తాము కాపాడుతున్నామంటే.. తాము కాపాడుతున్నామని  బీఆర్ఎస్, కాంగ్రెస్ అసెంబ్లీ వేదికగా వాదించుకుంటున్నాయి.  

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు సాగర్ డ్యాంపై ఏం జరిగిందో అందరూ చూశారు.  ప్రాజెక్టును ఆక్రమించుకున్న ఏపీ పోలీసులు బలవంతంగా గేట్లు కూడా ఎత్తేసుకున్నారు. ఇదంతా రాజకీయ వ్యూహంలో భాగమన్న అనుమానాలు ఉన్నాయి. ఇది రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడటానికి కారణం అయింది.   మరోసారి   అలా జరగకుండా కేంద్రం రక్షణ ఏర్పాటు చేసింది. లోక్‌ సభ ఎన్నికలపై బీజేపీ చాలా ఆశలు పెట్టుకుంది. మోదీ  హవా,  రామమందిరం ట్రాన్స్‌తో  కనీసం  పది సీట్లను గెల్చుకోవాలని టార్గెట్ పెట్టుకుంది. కానీ రాజకీయ పరిస్థితులు మాత్రం.. రెండు పార్టీల మధ్య పోరాటంలా మారుతోంది. లోక్ సభ ఎన్నికలు కాబట్టి బీఆర్ఎస్‌కు అసలు చాన్స్ ఉండదని రెండు జాతీయ పార్టీల మధ్య పోరాటం జరుగుతుందని అనుకున్నారు.

కానీ బీఆర్ఎస్ బలంగా కాంగ్రెస్ తో పోటీ పడేందుకు ప్రయత్నిస్తోంది. ప్రజలు.. ఓటర్లు బీజేపీ వైపు ఆలోచించకుండా రాజకీయాలు సాగుతున్నాయి.  ఇదంతా  కాంగ్రెస్, బీఆర్ఎస్ మాత్రమే యుద్ధం చేస్తున్న భావన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేతలంటున్నారు. కానీ ఈ విషయాన్ని ప్రజలకు ఎలా చెప్పాలో మాత్రం వారికి అర్థం కావడం లేదని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి.