jagan
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

జగన్ ఎన్నికల్లో హింసను ప్రోత్సహిస్తున్నారా…

వైఎస్ఆర్‌సీపీ అధినేత, సీఎం జగన్ రెండో సారి గెలిచేందుకు ఎన్నికల ప్రచార వ్యూహం భిన్నంగా ఉంది. సిద్ధం అనే పేరుతో క్యాంపెయిన్ ప్రారంభించి యుద్ధానికి సిద్ధం కావాలని క్యాడర్ కు పిలుపునిస్తున్నారు. చొక్కాలు మడత పెట్టే సమయం వచ్చిందని .. మీరే నా సైన్యమని వాలంటీర్ల సభలో వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్ ఇస్తున్న పిలుపులు.. ఆయన ప్రచార వ్యూహం చూస్తూంటే.. ఎన్నికల యుద్ధం పేరుతో క్యాడర్ ను రెచ్చగొడుతన్నారని.. హింసాత్మక ఎన్నికలకు ప్రిపేర్ చేస్తున్నారన్న విమర్శలు విపక్షాల నుంచి అంతకంతకూ పెరుగుతున్నాయి. దానికి తగ్గ పరిణామాలు ఒకటొకరిగా వెలుగులోకి వస్తూండటంతో.. వైసీపీ వ్యూహం భయపెట్టి ఎన్నిక్లోల గెలవడం అనేనని.. మీరు చొక్కాలు మడతేస్తే మేం కుర్చీ మడతపెడతామని
విపక్షాలు అంటున్నాయి. సాధారణంగా అధికారంలో ఉండే పార్టీ యుద్ధానికి వెళ్తున్నట్లుగా ఎన్నికలకు వెళ్లదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పోటీ రెండు పార్టీల మధ్య జరుగుతున్నట్లుగా కనిపిస్తుంది కానీ.. అసలు విజేతలు ప్రజలే. ప్రజలు ఎవరు కావాలనుకుంటే వారిని గెలిపిస్తారు.

అధికారంలో ఉన్న పార్టీ తమ పాలనపై ప్రజాతీర్పు ఇవ్వాలని వెళ్తుంది. అదే దిశగా ప్రచారం చేస్తుంది. కానీ వైఎస్ఆర్సీపీ అసలు విషయం కన్నా యుద్ధానికి సిద్ధమన్నట్లుగా ప్రచారం చేస్తోంది. కూటమిగా కట్టి మిగిలిన పార్టీలన్నీ వస్తున్నాయని.. మిమ్మల్ని నమ్ముకుని ఒక్కడిగా ఉన్నానని జగన్ మోహన్ రెడ్డి సభల్లో చెబుతున్నారు. తనకు రక్షణగా ఉండా లంటున్నారు. తన కోసం యుద్ధం చేయాలంటున్నారు. క్యాడర్ తో ఏర్పాటు చేసిన సిద్ధం సభల్లో.. అవే చెబుతున్నారు. వాలంటీర్లతో ఏర్పాటు చేసిన సభలో మరో అడుగు ముందుకేశారు. చొక్కాలు మడత పెట్టాలని పిలుపునిచ్చారు. అంటే దాడులు చేయడానికి కూడా సిద్ధపడాలన్న అర్థం అందులో ఉందని ఎవరికైనా సులువుగా అర్థమవుతుంది.ఎన్నికల యుద్ధంలో చొక్కాలు మడత పెట్టాలనడంపై విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. అయినా ఈ డోస్ ను సీఎం జగన్ పెంచుకుంటూ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. సీఎం జగన్ ప్రకటనలు, హింసాత్మక ఎన్నికల అంశంపై చర్చ జరుగుతున్న సమయంలోనే ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలిలో స్థానిక ఎన్నికలు నిర్వహించిన తీరును వివరిస్తూ.. ఓ ఆడియో టేప్ వెలుగులోకి వచ్చింది.

ఎమ్మెల్సీ తాము ఏ విదంగా పంచాయతీ ఎన్నికలు గెలిచామో వివరించారు. వ్యూహాత్మకంగా అచ్చెన్నాయుడు స్వగ్రామంలో దాడులు చేసి.. రివర్స్ లో అచ్చెన్నాయుడుపై కేసులు పెట్టి ఆయనను అరెస్ట్ చేసి.. నియోజకవర్గం అంతా భయానక వాతవరణం ఏర్పాటు చేశారు. తర్వాత టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థులపై రౌఢీషీట్లు ఓపెన్ చేసి.. ఇంట్లో నిర్బంధించి ఎన్నికలను ఏకపక్షంగా నిర్వహించుకున్నారు. ఫలితంగా 55 పంచాయతీలే వస్తాయని తేలిన చోట… ఓ పది ఇరవై తప్ప అన్ని పంచాయతీలను.. జడ్పీటీసీలను గెల్చుకున్నారు. అంటే భయపెట్టి.. పోలీసుల్ని దుర్వినియోగం చేసి ఎన్నికలు నిర్వహించారు. ఈ ఆడియో టేప్ వైరల్ అయింది. అందులో ఒక్క శాతం కూడా అబద్ధం లేదని.. టెక్కరిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తీరును చూసిన ఎవరికైనా అర్థమవుతుంది. ఇదే వ్యూహాన్ని స్థానిక ఎన్నికల్లో రాష్ట్రమంతా పాటించారు. వచ్చే ఎన్నికలు చాలా హింసాత్మకంగా ఉంటాయని చాలా మంది రెండేళ్లుగా అంచనా వేస్తున్నారు. దానికి కారణాలు కూడా చెబుతున్నారు.

గత రెండేళ్లుగా ఏపీలో పోలీసు వ్యవస్థ పని తీరుపై ఎన్ని విమర్శలు వచ్చాయో లెక్కలేదు. చివరికి తిరుపతి ఉపఎన్నికలు నిర్వహించిన తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. చివరికి ఎన్నికల కమిషన్ విచారణకు ఆదేశించడంతో అన్ని వివరాలు బయటకు వచ్చాయి. కొన్ని వేల నకిలీ ఓట్లతో ఎన్నికలు నిర్వహించారు. అధికార పార్టీ, నేతలు ప్రోద్భలంతో జరిగినవే ఇవన్నీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకపక్షంగా గెలిచే చోట కూడా ఇంత భారీగా అక్రమాలకు పాల్పడటం అంటే.. చిన్న విషయం కాదని.. లోతైన కుట్ర ఉందన్న అనుమానాలు విపక్ష నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో పోలీసు వ్యవస్థ వ్యవహారశైలి అత్యంత వివాదాస్పదంగా మారింది. వైసీపీ నేతలు ఎన్ని చట్టాలు ఉల్లంఘించినా చూసీ చూడనట్లుగా ఉంటున్నారు. కానీ.. టీడీపీ సహా విపక్షాలపై మాత్రం విరుచుకుపడుతున్నారు. అంగళ్లులో చంద్రబాబు పర్యటన విషయంలో ఏం జరిగిదో అందరూ చూసినా టీడీపీ నేతలపైనే కేసులు పెట్టారు.అదీ కూడా వందల మందిపై కేసులు పెట్టారు. తాజాగా ఆ కేసుల్ని చూపించి పుంగనూరు నియోజకవర్గంలో వంద మందికిపైగా రౌడీషీట్లు తెరిచినట్లుగా చెబుతున్నారు. ఒక్క చోట కాదు.. రాష్ట్రం మొత్తం పోలీసులు పూర్తి ఏకపక్షంగా వ్యవహరి్సతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

గుంటూరు జిల్లా క్రోసూరులో వైసీపీ ఎమ్మెల్యే కొడుకు కర్రలతో రెండు వందల మందితో ర్యాలీ చేసి విధ్వంసం సృష్టిస్తే.. పోలీసులు చూస్తూండిపోయారు. ఇలాంటివి లెక్కలేనన్ని జరిగాయి. టీడీపీ క్యాడర్‌పై కనీసం పాతిక వేల కేసులు పెట్టారని.. ఎన్నికల్లో వారిని బైండోవర్ చేయడానికి లేదా.. ఏజెంట్లుగా కూర్చోకుండా చేయడానికేనని అనుమానాలు బలంగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన తమ కూటమిలో బీజేపీ ఉండాలని కోరుకుంటోంది ఆ పార్టీకి ఏదో భారీగా ఓటు బ్యాంక్ ఉందని కాదు. కేవలం ఎన్నికలు నిష్పాక్షికంగా జరగుతాయన్న నమ్మకంతోనే. ఎన్నికల సంఘం కఠినంగా ఉంటే.. ఎన్నికలు పీస్ ఫుల్ గా జరిగిపోతాయి. కానీ వైసీపీ కూడా బీజేపీతో సన్నిహితంగా ఉంది. గత ఎన్నికల సమయంలో ఈసీ .. వైసీపీకి పూర్తి స్థాయిలో సహకరించిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల కోడ్ రాగానే అధికార యంత్రాంగంలో డీజీపీ, సీఎస్ సహా కీలక ఉద్యోగులంతా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించేవారు వచ్చి చేరారని అప్పటి ఎన్నికలను నిశీతంగా పరిశీలించిన వారికి అర్థమవుతుంది. ఎలా చూసినా ప్రజాస్వామ్యానికి ఎన్నికలు ప్రాణం. అందరూ స్వేచ్చగా ఓటు వేసినప్పుడే ప్రజాస్వామ్యం బతుకుతుంది.

హింసాత్మక ఎన్నికల ద్వారా ఫలితాలను ప్రభావితం చేయాలనుకోవడం.. వ్యవస్థల్ని దుర్వినియోగం చేయడం వంటివి .. ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం అవుతాయి. ఓ పార్టీ చొక్కాలు మడతపెట్టమని పిలుపునిస్తే.. తాము కుర్చీలు మడత పెడతామని మరో పార్టీ పిలుపునిచ్చింది. ఇది ఎలా చూసినా ప్రజాస్వామ్య ప్రక్రియ దారి తప్పడమే అవుతుంది.