విశాఖ నార్త్ శంఖారావం సభలో యువనేత నారా లోకేష్ పాల్గొన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ గంటా శ్రీనివాసరావు నేతృత్వంలో బిర్ల జంక్షన్ గ్రౌండ్ వద్ద సభా ప్రాంగణానికి టీడీపీ-జనసేన శ్రేణులు భారీగా చేరుకున్నాయి. ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన లోకేష్ సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఉత్తరాంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. సోమవారం విశాఖ నగరం ఉత్తర నియోజకవర్గంలో నిర్వహించిన ‘శంఖారావం’ సభలో ఆయన మాట్లాడారు. ప్రశాంత వాతావరణం ఉన్న విశాఖను వైసీపీ నేతలు విషాదనగరంగా మార్చేశారని ఆరోపించారు. ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రమే జగన్. నవరత్నాల పేరుతో నవమోసాలు చేశారని మండిపడ్డారు. సంపూర్ణ మద్యనిషేధం అని చెప్పి కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారని ధ్వజమెత్తారు. ఫ్యాన్ రెక్కలు విరగ్గొట్టి చెత్తబుట్టలో పడేయాల్సిన సమయం వచ్చిందన్నారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తుందని, రెండు నెలలు ఓపిక పట్టాలని కోరారు. టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. రూ.5 ఇస్తే పేటీఎం బ్యాచ్ ఏమైనా చేస్తుంది. పవన్‌కల్యాణ్ చెప్పినట్లు ‘హలో ఏపీ.. బైబై వైసీపీ’ నినాదానికి కట్టుబడి ఉండాలి. టీడీపీ కార్యకర్తల కోరిక మేరకు చట్టాన్ని ఉల్లంఘించి ఇబ్బంది పెట్టిన అందరి పేర్లూ రెడ్ బుక్‌లో ఉన్నాయి. వడ్డీతో సహా చెల్లించే బాధ్యతను నేను తీసుకుంటానని లోకేశ్ అన్నారు.