భారత పార్లమెంటు వ్యవస్థ ప్రపంచ ప్రజాస్వామ్యానికి దివిటీగా పేర్కొన్నారు తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ. ఇక్కడ ఆశ్రితపక్షపాతం, బుజ్జగింపులు, లాలింపులు, వ్యక్తి ప్రధాన రాజకీయాలకు తావు లేదని చెప్పుకొచ్చారు. దీంతో ప్రపంచ పార్లమెంటరీ వ్యవస్థల్లో భారత్ ఒక కీలక దిక్సూచిగా మారింది. ఒక నిఘంటువుగా నిలిచింది. అయితే.. రానురాను.. ఈ పార్లమెంటరీ వ్యవస్థపై అనేక సందేహాలు.. సమస్యలు.. అనుమానాలు.. ప్రశ్నలు.. ముసురుకుంటున్నాయి. ఏకపక్ష రాజకీయాలు, వ్యక్తి పూజలు, పార్టీల ఒంటెత్తు పోకడలు.. వంటివి పెరిగాయి. దీంతో పార్లమెంటరీ వ్యవస్థ ఇప్పుడు శీలపరీక్షకు నిలబడాల్సిన పరిస్థితి ఎదురవుతోందన్న మేధావుల మాట తరచుగా వినిపిస్తూనే ఉంది. తాజాగా పార్లమెంటులో అత్యంత కీలకమైన రాజ్యసభకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నెల 27న దానికి ముహూర్తం కూడా ఖరారు చేశారు. 56 మంది సభ్యులు రానున్న ఏప్రిల్‌లో పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆయా స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. దీంతో అసెంబ్లీలలో పార్టీలకు ఉన్న ఉన్న మెజారిటీ ఆధారంగా ఆయన స్థానాలు దక్కనున్నాయి.
అయితే.. దీనికి కూడా ఎన్నికల నిర్వహణ కీలకం. అందుకే ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఇంతలోనే ఏకగ్రీవాలు తెరమీదికి వచ్చాయి. ఏకంగా 41 స్థానాల్లో నాయకులు ఏకగ్రీవమయ్యారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డాతోపాటు 41 మంది అభ్యర్థులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక, బీజేపీ నుంచి 20 మంది, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరుగురు, పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ నుంచి నలుగురు, ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్సార్ సీపీ నుంచి ముగ్గురు, బిహార్ ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ నుంచి ఇద్దరు, ఒడిశా అధికార పార్టీ బీజేడీ నుంచి ఇద్దరు, మహారాష్ట్రకు చెందిన ఎన్‌సీపీ, శివసేన పార్టీల నుంచి ఒక్కొక్కరు, తెలంగాణ ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్, బిహార్ అధికార పార్టీ జేడీ యూ నుంచి ఒక్కొక్కరు ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు.
ఈ ఏడాది ఏప్రిల్ 2వతేదీన కొన్ని, 3వ తేదీన కొన్ని రాజ్యసభలో మొత్తం 56 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. 50 మంది సభ్యులు ఏప్రిల్ రెండో తేదీన, మరో ఆరుగురు మూడో తేదీన పదవీ విరమణ చేయనుండడంతో ఈ ఎన్నికలు జరపాల్సి వచ్చింది. 41 సీట్లు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 15 స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి.
+ ప్రముఖ జర్నలిస్టు సాగరిక ఘోష్(రాజ్‌దీప్ సర్దేశాయ్ సతీమణి)
+ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్
+ కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ఎల్.మురుగన్
+ కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ
+ బీజేపీ చీఫ్ జేపీ నడ్డా
+ బీజేపీకి చెందిన చున్నిలాల్ గరాసియా, మదన్ రాథోడ్
+ వజ్రాల వ్యాపారి గోవింద్‌భాయ్ ధోలకియ
ఏపీ నుంచి
+ గొల్ల బాబూరావు
+ వైవీ సుబ్బారెడ్డి
+ మేడా రఘునాథ రెడ్డి
తెలంగాణ నుంచి
అనిల్ కుమార్ యాదవ్(కాంగ్రెస్)
రేణుకాచౌదరి(కాంగ్రెస్)
వద్దిరాజుకు(బీఆర్‌ఎస్)
పెద్దల సభ అంటేనే.. ప్రజాస్వామ్యానికి చాలా కీలకం. లోక్‌సభలో ఎన్నికైన ప్రజాప్రతినిదులు ఉన్నా.. పెద్దల సభ ప్రాధాన్యాలు వేరేగా ఉంటాయి. ఇలాంటి స్థానాల్లోకి వచ్చేవారు.. అత్యంత అనుభవజ్ఞులై ఉండాలన్నది.. రాజ్యాంగ నిర్మాతలు `సూచించిన` మాట. అయితే.. రాను రాను.. పార్టీలకు నచ్చినవారు.. తమకు మేళ్లు చేసేవారు.. తమ అనుంగులకు పెద్దల సభ సీట్లను పప్పు బెల్లాల్లా పంచి పెడుతున్నారనే వాదన ఉంది. ఇదిలావుంటే, ఒకవేళ అసెంబ్లీలో మెజారిటీ ఉంది కాబట్టి ఇలా ఏకగ్రీవం చేస్తే తప్పేంటనే ప్రశ్న వస్తుంది. కానీ.. ఇలాంటి సందర్భాల్లోనూ ఎలా వ్యవహరించాలో.. ప్రజాప్రాతినిధ్య చట్టంలో పేర్కొన్నారు. అయితే.. ఇది సూచన మాత్రమే ఎవరూ పాటించడం లేదు.
+ అసెంబ్లీలో ఒక పార్టీకి సంఖ్యా బలం ఉన్నప్పటికీ.. పార్టీ అధ్యక్షుడు రాజ్యసభకు ఎంపిక చేసే అభ్యర్థుల జాబితాను ఎమ్మెల్యేలకు పంపి.. వారి నుంచి మెజారిటీ తీసుకోవాలి. వారు కాదంటే.. వేరే వారిని ఎంపిక చేయాలి. మేధావులకు, విద్యావంతులకు అవకాశం ఇవ్వాలి. కానీ, ఇప్పుడు అలా చేయలేదు. ఏ పార్టీకి ఆ పార్టీ స్వార్థంగానే ముందుకు సాగింది.
+ మహారాష్ట్రలో నిన్నగాక మొన్న బీజేపీలోకి వచ్చిన చవాన్‌కు రాజ్యసభసీటు ఇచ్చేయడం దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. దీంతో ఏకగ్రీవాలు ఎప్పటికీ మంచిది కాదన్న రాజ్యాంగ నిర్మాతల మాట మరోసారి తెరమీదికి వచ్చంది.